సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలు, పోటాపోటీ ధర్నాలతో విద్యుత్‌సౌధ దద్దరిల్లింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలు, పోటాపోటీ ధర్నాలతో విద్యుత్‌సౌధ దద్దరిల్లింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోమవారం సమైక్యాంధ్రను కోరుతూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి చేస్తున్న అసత్య ప్రచారాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పోటాపోటీగా ధర్నాలు నిర్వహించాయి. సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగులు ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రభాకర్‌ను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు యత్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
మరికొంత మంది కార్యకర్తలు సీమాంధ్ర ఉద్యోగుల ధర్నా శిబిరం వైపు వెళ్లి జై తెలంగాణ నినాదాలు చేశారు. కొందరు మహిళా ఉద్యోగులు ప్రతిగా సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయిం చారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి టీఆర్‌ఎస్ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఆర్. నాగరాజుగౌడ్, జగన్, సతీష్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారన్న వార్త తెలుసుకున్న తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు నినాదాలు చేస్తూ పెద్దఎత్తున సమైక్యాంధ్ర ఆందోళన శిబిరం వైపు పరుగులు తీశారు.
అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కుట్రలకు నిలయంగా మారిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు దుయ్యబట్టారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ధర్నాలో ఆయన మాట్లాడుతూ కేంద్రం తెలంగాణ ప్రకటించడంతోనే సీమాంధ్ర నేతల వికృత రూపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతామని ఢిల్లీ పెద్దలు చేతులు జోడించి చెప్పేవరకు ఉద్యమాన్ని ఆపొద్దని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. 2009 డిసెంబర్ 9 ప్రకటన మన ఉద్యమం వల్లనే తోకముడిచిందని, ఇప్పుడు కూడా అదేస్ఫూర్తిని కొనసాగించాలని ఆయన కోరారు.