అవినీతి ‘ముద్దర’

Sakshi Special Story On TDP Leader Mudraboina Venkateswara Rao Corruption In Krishna

నూజివీడులో టీడీపీ ఇన్‌చార్జి ముద్దరబోయిన, అనుచరుల దందా

అధికారం అండతో మట్టి దోపిడీకి తెర

అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి

కమీషన్ల పేరిట రూ. కోట్లు దోపిడీ

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ఆయన అధికారపార్టీకి చెందిన నియోజకవర్గ సమన్వయకర్త. అధికారంలో ఉన్నది తమ పార్టీయే కదా అనే ధీమాతో తన అనుచరులతో కలిసి అవినీతికి ఆకాశమే హద్దు అన్నట్లు చెలరేగిపోయాడు.. ‘నీరు–చెట్టు’లో మట్టి దోపిడీకి తెరతీశారు.. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క మట్టి అక్రమ తరలింపులోనే  ఈయన, అనుచరులు  రూ.100 కోట్లు వెనకేశారంటే ఈయన నడిపిన దందా అర్థమవుతోంది.. ఈయన వెంట ఉన్న చోటామోటా నాయకులకు ఒకప్పుడు ద్విచక్రవాహనాలకు కూడా దిక్కులేకపోగా నేడు ఖరీదైన కార్లలో దర్జాగా తిరుగుతున్నారు.. ఒక్క మట్టిదోపిడే కాకుండా ఇసుక అక్రమ రవాణా,   రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణంలో కమీషన్లు, పేదలకు ఇచ్చే కార్పొరేషన్‌ రుణాల్లో వసూళ్ల దందా, చివరకు మరుగుదొడ్ల కేటాయింపు, నిర్మాణంలోనూ అవినీతి కంపు.. ఇలా కాదేదీ అవినీతికి అనర్హం అన్నట్లుగా అన్నిరంగాల్లో తన దందా కొనసాగించారు. ఆయనే నూజివీడు టీడీపీ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. అగ్నికి ఆజ్యం తోడైనట్లు పక్క జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చింతమనేని ఇక్కడ తమ్మిలేరులోనూ తన హవా కొనసాగించడంతో ఇసుక దోపిడీ భారీ స్థాయిలో జరిగి ఏరులు, చెరువులు తమ రూపునే కోల్పోయిన దుస్థితి ఏర్పడింది.

పోలవరం మట్టి మాఫియా
పోలవరం కుడికాలువపైన ఉన్న మట్టిని అధికార టీడీపీకి చెందిన మట్టిమాఫియా లక్షలాది క్యూబిక్‌ మీటర్లు అమ్ముకుని కోట్లాది రూపాయలు ఆర్జించారు. రాత్రి,పగలు అనే తేడా లేకుండా తరలించారు. తవ్విన మట్టిని తవ్వినట్టే విక్రయించేసి సొమ్ము చేసుకున్నారు. ఇక్కడి మట్టి పల్లెర్లమూడి పరిధిలో ఉన్న  క్వారీ గోతులకు, పలువురు రైతుల తోటలకు,  హనుమాన్‌జంక్షన్, గుడివాడ వంటి దూరప్రాంతాలకు తరలిపోయింది. ఈ గ్రామ పరిధిలో ఎర్రచెరువుకు ఎగువభాగాన ఉన్న దాదాపు 15 ఎకరాల క్వారీ గోతులను పూడ్చివేశారు. ఈ గోతులు 20 నుంచి 25 అడుగుల లోతులో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి.  పల్లెర్లమూడి వద్ద నుంచి మర్రిబంధం వరకు పోలవరం కాలువను తవ్వతే  8.30లక్షల క్యూబిక్‌మీటర్ల మట్టి రాగా  అందులో  దాదాపు 5 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని అమ్మేసుకున్నారు. క్యూబిక్‌మీటరు మట్టికి ప్రభుత్వం రూ.30 ఇస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే  తరలిపోయిన  మట్టి విలువ రూ.1.50కోట్లు ఉంది. కేవలం నెలరోజుల వ్యవధిలో ఇంత పెద్దమొత్తంలో  మట్టిని అమ్ముకున్నారు.  ఏలూరు ఎంపీకి అనుచరుడిగా చెప్పుకునే టీడీపీకి చెందిన పల్లెర్లమూడికి చెందిన  గ్రామనాయకుడు మట్టిని అమ్ముకోవడంలో కీలకపాత్ర పోషించాడు.  

కార్పొరేషన్‌ రుణాల్లోనూ కమీషన్లు
నియోజకవర్గ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా మంజూరైన రుణాలకు ఇచ్చే రాయితీని కూడా టీడీపీ నాయకులు వదిలిపెట్టలేదు. రుణాలు మంజూరు చేయాలంటే లబ్ధిదారులు టీడీపీ నాయకులకు కమిషన్‌ ముట్ట జెప్పాల్సిందే.. ముద్దరబోయిన అనుచరులు ఈదందా నడిపించారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలో 50శాతం వరకు కమీషన్‌ వసూలు చేశారు. నూజివీడు పట్టణానికి చెందిన నాయకుడు ఒకరు పెద్ద ఎత్తున కమీషన్‌లు వసూలు చేయడం జరిగింది. అలాగే నూజివీడు మండలలోని ఒక ప్రజాప్రతినిధి సైతం కమీషన్‌లు బొక్కడం జరిగింది. కార్పొరేషన్‌ రుణాల మంజూరుకు ఏర్పాటు చేసిన స్క్రీనింగ్‌ కమిటీలు సైతం యూనిట్‌లు ఏర్పాటు చేయకుండానే లబ్ధిదారులకు బ్యాంకు రుణం ఇప్పించి సబ్సిడీలో సగం వసూలు చేస్తున్నారు. ముసునూరు మండలంలో రమణక్కపేటలో టీడీపీ నాయకుడు రంగు వెంకటేశ్వరరావు కొందరి పేర్లతో వారికి తెలియకుండానే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి వచ్చిన కమీషన్‌  దాదాపు రూ.20లక్షల వరకు స్వాహా చేశాడు.

రోడ్ల నిర్మాణంలో వాటా ఇవ్వాల్సిందే.. 
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో కమీషన్ల దందా సాగించి రూ. కోట్లు పోగేశారు. సర్పంచుల పదవీకాలం పూర్తయిన నాటి నుంచి ఈ దందా మరింత పెరిగి ప్రతి పనిలో 10శాతం వరకు కమీషన్‌ రూపంలో వసూలు చేస్తున్నట్లు సొంతపార్టీలోనే ప్రచారం జరిగింది. ఈ కమీషన్ల దందా కోసం కావాలనే వేరే డివిజన్‌లో పనిచేసే పంచాయతీరాజ్‌ డీఈని నూజివీడు డివిజన్‌కు ఇన్‌చార్జి ఈఈగా నియమించినట్లు సమాచారం. ఉపాధిహామీ, జడ్పీ, ఎంపీ నిధులు, ఇతర గ్రాంట్లు ద్వారా వచ్చే నిధులు కలిపి నియోజకవర్గంలో గత నాలుగున్నరేళ్ల కాలంలో రూ.42కోట్లు పనులు జరగగా, ఈ ఏడాదికి రూ.33కోట్లు మంజూరయ్యాయి. ఈ పనుల్లో 10 శాతం కమీషన్‌ రూపంలో ముద్దరబోయినకు దక్కినట్లు సమాచారం. ఇదే కాకుండా తన బినామీలతో నీరు–చెట్టు పనుల్లో భాగంగా చెరువుల్లో తవ్విన మట్టిని విక్రయించి పోగేసిన సొమ్ములోనూ ఆయనకు పెద్ద ఎత్తున వాటా ఉన్నట్లు తెలుస్తోంది. 

చింతమనేని హవా..
ముసునూరు మండలాన్ని ఆనుకొని ఉన్న తమ్మిలేరులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇసుకదందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. రోజుకు 100 నుంచి 200 ట్రాక్టర్‌ల వరకు ఇసుకను అక్రమంగా తవ్వేస్తూ వందల కోట్లు ఆర్జిస్తున్నారు. ట్రక్కు ఇసుక రూ.3వేల నుంచి రూ.4వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణ ప్రజలు ఎవరైనా ఇంటివద్ద అవసరం కోసం ఒక ట్రక్కు ఇసుకను తెచ్చుకుంటుంటే  ట్రాక్టర్లను సీజ్‌చేసి జరిమానాలు విధించే అధికారులు, ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నా అటువైపు కన్నెత్తి చూడరు. బలివే సమీపంలోని రంగంపేట వద్ద చింతమనేని ఇసుక దోపిడీని అడ్డుకోవడానికి ప్రయత్నించిన నేపధ్యంలోనే అప్పటి ముసునూరు తహసీల్దార్‌ దోనవల్లి వనజాక్షిపై తన అనుచరులతో దాడి చేయించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అలాగే లోపూడి, గుళ్లపూడి, వలసపల్లి, యల్లాపురం, రంగంపేట,  బలివేల వద్ద నుంచి ముసునూరు మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యుడు చిలుకూరి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు కొల్లిగంగారామ్, చిల్లబోయినపల్లి బుజ్జి తదితరులు ట్రాక్టర్లలో ఇసుకను విక్రయిస్తూ రూ.లక్షలు ఆర్జించారు. ఈ అక్రమార్జనలోనూ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు రూ. కోట్లు కప్పం కట్టినట్లు సమాచారం. 

మరుగుదొడ్లలో అవినీతి కంపు..

నూజివీడు మండలంలోని మరుగుదొడ్ల నిర్మాణాల్లో సైతం అవినీతి తారాస్థాయికి చేరింది. ముక్కొల్లుపాడు, సిద్ధార్థనగర్‌లలో నిర్మించిన మరుగుదొడ్లు  అసంపూర్తిగా ఉండటం, వాటికి సంబంధించిన నిధులను మాత్రం అధికార టీడీపీ నాయకులు పూర్తిగా డ్రాచేసుకుని జేబులో వేసుకోవడం జరిగిపోయింది. ముక్కొల్లుపాడును ఇంటిలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు దత్తత తీసుకోగా, గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తన అనుచరుడితో  350 మరుగుదొడ్లు నిర్మించగా అందులో ఇంకా 150 మరుగుదొడ్లు వరకు అసంపూర్తిగానే ఉన్నాయి. కాని వాటికి సంబంధించిన నిధులను కూడా పూర్తిచేయకుండా బొక్కేశారు. అలాగే సిద్ధార్థనగర్‌లో కూడా 200వరకు మరుగుదొడ్లు మంజూరు కాగా గ్రామస్థాయి టీడీపీ నాయకుడు అందులో సగం మాత్రమే నిర్మించి, మిగిలిన వాటిని అసంపూర్తిగా నిర్మించేసి నిధులను మాత్రం తన జేబులో వేసేసుకున్నాడు. ఇలా అవకాశం లేని చోట కూడా అవకాశం కల్పించుకుని ప్రజాధనాన్ని స్వాహా చేశారు. 

నీరు– చెట్టు పనుల్లో రూ.100కోట్లు లూటీ
నియోజకవర్గంలో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో చేపట్టిన నీరు చెట్టు పనుల్లో మట్టిని విచ్చలవిడిగా విక్రయించి అధికారపార్టీ నాయకులు  రూ.100 కోట్ల పైన లూఠీ చేశారు. నాలుగున్నరేళ్లలో నూజివీడు మండలంలో రూ.28 కోట్లు, ముసునూరు మండలంలో రూ.24 కోట్లు, చాట్రాయి మండలంలో రూ.6 కోట్లు, ఆగిరిపల్లి మండలంలో రూ.5 కోట్లు చొప్పున మొత్తం రూ.63కోట్లు విలువైన పనులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీనిలో పొక్లెయిన్‌కు లోడింగ్‌ ఖర్చు కింద క్యూబిక్‌ మీటర్‌కు రూ.29 చొప్పున ప్రభుత్వం చెల్లించగా, టీడీపీ నాయకులు చెరువులలో మట్టిని ట్రక్కు రూ.500 నుంచి రూ.1,000 వరకు విక్రయించుకున్నారు. దాదాపు వేలాది ట్రిప్పుల మట్టిని విక్రయించి రూ.100కోట్ల పైనే దోచుకున్నారు. ప్రభుత్వమే నీరు–చెట్టు కింద లోడింగ్‌కు రూ.60కోట్ల వరకు చెల్లించిందంటే మట్టిని అమ్ముకోవడం ద్వారా ఎంత విక్రయించారో అర్ధమవుతోంది. నూజివీడు మండలంలోని చెరువుల్లోని మట్టి అంతా రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లకు వెంచర్‌ల నిర్వాహకులకు, పట్టణంలోని నివేశన స్థలాలకు తోలి విక్రయించుకున్నారు. అంతేగాకుండా ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులను సైతం నీరు చెట్టు పనుల్లో చేపట్టినట్టుగా చూపించి దోచుకున్నారు. టీడీపీ నాయకులు చేసిన మట్టి దందాతో కొన్ని చెరువులు తమ రూపురేఖలనే కోల్పోవడం గమనార్హం.  చాట్రాయి పెద్దచెరువు, దీప చెరువుల్లో రూ.30లక్షలతో చేసిన పనులను తూతూమంత్రంగా చేసి లక్షలు దోచుకున్నారు.

  • నూజివీడు మండలం సుంకొల్లు, కొన్నంగుంట తదితర గ్రామాల్లోని చెరువుల్లోని మట్టిని, గ్రావెల్‌ను టీడీపీ ఎస్టీసెల్‌ జిల్లా అధ్యక్షుడు బాణావతు బద్రు, తలపంటి రాజశేఖర్‌ తదితరులు ట్రక్టు రూ.500  నుంచి రూ.1,000  వరకు రోడ్లనిర్మాణానికి, వెంచర్ల అభివృద్ధికి అమ్ముకున్నారు. 
  • నూజివీడు పట్టణంలోని టీడీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ చెరుకూరి దుర్గాప్రసాద్‌ నూజివీడు పెద్ద చెరువు, పోతురెడ్డిపల్లిలోని చెరువులలోను, ముసునూరు మండలంలోని చెరువులలోని మట్టిని ఇటుకబట్టీల వారికి, నివేశనస్థలాల వారికి, కాంట్రాక్టర్‌లకు విక్రయించి కోట్లు ఆర్జించారు.
  • ముసునూరు మండలం లోపూడిలో కోమటి చెరువు, పెద్దచెరువు, కొత్తచెరువులలో నీరు చెట్టు పనులు చేసిన టీడీపీ నాయకులు వేంపాటి రామచంద్రరావు, వేంపా టి.శ్రీనివాసరావులు రూ.లక్షలు కొల్లగొట్టారు. 
  • కొత్తూరు చెరువులో అనుమతిలేకుండా గ్రావెల్‌ తవ్వుతుండగా విజిలెన్స్‌ అధికారులు సైతం యంత్రాలను సీజ్‌ చేయడం జరిగింది. 
  • టీడీపీ జిల్లా కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, చనుబండ పెద్ద చెరువులో నీరుచెట్టు పని నిర్వహించి, అందులో మట్టిని విక్రయించి రూ.30లక్షలు వరకు దోచుకున్నారు. ఇదే వ్యక్తి చేసిన సీసీ రోడ్లు సైతం నాసిరకంగా ఉండి అడ్డంగా బీటలు వారుతున్నాయి. 
  • కోటపాడు గ్రామంలో మంచిన పూర్ణచంద్రరావు అనే టీడీపీ నాయకుడు గ్రామంలోని నాలుగు చెరువుల్లో రూ.30లక్షలతో నీరుచెట్టు పనులు చేసి లక్షలు ఆర్జించాడు. ఉపాధిహామీ పథకంలో చేసిన పనులను సరిచేసి నీరు–చెట్టులో దోచుకున్నారు. 
  • పోలవరం గ్రామంలో టీడీపీ వ్యక్తులు శ్మశానం స్థలాన్ని ఆక్రమించుకుని లైవ్‌ఫిష్‌ వ్యాపారం చేస్తున్నారు. ఈ గ్రామంలో రూ.40లక్షలతో నిర్వహిం చిన పనుల్లో  మంత్రి దేవినేని ఉమా అనుచరుడని చెప్పుకునే తెలుగు యువత జిల్లా కార్యదర్శి మరిడి  వెంకటేశ్వరరావు ప్రధాన పాత్ర పోషించి మట్టిని కొల్లగొట్టారు. 
  • మండలంలోని పల్లెర్లమూడి వద్ద పోలవరం కాలువ తవ్వగా వచ్చిన మట్టిని సైతం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మింగేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని ట్రాక్టర్లలో, లారీలలో తరలించి విక్రయించడం ద్వారా లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top