
భక్తులకు ఇబ్బందులు రానీయం
నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగి జరుగుతున్న దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి...
- ‘సాక్షి’తో దుర్గగుడి ఈవో వి.త్రినాథరావు
సాక్షి, విజయవాడ : నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగి జరుగుతున్న దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.త్రినాథరావు ‘సాక్షి’కి తెలిపారు. మరో కొద్ది గంటల్లో దసరా ఉత్సవాలు ప్రారంభమౌతున్న నేపథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన వివరించారు. ఈ ఏడాది అమ్మవారి దర్శనానికి వీఐపీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, అరునప్పటికీ భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉచితంగా భోజనం, ప్రసాదం
ఉత్సవాలు ప్రారంభమయ్యే 25వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ ముగింపు రోజు వరకు(తొమ్మిది రోజులు) ఇంద్రకీల్రాది దిగువభాగంలో శృంగేరి పీఠంలో 90వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే ఉత్సవాలు జరిగే రోజుల్లో రోజుకు 8 వేల మందికి, మూల నక్షత్రం రోజున 12 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందజేస్తామన్నారు. కనకదుర్గానగర్‌లో ఏడు, జమ్మిదొడ్డి,బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్, కొండపైన వీఐపీల కోసం ప్రసాదాల కౌంటర్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది భక్తుల కోసం 16లక్షల లడ్డూలు, 20 టన్నుల పులిహోర చేయిస్తున్నామని, భక్తులు కోరినన్ని లడ్డూలు విక్రయిస్తామని ఈవో తెలిపారు.
స్నానఘాట్టాలు, కేశఖండన..
భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు దుర్గాఘాట్‌తో పాటు పద్మావతీఘాట్, దోబీఘాట్, సీతమ్మవారిపాదాలు, పున్నమిఘాట్, భవానీఘాట్‌లలో స్నానఘట్టాలను ఏర్పాటు చేశామని, ప్రమాదాలు జరగకుండా బారికేడింగ్ నిర్మాణం, జల్లు స్నానాలు ఏర్పాటు చేశాం. తలనీలాలు సమర్పించేందుకు దేవస్థానంలో ఉండే 105 మంది క్షురకులకు అదనంగా, ఇతర దేవస్థానాల నుంచి 800 మందిని క్షురకులను రప్పిస్తున్నట్లు చెప్పారు.
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
మూలానక్షత్రం, విజయదశమి రోజున లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు కనుక పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా సుమారు 900 మంది మూడు షిఫ్టులలో పనిచేస్తారని ఈవో చెప్పారు. దుర్గాఘాట్‌లో భక్తులు వదిలివేసే దుస్తులు, ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలిస్తారన్నారు.
సెల్‌ఫోన్లు తీసుకురావద్దు!
దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులు సాధ్యమైనంత తక్కువ లగేజిని తెచ్చుకోవాలని, సెల్‌ఫోన్లు తీసుకోరావద్దని సూచించారు. ఆలయంలోకి సెల్‌ఫోన్లను అనుమతించబోమని తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది భక్తుల లగేజిని ఎప్పుడైనా తనిఖీ చేస్తారని, సాధ్యమైనంత వరకు ఖాళీ చేతులతో వచ్చి అమ్మవార్ని మనస్ఫూర్తిగా దర్శించుకోవాలని చె ప్పారు. కొబ్బరికాయలు కొట్టే చోట, తలనీలాలు సమర్పించే చోట భక్తులు అదనంగా సొమ్ము చెల్లించాల్సిన అవసరం లే దని, ఎవరైనా డబ్బులడిగితే ఫిర్యాదు చేయూలని పేర్కొన్నారు.
తెప్పోత్సవానికి ఏర్పాట్లు
అక్టోబరు మూడో తేదీన కృష్ణానదిలో జరిగే అమ్మవారి తెప్పోత్సవానికి, భక్తుల గిరి ప్రదక్షిణకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో చెప్పారు.
భక్తుల కోసం ఐదు క్యూలైన్లు....
భక్తుల కోసం ఐదు క్యూలైన్లు ఏర్పాటు చేశామని ఇందులో రెండు క్యూలైన్లు కేవలం ధర్మదర్శనం కోసం వచ్చే భక్తులకు కేటాయించామని, వీవీఐపీలకు ప్రత్యేక దర్శనం ఉంటుందని ఈవో తెలిపారు. రూ.500, రూ.1000 టికెట్లు కొన్నవారు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. లక్ష కుంకుమార్చన టికెట్లు కొన్న భక్తులు వారికి కేటాయించిన సమయానికి భవానీ మండపానికి చేరుకోవాలేని సూచించారు.