నిబంధనలు పాటించాల్సిందే

అరసవల్లి: ‘మేము ఇంతవరకు జాతీయ రహదారులపైనే దృష్టి పెట్టాం. నగరంలో ఆటోలను పెద్దగా పట్టించుకోలేదు. ఒకవేళ దృష్టి సారిస్తే మాత్రం మీరు ఇబ్బందులు పడతారు.. జాగ్రత్త..   కచ్చితంగా నిబంధనల ప్రకారం ఆటోలు నడపాల్సిందే..’’ అంటూ జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ ఆటో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. శనివారం సాయంత్రం జెడ్పీ సమావేశ మందిరంలో రవాణా శాఖ, పోలీసు శాఖల సంయుక్తంగా నిర్వహించిన రహదారి భద్రతపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఈ ఏడా ది జనవరి నుంచి మార్చి వరకు మన జిల్లాయే ప్రమాదాల్లో మొదటి స్థానంలో ఉందని, ఇప్పుడు పలు భద్రతా చర్యల కారణంగా ఆ స్థానం మారిందని గుర్తుచేశారు. ప్రమాదాల నివారణలో పోలీసులదే బాధ్యత కాదని, డ్రైవర్లు కూడా పూర్తి బాధ్యత వహించాల్సి ఉందని స్పష్టం చేశారు. అవగాహన లోపంతోనే జిల్లాలో ప్రమాదాలు జరుగుతున్నాయ ని చెప్పారు. నిబంధనలను పాటించే క్రమంలో నగరంలో మొదట ఆదర్శంగా ఐదుగురు సీనియర్‌ ఆటో డ్రైవర్లు పరి మితి ప్రకారం ఆటోలు నడపాలని, వారి ని చూసి మరికొందరు మారే అవకాశముందని ఉదాహరణలతో వివరించా రు. ఆటోడ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి వాహనానికి బీమా, డ్రైవర్‌కు లైసెన్స్‌ తప్పనిస రి అని, అవసరమైతే ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తామని ప్రకటించారు.

మారనున్న చట్టాలు..
వాహన ప్రమాదాలకు కారకులపై త్వరలో రానున్న చట్టాలు మరింత కఠినంగా ఉండబోతున్నాయని జిల్లా అదనపు న్యాయమూర్తి, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి కె.సుధామణి అన్నారు. డ్రైవర్లు చేతిలో ప్రయాణికుల విలువైన ప్రాణాలుంటాయని, అది దృష్టిలోపెట్టుకుని వాహనాలను నడపాలని, మద్యం సేవించకుండా, సెల్‌ఫోన్‌ వినియోగించకుండా డ్రైవింగ్‌ చేస్తే దాదాపుగా ప్రమాదాలు జరగవని స్పష్టం చేశారు. ప్రతి ఆటోలో వాహనం ఫిట్‌నెస్, డ్రైవర్‌ వివరాలన్నీ ఉండేలా ఏర్పాటు చేయాలని డీటీసీ శ్రీదేవికి సూచించారు.  ముఖ్య ప్రాంతాల్లో ప్రమాద సూచికలు పెట్టించాలన్నారు.

విద్యార్హత లేకున్నా లైసెన్స్‌..
ఆటో డ్రైవర్ల సమస్యలేంటో తమకు తెలుసునని, అందుకు తగ్గట్టుగానే రవాణా శాఖ చర్యలు చేపడుతుందని డీటీసీ శ్రీదేవి తెలిపారు. అందులో భాగంగా ఎనిమిదో తరగతి, పదో తరగతి విద్యార్హతలు లేకపోయినప్పటికీ, లైసెన్స్‌లు ఇస్తున్నామని, రవాణా శాఖ కార్యాలయానికి వచ్చి డ్రైవర్లు లైసెన్స్‌లు పొందవచ్చునని చెప్పారు. సదస్సులో ఓ ఆటో యూనియన్‌ నేత వరాహ నర్సింహం అడిగిన ప్రశ్నలకు ఆమె స్పందించి ప్రతి సెంటర్‌లో ఫిక్స్‌డ్‌ రేట్లు పెట్టబోతున్నామని చెప్పారు. దీనిపై ఆటో డ్రైవర్లంతా సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతి స్కూల్‌ యాజమాన్యం కూడా ఇకపై ఆటోలో కనీస విద్యార్థులు ఐదుగురు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓవర్‌లోడ్లతో ఆటోలు కనిపించకూడదని స్పష్టం చేశారు. అంతకుముందు రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో పలువురు ఆటో డ్రైవర్లు, పోలీసులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో డీఈఓ ప్రభాకరరావు, డీఎస్పీలు వి.భీమారావు, పెంటారావు, ట్రాఫిక్‌ ఎస్‌ఐ లక్ష్మణరావు, వైద్యులు కె.చిన్నబాబు, శ్రీకాంత్, చైతన్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top