ఇన్‌స్పెక్టర్‌నే మోసం చేశాడు | retired traffic inspector deceived in kadapa | Sakshi
Sakshi News home page

ఇన్‌స్పెక్టర్‌నే మోసం చేశాడు

Jun 19 2017 9:26 AM | Updated on Sep 5 2017 1:59 PM

ఇన్‌స్పెక్టర్‌నే మోసం చేశాడు

ఇన్‌స్పెక్టర్‌నే మోసం చేశాడు

బ్యాంకు ఖాతా నెంబర్లు, ఏటీఎం నెంబర్లు ఎవరికీ చెప్పవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.

రాజంపేట టౌన్:  బ్యాంకు ఖాతా నెంబర్లు, ఏటీఎం నెంబర్లు  ఎవరికీ చెప్పవద్దని ఇటు పోలీసు, అటు బ్యాంకు అధికారులు పదేపదే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అలాగే ఈ విషయాలపై పత్రికల్లోను, టీవీల్లోనూ తరచూ కథనాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలు మాత్రం ఘరానా మోసగాళ్ల మాయలో పడుతూనే ఉన్నారు. తాజాగా రాజంపేట పట్టణం ఎస్వీ నగర్‌కు చెందిన ఆర్టీసీ  రిటైర్డ్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ మాచవరం బ్రహ్మయ్యఆచారి ఓ మోసగాడి మాటలు నమ్మి తన ఎస్‌బీఐ  ఖాతాలోని 6,778 రూపాయిల  నగదును పోగొట్టుకున్నాడు.

తనకు జరిగిన మోసాన్ని  బ్రహ్మయ్య ఆచారి ఇక్కడి విలేకరుల ఎదుట ఏకరవు పెట్టుకున్నాడు.  బాధితుని కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈనెల 17వ తేదీ ఓ వ్యక్తి కాల్‌ చేసి తాను ఎస్‌బీఐ హెడ్‌ఆఫీస్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నాను అంటూ హిందీలో చెప్పుకొచ్చాడు. అనంతరం హిందీలోనే  మీ ఏటీఎం కార్డుకు ఆధార్‌ లింక్‌ అప్‌ చేయాలని తొలుత ఆధార్‌ నెంబర్‌ అడిగాడు. అనంతరం మీ ఏటీఎం కార్డు గడువు కూడా అయిపోయిందని, రెన్యువల్‌ చేస్తామని, కార్డు రెన్యువల్‌ అయిన వెంటనే మీకు మెసేజ్‌ వస్తుందని చెప్పాడు.

దీంతో బ్రహ్మయ్య ఆచారి ముందు వెనుక ఆలోచించకుండా ఏటీఎం కార్డుపై ఉండే నెంబర్‌ చెప్పాడు. దీంతో ఆ మోసగాడు అదే రోజు పలు మార్లు బాధితుని ఖాతాలో ఉన్న 6,778 రూపాయిలు ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నాడు. అయితే మోసగాడు  ఏటీఎం కార్డు రెన్యువల్‌ అయిన వెంటనే మెసేజ్‌ వస్తుందని చెప్పిన విషయం బ్రహ్మయ్య ఆచారికి గుర్తుకు వచ్చి ఏటీఎంలో మినీ స్టేట్‌మెంట్‌ తీసుకున్నాడు. దీంతో తన ఖాతా నుంచి పలుమార్లు డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అయ్యి ఖాతాలోని డబ్బంతా ఖాళీ కావడంతో మోసపోయినట్లు బాధితుడు గ్రహించాడు.

తెలియని వ్యక్తులు ఎవరు ఫోన్‌ చేసినా, ఇంటివద్దకు వచ్చి  ప్రజలు ఎవరు కూడా ఆధార్, ఏటీఎం కార్డు నెంబర్లు చెప్పవద్దని పత్రికా ముఖంగా బాధితుడు కోరాడు.  తెలియని వ్యక్తులకు నెంబర్లు చెపితే తనలాగే మోసపోవాల్సి వస్తుందని బాధితుడు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement