పజాకాంక్షను పట్టించుకోని సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు రాష్ట్ర విభజనకు సహకరించడం సిగ్గుచేటని సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ఆచార్య
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్:పజాకాంక్షను పట్టించుకోని సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు రాష్ట్ర విభజనకు సహకరించడం సిగ్గుచేటని సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్.శ్యామ్యూల్ విమర్శించారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ లయన్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో ప్రతినిధులు స్థానిక హిందూ కళాశాల సెంటర్లోని రాజకీయ జేఏసీ వేదికపై ఆదివారం రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా లయన్స్‌క్లబ్ సభ్యులకు సంఘీభావం పలికిన ఆచార్య శ్యామ్యూల్ మాట్లాడుతూ కేంద్ర మంత్రులు, ఎంపీలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడి ఓట్లేసి గెలిపించిన ప్రజలను నమ్మించి మోసగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ విభజనకు వ్యతిరేకంగా పోరాడని ప్రజా ప్రతినిధులు, ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజాభీష్టంతో పనిలేకుండా అధికారం అనుభవించేందుకు సిగ్గు పడకపోవడం స్వార్ధ రాజకీయాలకు నిదర్శనమన్నారు. రిలే దీక్షలో కూర్చున్న లయన్స్ క్లబ్ సభ్యులు బాలస్వామి, లూకా, కేవీ నగేష్, రూప చంద్రరావు, ఈవీ ఫణికిషోర్, సీహెచ్ కృష్ణ ప్రసాద్, కోటేశ్వరరావు, డి.అప్పారావు, వాసిరెడ్డి కృష్ణమూర్తికి సమైక్యాంధ్ర జేఏసీ గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు, గ్రంధి పార్ధసారధి, వణుకూరి సరోజ, లింగాల సాయియాదవ్ సంఘీభావం తెలిపారు.