తినే బియ్యం తాగుడికి

Rice Smuggling In Prakasam - Sakshi

సాక్షి, ఒంగోలు సిటీ: తినే బియ్యం తాగుడికి. వింటుంటేనే ఎబ్బెట్టుగా లేదు. ఇప్పుడు జరుగుతున్న దందా ఇదే. పేదల కడుపు నింపడానికి ప్రభుత్వం రూపాయికే ఇస్తున్న సబ్సిడీ బియ్యం లిక్కర్‌ ఫ్యాక్టరీలకు తరలిపోతోంది. లిక్కర్‌ తయారీకి మొక్కజొన్న వాడుతున్నారు. దీని ధర మార్కెట్‌లో బాగా పెరిగిన నేపథ్యంలో ‘చౌక’ బియ్యాన్ని కొంటున్నారు. గోనె సంచులు మార్చి రవాణా చేస్తున్నారు. దళారులు దండిగా సంపాదిస్తున్నారు. ఈ దందా గురించి అధికారులకు తెలియదా అంటే..తెలుసనే జవాబు వస్తుంది. ఏ గల్లీలోని సామాన్యుడిని కదిలించినా కొందరు దళారులు రూపాయి బియ్యాన్ని కొంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ మాట అధికారుల చెవికెక్కదా మరీ.

జిల్లాలో 9,90,501 తెల్లకార్డులు ఉన్నాయి. నెలనెలా 15,117.120 టన్నుల బియ్యం కార్డుదారులకు కిలో రూపాయి కింద పంపిణీ చేస్తున్నారు. మొత్తం 24 లక్షల యూనిట్లకు ఈ బియ్యం వినియోగమవుతున్నట్లుగా లెక్కలున్నాయి. ప్రభుత్వం నెలనెలా బియ్యం సబ్సిడీ కింద జిల్లాకు రూ.64 కోట్లు ఖర్చు పెడుతోంది. అన్ని ఖర్చులను కలుపుకొని ప్రభుత్వం కిలోకు రూ.34 లెక్కన ఖర్చుచేస్తోంది. ఇక వీటితో పాటు చక్కెర 518.895 టన్నులు, కందిపప్పు 1981.002 టన్నులు పంపిణీ చేస్తున్నారు. రాగులు, జొన్నలు సుమారు 4 వేల టన్నుల వరకు కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. వీటిలో రూపాయి బియ్యం పెద్ద ఎత్తున పక్కదారి పడుతోంది.

విజిలెన్సు తనిఖీల్లో వెల్లడి
విజిలెన్సు అధికారులకు వస్తున్న సమాచారంతో చేస్తున్న తనిఖీల్లోనే భారీగా బియ్యం అక్రమ రవాణా గుర్తించారు. ఆరు నెలల వ్యవధిలోనే జిల్లాలో విజిలెన్సు, పౌరసరఫరాల అధికారులు పట్టుకున్న కేసులు 128 వరకు ఉన్నాయి. ఇందులో విజిలెన్సు అధికారులు పట్టుకున్న బియ్యమే పెద్ద మొత్తంలో ఉన్నట్లుగా సమాచారం. జిల్లా నలుమూలల నుంచి అధికారులకు బియ్యం అక్రమ రవాణా, రూపాయి బియ్యం దందా గురించి సమాచారం ఇస్తున్నా కొందరు అధికారులు ఈ సమాచారాన్ని దళారులకు, కొందరు మిల్లర్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రజా పోలిసింగ్‌ వ్యవస్థ నిఘా పెరిగితే ఈ దందాకు అడ్డుకట్టపడేదని కొందరు అధికారులు వాపోతున్నారు. మచ్చుకు మాత్రమే కొన్ని కేసులను పట్టుకొని మిగిలిన బియ్యాన్ని జిల్లా హద్దు దాటించి లిక్కర్‌ ఫ్యాక్టరీ గుమ్మాలను ఎక్కిస్తున్నారన్న విమర్శలున్నాయి.

► 5వతేదీ ఎన్‌జీపాడు మండలం కళ్లగుంటలో విజిలెన్సు అధికారుల దాడిలో 1870 కిలోలు బియ్యం పట్టుబడింది. అదే రోజు నాగులుప్పలపాడులో 6,674 కిలోల బియ్యాన్ని పట్టుకున్నారు.
 7వ తేదీ కొత్తపట్నంలో విజిలెన్స్‌ అధికారులు దాడి చేసి 3,300 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
► 3వ తేదీ పర్చూరులోని నూతలపాడు గ్రామం వద్ద బియ్యం అక్రమ రవాణా అడ్డుకొని 2,935 కిలోల బియ్యం పట్టుకున్నారు.
► 4వ తేదీ ఇంకొల్లు మండలం గంగవరం గ్రామంలో బియ్యాన్ని తరలిస్తుండగా విజిలెన్సు అధికారులు దాడి చేసి 2,200 కిలోలు స్వాధీనం చేసుకున్నారు.
► 5వ తేదీ సంతనూతలపాడు చిలకచర్ల మార్గంలో 5,060 కిలోలు, అదే రోజు కనిగిరిలో 9,625 కిలోలు బియ్యాన్ని పట్టుకున్నారు. 
► 3వ తేదీ ముండ్లమూరు మండలంలోని పోలవరం గ్రామంలో 8,357 కిలోలు పట్టుకున్నారు.
► 2వ తేదీ కనిగిరిలో దాడి చేసి 8,150 కిలోలు పట్టుకున్నారు.

జిల్లాలో బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడలేదు. దళారులు చెలరేగిపోతున్నారు. వీరికి కొందరు మిల్లర్లు తోడయ్యారు. ఇప్పుడు కస్టమ్‌ మిల్లింగ్‌ కూడా లేకపోవడంతో మిల్లర్లు కొందరు మిల్లు ఆడించడానికి ఈ దొంగ బియ్యాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. ఎంచక్కా వీరికి కొందరు ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు అండదండలు ఇవ్వడంతో దుకాణాల నుంచి మిల్లులకు, అక్కడి నుంచి బాగా గిరాకీగా ఉన్న లిక్కర్‌ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు.

నిఘా కళ్లుగప్పి పోతుందే అధికం
జిల్లాలోని వివిధ మండల కేంద్రాల్లో పౌరసరఫరాల నిఘా అధికారులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మందికి నెలవారీ మామూళ్లు అందుతున్నట్లుగా అభియోగాలు ఉన్నాయి. రూపాయి బియ్యాన్ని దందా చేస్తున్న దళారులకు వీరు కొమ్ము కాస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో ఎక్కడా నిఘా అంతగా లేదు. దుకాణాదారుల వద్దనే బియ్యం పక్కదారి వ్యవహారం మొదలవుతుంది. అందిన సమాచారం మేరకు కొందరు కార్డుదారుల నుంచి బియ్యాన్ని కిలో రూ.11కి కొనుగోలు చేస్తున్నట్లుగా సమాచారం. వీటిని కొన్న డీలర్లు కిలోకి రూ.5–రూ.6 లాభం చూసుకొని వీటిని రవాణా చేసే మిల్లర్లకు తోలుతున్నారు. మిల్లరు పాలిష్‌ పట్టించి వేరే గోనె సంచుల్లోకి ఎత్తి క్వింటా రూ.2,100– రూ.2,300 వరకు విక్రయిస్తున్నారు. ఈ దందా మొత్తం నెల మొదటి అర్ధ భాగంలోనే జరిగిపోతుంది. నెల చివరి వారంలో మిల్లర్లు దళారుల సహకారంతో ఈ పాలిష్‌ పట్టిన బియ్యాన్ని లిక్కర్‌ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. ఈ తంతు నెలనెలా జరిగేదే. పౌరసరఫరాల అధికారుల్లో కొందరు అవినీతిపరుల అవతారమెత్తినందునే ప్రభుత్వ సబ్సిడీ మొత్తాలు రూ.కోట్లలోనే దుర్వినియోగం అవుతోంది.

మొక్కజొన్న పెరిగినందునే..
లిక్కర్‌ తయారీదారులు మొక్కజొన్నను అధిక భాగం ఉపయోగిస్తున్నారు. జిల్లాలో మొక్కజొన్న ఉత్పత్తి బాగానే ఉంది. అయితే మొక్కజొన్న కన్నా సబ్సిడీ బియ్యం బాగా తక్కువ ధరలకు మార్కెట్‌లో లభిస్తుండడంతో వీటి కొనుగోళ్లకే ఆసక్తి చూపిస్తున్నారు. మొక్కజొన్న క్వింటా  ధర రూ.2,600– రూ.2,800 వరకు పలుకుతుంది. అదే మిల్లర్లు సేకరించిన ఈ సబ్సిడీ బియ్యం క్వింటా రూ.2,100– రూ.2,300 లభిస్తోంది. క్వింటాకు రూ.500 ధరల్లో తేడా ఉండంతో లిక్కర్‌ ఉత్పత్తికి అయ్యే వ్యయంతో కాస్త ఖర్చు తగ్గుతోంది. దీంతో లిక్కర్‌ ఫ్యాక్టరీల వారు మిల్లర్లు నుంచి వస్తున్న బియ్యాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి  చూపిస్తున్నారు. ఒకప్పుడు కాకినాడ పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు పాలిషింగ్‌ బియ్యం వెళ్లేది. ఇప్పుడు లిక్కర్‌ తయారీ దారులు బియ్యాన్ని స్థానిక మార్కెట్‌లోనే కొనుగోలు చేస్తున్నారు.

దళారుల అవతారమెత్తిన మిల్లర్లు
జిల్లాలోని కొందరు మిల్లర్లు దళారుల అవతారమెత్తారు. ఇప్పుడు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ లేదు. ఇంకా పంట రావడానికి కొద్ది నెలల సమయం ఉంది. ఈ లోగా మిల్లు ఆడించాలంటే ఈ తరహా దందాలు చేసే వారితో చేతులు కలపాలనుకున్నారు. బియ్యం దందాలో భాగస్వాములవుతున్నారు. జిల్లాలోని వివిధ కేంద్రాలలో దళారులు చౌక బియ్యాన్ని సేకరించి మిల్లులకు తరలించే చర్యలు తీసుకుంటున్నారు. ఈ దందా బహిరంగంగానే జరుగుతున్నా నిఘా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో అదీ విజిలెన్సు అధికారులు స్పందించి వెంటనే దాడులకు ఉపక్రమిస్తున్నారు. ప్రభుత్వం కార్డుదారులకు నాణ్యమైన బియ్యం ఇవ్వడానికి చర్యలు తీసుకుంటుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి నాణ్యమైన బియ్యం కార్డుదారులకు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో బియ్యం దొంగల పని పట్టకుంటే బంగారం లాంటి పథకాలను బొక్కేసే వీలుంది. బియ్యం అక్రమ రవాణా దందాను నిలుపుదల చేయడానికి అధికారులు పూనుకోవాలని ప్రజానీకం కోరుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top