అడుగడుగునా నిరసన | Samaikyandhra bandh Effect In Prakasam District | Sakshi
Sakshi News home page

అడుగడుగునా నిరసన

Dec 7 2013 5:03 AM | Updated on Sep 27 2018 5:59 PM

కేంద్ర కేబినెట్ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంపై జిల్లా భగ్గుమంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాద, విద్యార్థి జేఏసీ, సమైక్యాంధ్ర ఫ్రంట్‌లు ఆందోళనలు ముమ్మరం చేశాయి.

ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: కేంద్ర కేబినెట్ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంపై జిల్లా భగ్గుమంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాద, విద్యార్థి జేఏసీ, సమైక్యాంధ్ర ఫ్రంట్‌లు ఆందోళనలు ముమ్మరం చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చి రాస్తారోకోలు, బంద్‌లు, నిరసనలు చేస్తుంటే మరోవైపు మిగిలిన వర్గాల ప్రజలూ నిరసన బాట పట్టారు.
 
 హైవే దిగ్బంధం:
 రాష్ట్ర విభజన నిర్ణయానికి ఆగ్రహించిన విద్యార్థి జేఏసీ నాయకులు ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్‌పై బైఠాయించారు. స్థానిక రావ్‌అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీ వద్ద హైవేపై నిరసన తెలిపారు. విద్యార్థి జేఏసీ నాయకుడు రాయపాటి జగదీష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. విద్యార్థి జేఏసీతో పాటు ఒంగోలు న్యాయవాదుల జేఏసీ నాయకులు, యువజన జేఏసీ నాయకులు కూడా హైవే దిగ్బంధంలో పాల్గొన్నారు. దక్షిణ బైపాస్ కూడలిలో సమైక్యాంధ్ర ఫ్రంట్ అధ్యక్షుడు నాగరాజు, కన్వీనర్ రాజశేఖర్ తమ అనుయాయులతో బైఠాయించి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై దాదాపు గంటకుపైగా వాహనాలు నిలిచిపోయాయి. ఒంగోలు రూరల్ సీఐ శ్రీనివాసన్ ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
 
 కోర్టు ముందు రాస్తారోకో..
 ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణం ఎదుట న్యాయవాద జేఏసీ, విద్యార్థి, యువజన జేఏసీల ఆధ్వర్యంలో అర్ధగంట పాటు రాస్తారోకో చేశారు. న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. ఒంగోలు డీఎస్పీ జాషువా ఆందోళనకారులను అరెస్టు చేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఆ తరువాత విద్యార్థి జేఏసీ, సమైక్యాంధ్ర ఫ్రంట్ నాయకులు నగరంలో బ్యాంకులు, కార్యాలయాలు, దుకాణాలు మూయించారు. కలెక్టరేట్‌లోని సిబ్బంది నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక చర్చి సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు.
 
 జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు మూసేయడంతో పాలన స్తంభించింది. కందుకూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. జేఏసీ నాయకులు ముప్పూరి చంద్ర, పోరూరి చంద్రకాంత్, బెజవాడ కృష్ణయ్య, పాలేటి కోటేశ్వరరావుల ఆధ్వర్యంలో పూర్తిస్థాయి బంద్ పాటించారు. చీరాలలో ఉద్యోగ జేఏసీ నాయకులు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. పట్టణంలో దుకాణాలు మూయించారు. జేఏసీ నాయకుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో నాయకులు బంద్ విజయవంతం చేశారు. దర్శిలో న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు. నిరసన ర్యాలీ నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని నినదించారు. కొండపిలో ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలను మూయించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు నిరసనలో పాల్గొని ప్రధాన సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. రోడ్డుపైనే ఆటలాడి నిరసన వ్యక్తం చేశారు. పర్చూరు, గిద్దలూరు, సంతనూతలపాడు, అద్దంకి, యర్రగొండపాలెం, కనిగిరిల్లో ఎన్‌జీఓలు, ప్రభుత్వ ఉద్యోగులు  నిరసన తెలుపుతూ విధులు బహిష్కరించారు. కనిగిరిలో న్యాయవాదులు కోర్టు విధులకు హాజరు కాకుండా నిరసన తెలిపారు.
 
 మంత్రి, ఎంపీ రాజీనామాలు చేయకుంటే తిరగనివ్వం:
 జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిలు తక్షణమే రాజీనామాలు చేయాలని, లేకుంటే జిల్లాలో తిరగనిచ్చేది లేదని విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో.కన్వీనర్ రాయపాటి జగదీష్ తెగేసి చెప్పారు. సీమాంధ్రకు ఇంత అన్యాయం జరుగుతున్నా నేతలు పదవుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు దద్దమ్మలుగా మారిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రివర్గ నిర్ణయంతోనే ఆగిపోవాలని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement