బీచ్‌రోడ్డులో ఇసుక లారీ బీభత్సం

Sand Lorry Accident in Beach Road Visakhapatnam - Sakshi

జన సంచారం లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం

విశాఖపట్నం , అల్లిపురం(విశాఖ దక్షిణ): బీచ్‌రోడ్డు నోవాటల్‌ డౌన్‌లో ఇసుకలారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుకుని జీవీఎంసీ గోడను ధ్వంసం చేసి సమీపంలోని చిన్నపిల్లల పార్కు వరకు దూసుకుపోయింది. వేకువజామున కావడంతో జనసంచారం లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. మహారాణిపేట పోలీసులు, లారీ డ్రైవర్‌ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం... పంజాబ్‌ లారీ శ్రీకాకుళం నుంచి విశాఖలో ఫిషింగ్‌ హార్బర్‌కు ఇసుకలోడుతో వస్తుంది. గురువారం వేకువజామున 4గంటల సమయంలో జిల్లా కోర్టు రోడ్డు నుంచి పందిమెట్ట మీదుగా నోవాటల్‌ డౌన్‌ దిగుతుంది. ఆ సమయంలో ఒక్కసారిగా లారీ బ్రేకులు ఫెయిల్‌ కావడంతో డ్రైవర్‌ రాంబాబు లారీని అదుపు చేయలేక ఎదురుగా గల ఫుట్‌పాత్‌ను ఢీకొని, సందర్శకులు కూర్చునే గోడను ఢీకొట్టడంతో అవతల రోడ్డులోకి ఒరిగిపోయింది. దీంతో లారీ ముందు చక్రాలు, సాసీ విరిగిపోవడంతో అక్కడ కూలబడిపోయింది. లారీ ప్రమాదానికి గురైన సమయంలో డ్రైవర్‌తో పాటు క్లీనర్, ముగ్గురు కూలీలు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

వేకువజామున 4గంటల సమయంలో కావడంతో అంతగా జనసంచారం లేకపోవడంతో ప్రమాదతీవ్రత తగ్గింది. గతంలో ఇక్కడే 2016లో స్కూల్‌బస్సు ఒకటి డౌన్‌లో బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన నగరవాసులు మరిచిపోక ముందే మరో ప్రమాదం అదే ప్రదేశంలో చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top