ఆర్టీసీ ఉద్యోగులపై చిన్నచూపు

Rtc Employees Are Having No Ballet Voting Till Now - Sakshi

సాక్షి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆర్టీసీ కార్మికులు ఈ దేశ పౌరులు కాదా అని పలువురు కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్నికల విధులకు వెళ్లే కార్మికులు ఓటుహక్కును కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇతర ఉద్యోగుల మాదిరిగా పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించడానికి అధికారులకు వచ్చే ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల విధులకు 480 మంది ఉద్యోగులు పశ్చిమ రీజియన్‌ పరిధిలో ఎన్నికల విధులు సంబంధించి ఈవీఎంలు, వీవీ పాట్‌లు, ప్రొసీడింగ్‌ అధికారులు, ఏపీఓలు తదితర సిబ్బందిని తరలించడానికి 400 బస్సులను రిటర్నింగ్‌ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు 400 ఆర్టీసీ బస్సులకు 400 మంది డ్రైవర్లు, ప్రతి 5 బస్సులకు ఒక కో–ఆర్డినేటర్‌ చొప్పున మొత్తం మీద 480 మందిని ఆర్టీసీ అధికారులు నియమించారు. ఎన్నికల విధులకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులు బుధవారం సాయంత్రం నుంచే తరలివెళ్లిపోవడంతో వారివారి సొంత నియోజకవర్గాల్లో ఓటు వేసే హక్కును కోల్పోతున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఇతర శాఖల ఉద్యోగులకు అధికారులు ఇప్పటికే పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించగా ఆర్టీసీ కార్మికులకు మాత్రం ఆ అవకాశం కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఓటు హక్కు కోల్పోతున్న మరో 100 మంది కార్మికులు
ఇదిలా ఉండగా కేవలం ఎన్నికల విధుల్లో ఉన్న కార్మికులే కాక మరో 100 మంది కార్మికులు కూడా ఓటుహక్కును కోల్పోతున్నారు. ప్రతి నిత్యం జిల్లా నుంచి 32 బస్సులు హైదరాబాద్‌కు మరో 18 వరకూ బస్సులు విశాఖపట్నం, తిరుపతి, సింధనూరు, భద్రాచలం వంటి సుదూర ప్రాంతాలకు బస్సులు నడిపే డ్రైవర్లు, వారి సహాయకులు వారివారి విధుల్లో ఉండడం వల్ల వారు కూడా ఓటు హక్కుకు దూరమవుతున్నారు. ఇటువంటి విధుల్లో ఉన్నవారికి కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించకపోవడంతో వారు తమ ప్రాథమిక హక్కును కోల్పోతున్నారు.

అధికారుల వింత వాదన 
కాగా ఓటు హక్కు వినియోగంపై ఆర్టీసీ అధికారులు చెబుతున్న వినిపిస్తున్న వాదనలు వింతగా ఉన్నాయని ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బంది ఏదో ఒక ఖాళీ సమయంలో తమ ప్రాంతాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్న మాటలు ఆచరణాత్మకంగా లేవంటున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లిన కార్మికులు బస్సులను అక్కడే ఒదిలేసి ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వెళ్లడం సాధ్యపడదంటున్నారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా బస్సులపై ప్రతాపం చూపే అవకాశం ఉంటుందని, అటువంటి సమయంలో సంబంధిత డ్రైవర్‌ బస్సు వద్ద లేకపోతే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, అటువంటివి జరిగితే దానికి సంబంధిత డ్రైవరే బాధ్యత వహించాల్సి ఉన్నందున వారు బస్సును విడిచి వారికి ఓటు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఓటు వేసి వచ్చే వెసులుబాటు ఉండదంటున్నారు. 

ఉద్ధేశపూర్వకంగానే ప్రభుత్వ చర్య 
ఇటీవల జరిగిన పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ చూసిన ప్రభుత్వం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ఎక్కువమంది ఉద్యోగులు ఓటు వేసినట్లు అందిన ఇంటిలిజెన్స్‌ నివేదికల మేరకు ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ఓటు హక్కును దూరం చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి చర్య తీసుకుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికులు కూడా వైసీపీకే ఓటు వేసే అవకాశం ఉన్నందున వారికి ఓటు హక్కును దూరం చేయడానికే కుట్రపన్నిందంటున్నారు. వాస్తవానికి పశ్చిమ గోదావరి జిల్లాలో నిత్యం  2,242 మంది డ్రైవర్లు, కండక్టర్లు విధుల్లో ఉంటారు. వారిలో చాలా మంది ఎన్నికల సమయంలో విధుల్లో ఉండే అవకాశం ఉన్నందున వారికి కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోయే ప్రమాదం ఉంది. 

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
ఆర్టీసీ కార్మికులకు ఓటు హక్కు లేకుండా చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. దేశంలోని ప్రతి పౌరుడుకి ప్రాథమిక హక్కైన ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండాలి. ఎన్నికల విధుల్లో ఉండే ఇతర శాఖల ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించి ఆర్టీసీ కార్మికులకు ఈ సౌకర్యం కల్పించకపోవడం వివక్షాపూరితంగా పరిగణించాలి. దీనిపై ఎన్నికల కమిషన్‌ తగిన చర్యలు తీసుకోవాలి.
– ఆర్‌వీవీఎస్‌డీ ప్రసాదరావు, ఎన్‌ఎంయూ రాష్ట్ర మాజీ చైర్మన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top