అన్నం పెట్టదు.. అట్లకాడతో కాల్చేది | Rice would not shoot .. atlakadato | Sakshi
Sakshi News home page

అన్నం పెట్టదు.. అట్లకాడతో కాల్చేది

Mar 4 2015 3:05 AM | Updated on Sep 2 2017 10:14 PM

చిట్టి తల్లికి ఎంతకష్టమొచ్చిందో.. ఐదేళ్ల వయసు. అల్లారు ముద్దుగా సాగాల్సిన బాల్యం. అయితే విధి ఆ పాపపై విషం చిమ్మింది. మూడేళ్ల క్రితం తల్లి తనువుచాలించింది.

చిట్టి తల్లికి ఎంతకష్టమొచ్చిందో.. ఐదేళ్ల వయసు. అల్లారు ముద్దుగా సాగాల్సిన బాల్యం. అయితే విధి ఆ పాపపై విషం చిమ్మింది. మూడేళ్ల క్రితం తల్లి తనువుచాలించింది. ప్రేమ పంచాల్సిన సవతితల్లి మానసికంగా.. శారీరకంగా వేధించింది. ఆ బాధలను మంగళవారం మేజిస్ట్రేట్ ముందు చెమ్మగిల్లిన కళ్లతో చెప్పుకుంది చిన్నారి. శరీరంపై ఒక్కొక్క గాయం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ చివురుటాకులా వణికిపోయింది.  
 
ఒంగోలు టౌన్ : ‘అన్నం సరిగా పెట్టదు.. అడిగితే కొట్టేది.. సంక్రాంతి పండుగ రోజు అట్లకాడతో చెయ్యి కాల్చింది. ఒకసారి తలపై కర్రతో కొడితే రక్తమొచ్చింది. బుగ్గ మీద కర్రతో కొడితే ఎర్రగా కందిపోయింది. నేను ఇంటికి వెళ్లను.. ఇక్కడే ఉంటాను.’ అని ఒంగోలు నగరంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన  ఐదేళ్ల చిన్నారి మహేశ్వరి చెమ్మగిల్లిన కళ్లతో చెప్పిన మాటలివి. సవతి తల్లి చిత్ర హింసలకు గురవుతున్న చిన్నారి గురించి పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి చలించిపోయిన జిల్లా జువైనల్ జస్టిస్ బోర్డు ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ జె.శ్రావణ్‌కుమార్ మంగళవారం సాయంత్రం స్వయంగా స్థానిక బాలసదన్‌కు వెళ్లి ఆ చిన్నారితో మాట్లాడారు.

చిన్నారి శరీరంపై ఉన్న గాయాల గురించి ఒకటొకటిగా అడిగారు. ఆ గాయాల తాలూకు చేదు జ్ఞాపకాలను చిన్నారి అమాయకంగా చెబుతుంటే మేజిస్ట్రేట్ చలించిపోయారు. ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావుకు ఫోన్‌చేసి వెంటనే బాలసదన్‌కు రావాలని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించి చిన్నారి తండ్రి, సవతి తల్లిని అరెస్టు చేయాలని ఆదేశించారు. మేజిస్ట్రేట్ వెంట చైల్డ్‌లైన్ (1098) ప్రతినిధి బీవీ సాగర్, మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ కె.లీలావతి, ఐసీడీఎస్ డీసీపీవో ఎన్.జ్యోతి సుప్రియ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement