మట్టి లూటీ!

Sand Mafia In Contractors Krishna - Sakshi

బుడమేరు ఆధునికీకరణ పనుల్లో యథేచ్ఛగా మట్టి దోపిడీ

పట్టించుకోని రెవెన్యూ, డ్రైనేజీ శాఖల అధికారులు

కాంట్రాక్టరుకు కాసుల పంట

కంకిపాడు: పేరుకేమో ఆధునికీకరణ పనులు. జరిగేదేమో కాసుల వేట. బుడమేరు ఆధునికీకరణ పనులను అడ్డం పెట్టుకుని పెద్దలు మట్టిని    కొల్లగొడుతున్నారు. అక్రమంగా మట్టిని బయటకు తరలించి జేబులు నింపుకుంటున్నారు. అనుమతులు లేకుండా మట్టి తరలిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఈ పనులపై పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బుడమేరు ఆధునికీకరణ పనుల్లో భాగంగా కంకిపాడు నుంచి కొల్లేరు వరకూ దిగువున పనులు పూర్తయ్యాయి. విజయవాడ సమీపంలోని నిడమానూరు నుంచి మండలంలోని మంతెన గ్రామం వరకూ ఉన్న బెల్టు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ఈ పనులకు అనుమతి వచ్చింది. రూ 8 కోట్లు నిధులు కేటాయించారు. గుడివాడకు చెందిన ఓ కాంట్రాక్టర్‌ ఈ పనులను చేపట్టారు. మండలంలోని వేల్పూరు, ఉప్పులూరు, మంతెన గ్రామాల్లో బుడమేరు ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఉప్పులూరు వద్ద బుడమేరు బ్రిడ్జికి కూత వేటు దూరంలో బుడమేరుకు రెండు వైపులా ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 23 అడుగుల నుంచి 60 అడుగుల వరకూ బుడమేరును విస్తరించనున్నట్లు డ్రైనేజీ విభాగం అధికారులు చెబుతున్నారు.

అడ్డగోలుగా మట్టి దోపిడీ
ఆధునికీకరణ పనుల మాటున ఇక్కడ మట్టి దోపిడీ జరుగుతుంది. నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లు, హెవీ లోడు లారీల్లో మట్టిని బయట ప్రాంతాలకు తరలించేస్తున్నారు. ట్రాక్టరుకు రూ.300, లారీకి రూ. 600 నుంచి రూ.1200 వరకూ సీనరేజీ కూడా వసూలు చేస్తున్నట్లు సమాచారం. నాలుగు పొక్లెయిన్‌లతో మట్టిని లారీలు, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. పగలూ, రాత్రి కూడా ఈ ప్రక్రియ యధావిధిగా సాగిపోతుంది. ఇక్కడి నుంచి సమీపంలోని గన్నవరం మండలంలోని గ్రామాలతో పాటు, ఉప్పులూరు, మంతెన, తెన్నేరు, మారేడుమాక, కంకిపాడు, ఈడుపుగల్లు, విజయవాడ పరిసర ప్రాంతాలకు తరలించేస్తున్నారు. దీనికిగానూ దగ్గరలో ఉన్న గ్రామానికి ట్రాక్టరు మట్టి రూ వెయ్యి, దూరాన్ని బట్టి రూ.1500 నుంచి రూ.2 వేలు వరకూ వసూలు చేస్తున్నారు. లారీల్లో మట్టి అయితే ఆ ధర లెక్కేలేదు. దూరాన్ని బట్టి, అవసరాన్ని మట్టి లారీల యజమానులు వసూలు చేసుకుంటున్నారు.

అధికారుల తీరుపై విమర్శలు
ఆధునికీకరణ పనులు విషయంలో డ్రైనేజీ విభాగం అధికారుల పర్యవేక్షణ లేదనే విమర్శ వినిపిస్తుంది. పర్యవేక్షణ ఉండి ఉంటే మట్టి అడ్డగోలుగా బయటకు పోయేది కాదని స్థానిక రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారంటే వారి ప్రమేయం పైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీరి సహకారంతోనే మట్టి దోపిడీ సాగుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పట్టించుకోని రెవెన్యూ అధికారులు
గ్రామం నుంచి వందల సంఖ్యలో మట్టి లోడుతో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా రెవెన్యూ యంత్రాంగం కనీసం ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. పల్లంగా ఉన్న పొలాల్లో మెరక చేసేందుకు మట్టిని భారీగా తరలిస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లోని రియల్‌ వెంచర్లకు సైతం మట్టి రవాణా అయినట్లు తెలిసింది. పొలం మెరకకు అనుమతులు పొంది మెరక చేసుకోవాలనే నిబంధన ఉంది. కానీ నిబంధనలు ఉల్లంఘించి మెరక చేస్తున్నా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top