ముడుపులు మెక్కి.. ముక్కిన బియ్యం | Rice Bags Wastage in Godowns Visakhapatnam | Sakshi
Sakshi News home page

ముడుపులు మెక్కి.. ముక్కిన బియ్యం

Jan 11 2019 8:18 AM | Updated on Mar 9 2019 11:21 AM

Rice Bags Wastage in Godowns Visakhapatnam - Sakshi

పెందుర్తి గోదాములో అన్‌లోడ్‌ చేస్తున్న ముక్కిన బియ్యం

ముక్కిన, రంగుమారిన బియ్యం పేదలకు ఎలా సరఫరా చేస్తాం.. అవి తీసుకొని మంచి బియ్యం పంపండి.. అని కోరిన అధికారికి తిరుగు టపాలో మెమో అందింది.ఇప్పటికీ ఆ బియ్యం గోదాముల్లో మూలుగుతున్నాయి.. అయినా సరే ఉన్నతాధికారులకు ఖాతరు లేదు.. ఈసారి కూడా ముక్కిన బియ్యమే పంపారు..అవే ఇస్తాం.. తింటే తినండి.. లేదంటే మానేయండి.. అన్నట్లున్న పౌరసరఫరా అధికారుల ఈ నిర్లక్ష్య ధోరణి వెనుక.. పెద్ద గూడుపుఠాణీయే ఉందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.ప్రజాపంపిణీకి అవసరమయ్యే బియ్యం కోసం పొరుగు జిల్లాల మీద ఆధారపడుతున్న విశాఖ జిల్లాకు విజయనగరం జిల్లా నుంచి రెండు నెలలుగా అందుతున్న బియ్యం నాసిరకంగా ఉండటానికి.. అక్కడి అధికారులు, రైస్‌మిల్లర్లు కుమ్మక్కై.. డబ్బులు మెక్కేసి.. ముక్కిన బియ్యాన్ని అంటగడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి..నిబంధనల ప్రకారం 3 శాతంలోపు రంగుమారిన బియ్యాన్నే మిల్లర్ల నుంచి లెవీగా సేకరించాల్సి ఉండగా విజయనగరం అధికారులు ఏకంగా 7 నుంచి 20 శాతం వరకు రంగుమారిన బియ్యం కూడా సేకరిస్తున్నారని.. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలా సేకరించి గత నెలలో జిల్లాకు పంపిన బియ్యంలో 5వేలకుపైగా బస్తాలు ముక్కిపోయి గోదాముల్లో మూలుగుతుంటే.. ఈసారి కూడా పంపిన బియ్యంలో 4200 బస్తాలు అటువంటి సరుకేనని తేలింది.

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా దారిద్య్ర రేఖ దిగువనున్న తెల్ల కార్డుదారులతోపాటు మధ్యాహ్న భోజన పథకం కింద ప్రతి నెలా 20,492 మెట్రిక్‌టన్ను(ఎంటీ)ల బియ్యాన్ని సరఫరా చేస్తుంటారు. ఈ లెక్కన ఏడాదికి 2.50లక్షల ఎంటీల బియ్యం అవసరం. జిల్లాలో సేకరించే ఈ బియ్యం ఏటా 25వేల ఎంటీలకు మించడం లేదు. దీంతో పొరుగున ఉన్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. మరీ కొరత ఏర్పడితే అప్పుడప్పుడు తూర్పుగోదావరి జిల్లా నుంచి కేటాయింపులు జరుపుతుంటారు.
విజయనగరం జిల్లా సివిల్‌ సప్లయిస్‌ అధికారులు ముక్కిన, రంగుమారిన బియ్యాన్ని లెవీ కింద తీసుకుంటున్నారు. సాధారణంగా 3 కంటే తక్కువ శాతం రంగుమారి ఉంటేనే లెవీకింద సేకరించాలి. ప్రజాపంపిణీ ద్వారా సరఫరాకు  అనుమతిఇవ్వాలి. కానీ ఇక్కడ ఏకంగా ఏడు నుంచి 22 శాతం వరకు రంగు మారిన ధాన్యాన్ని అక్కడి అధికారులు ఏమాత్రం సంకోచించకుండా లెవీ కింద రైసుమిల్లర్ల నుంచి సేకరిస్తున్నారు. ఈ విధంగా  పదో..ఇరవై టన్నులు కాదు ఏకంగా 80 వేల టన్నులు సేకరించారు. కిలోకు రూ.32 చొప్పున టన్నుకు రూ.32వేలు వంతున రైసుమిల్లర్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. అంటే ఏకంగా రూ.256 కోట్ల భారీ స్కాం అన్న మాట. ఈ విషయంలో అక్కడి మిల్లర్లు చక్రం తిప్పుతున్నారన్నవాదన ఉంది. భారీగా రూ.కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

చేతుల మారడంతోనే పీడీఎస్‌ కింద సరఫరా
ఇందులో సంబంధిత ఉన్నతాధికారులతో పాటు రాజకీయ పెద్దలకు కూడా భారీగానే ముట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ కారణంగానే ఈ రంగుమారిన బియ్యాన్ని విజయనగరం సివిల్‌ సప్లయిస్‌ అధికారులు నిస్సిగ్గుగా పీడీఎస్‌ కింద సరఫరా చేస్తున్నారు. గత నెలలో ఇదే రీతిలో 1600 టన్నుల బియ్యం పంపగా, అందులో 5వేలకు పైగా బస్తాల బియ్యం ముక్కి పోయాయి. వీటిని వెనక్కి తీసుకెళ్లాలని విశాఖ జిల్లా సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చినా నేటికీ ఆ బియ్యాన్ని తీసుకెళ్లలేదు. పైగా తిప్పి పంపిన కారణంగా ఉన్నతాధికారులు జిల్లా సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ మేనేజర్‌ పల్లవ వెంకటరమణకు మెమో కూడా జారీ చేశారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఆ ముక్కిన బియ్యం పీడీఎస్‌ కింద సరఫరా చేసేది లేదంటూ తెగేసి చెప్పారు. ప్రస్తుతం ఆ ముక్కిన బియ్యం అనకాపల్లి సివిల్‌ సప్లయిస్‌ గోదాముల్లో మూలుగుతున్నాయి.

డొంకినవలస గోదాము నుంచి ముక్కిన బియ్యం
తాజాగా ఈ నెలలో కూడా అదే విధంగా ముక్కిన, రంగుమారిన బియ్యాన్ని విజయనగరం సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ అధికారులు మళ్లీ విశాఖకు పంపారు. ఆ జిల్లా లోని బాడంగి మండలం డొంకినవలస గోదాము నుంచి ఈసారి మరో 49 లారీల ముక్కిన, రంగు మారిన బియ్యాన్ని పంపేందుకు అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాటిలో 29 లారీల బియ్యం ఇప్పటికే మర్రిపాలెం–1,2, పెందుర్తి, భీమిలి, అనకాపల్లి, చోడవరం, వడ్లపూడి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు మంగళవారం చేరుకున్నాయి. ఒక్కో లారీలో 500 బస్తాల చొప్పున 250 క్వింటాళ్ల బియ్యం ఉన్నాయి.

పనికిరానివి 4,200 బస్తాల బియ్యం?
ఇప్పటివరకు పరిశీలించిన బస్తాల్లో 4,200 బస్తాల బియ్యం ముక్కిపోయి ఎందుకూ పనికి రానివిగా గుర్తించారు. అన్ని గోదాముల్లో మిగిలిన స్టాక్‌ను కూడా పరిశీలిస్తే మరింత పెరిగే అవకాశం ఉంది. ఇన్ని వేల బస్తాల్లో బియ్యం ముక్కిపోతే విజయనగరం సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ జీఎం డి.షర్మిల మాత్రం కేవలం వంద బస్తాలే నాణ్యత లే నట్టుగా గుర్తించామని చెప్పుకొచ్చారు. అదేం కాదు ఇప్పటి వరకు పరిశీలించిన బస్తాల్లో 4,200 బస్తాల బియ్యం పూర్తిగా ముక్కిపోయి ఎందుకు పనికి రానివిగా ఉన్నాయని, వాటిని తిప్పి పంపేందుకు చర్యలు చేపట్టామని విశాఖ జిల్లా సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ డీఎం వెంకటరమణ ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement