ఆర్టీసీలో ‘చిల్లర’కొట్టుడు

Retail problems in RTC bus - Sakshi

412 రూట్లలో చిల్లర సమస్య 

ప్రతిరోజూ రూ.వేలల్లో నష్టపోతున్న ప్రయాణికులు

పట్టించుకోని ఆర్టీసీ అధికారులు

విజయనగరం అర్బన్‌: ‘లెంక నాగభూషణ భార్యతో కలసి విజయనగరం నుంచి విశాఖకు వెళ్లడానికి మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్టాండులోని మెట్రో సిటీబస్సు ఎక్కారు. కండక్టర్‌ టికెట్‌ అడగడంతో రూ.100 నోటు ఇచ్చారు. టికెట్‌ రూ.47 వంతున రెండు టిక్కెట్లకు రూ.94 పోగా మిగిలిన ఆరు రూపాయలకు టికెట్‌ వెనుక కండెక్టర్‌ రాసిచ్చాడు. బస్సు దిగిన తర్వాత టికెట్‌ చూపించగా... నాలుగు రూపాయలిస్తే పది రూపాయలు ఇస్తానని కండెక్టర్‌ అన్నాడు. దీంతో తన వద్ద చిల్లర లేదని ప్రయాణికుడు చెప్పడంతో కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు ప్రయాణికుడే చిల్లర వదులుకోవాల్సి వచ్చింది’. ఈ సమస్య ఒక్క విశాఖ రూట్‌లో సర్వీస్‌లకు మాత్రమే కాదు. దాదాపు ప్రతి సర్వీస్‌లోనూ ఎదురవుతున్నాయి

చివరకు ప్రయాణికులే నష్టపోవాల్సి వస్తోంది. ప్రయాణికులకు చిల్లర తిరిగిచ్చే కండక్టర్లు ఎంతోమంది ఉన్నప్పటికీ, చిల్లర చూపులు చూసే వారు కూడా ఉండడంతో సంస్థకు చెడ్డ పేరు వస్తోంది. బస్సు దిగే సమయంలో చిల్లర అడిగితే కస్సుబుస్సులాడడం... కాయిన్స్‌ ఉన్నా ఇవ్వకపోవడం.. కావాలనే టికెట్‌ వెనుకరాయడం వంటి సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఇదే విషయమై ఇటీవల నిర్వహించిన ‘డయల్‌ యువర్‌ డీఎం’కు ఫిర్యాదులు కూడా అందాయి. టికెట్‌ కోసం రూ. 100, రూ.500 నోట్లు ఇచ్చినప్పుడు మిగిలిన చిల్లరను టికెట్‌ వెనుక రాస్తుండడంతో బస్సు దిగే తొందరలో చాలామంది డబ్బులు మరిచిపోతున్న సంఘటనలు కూడా ఉన్నాయి.  

యాజమాన్యం చిల్లర ఇవ్వదా..?
ఆర్టీసీ కండక్టర్లకు విధుల్లో చేరిన రోజున యాజమాన్యం కేవలం రూ.150 చిల్లర మాత్రమే ఇస్తుంది. మిగిలిన చిల్లరను డ్యూటీలోనే సర్దుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజూ చిల్లర విషయంలో ఇబ్బందులెదురవుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.  

ఈ మార్గాల్లో సమస్యలు
జిల్లాలోని విజయనగరం, సాలూరు, పార్వతీపురం, ఎస్‌.కోట డిపోల పరి«ధిలో 412 బస్సులు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తుంటాయి. నెలలో సుమారు 49.80 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా, 6.19 కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. విజయనగరం మీదుగా విశాఖ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లతో పాటు విజయనగరం నుంచి బొబ్బిలి మీదుగా పార్వతీపురం, సాలూరు రాకపోకలు చేసి పల్లెవెలుగులు, విజయగరం నుంచి చీపురుపల్లి మీదుగా రాజాం, పాలకొండ సర్వీసుల్లో ఈ చిల్లర సమస్య అధికంగా ఉంటుంది. ఈ మార్గాల్లోని కండక్టర్లకు చిల్లర సర్దుబాటు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పల్లెవెలుగు బస్సుల్లో చిల్లర అవసరం మరింత ఎక్కువ. ఈ విషయమై ప్రజలకు, కండక్టర్ల తరచూ గొడవలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ విధులకు హాజరయ్యే కండక్టర్లకు యాజమాన్యం చిల్లర ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనీసం రూ.500 విలువచేసే రూ.1, రూ.2, రూ.5 నాణేలు, మరో రూ.1000 విలువ చేసే రూ.10 నోట్లు ఇస్తే సమస్య చాలా వరకు పరిష్కారమవుతుంది. అయితే ఆర్టీసీ అధికారులు ఇవేమీ పట్టించుకోవడం లేదు.  

పరిష్కార అవకాశాలున్నా....
 జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో ఉన్న వేయింగ్‌ (తూనిక) మిషన్ల ద్వారా చిల్లర సమస్య కొంతమేరకు పరిష్కరించుకోవచ్చు. వీటి ద్వారా వచ్చే నాణేలను ఆయా డిపోల్లో చెల్లించే విధంగా అధికారులు ఆదేశిస్తే సమస్య కొంతవరకు పరిష్కారమవుతుంది. అలాగే విశాఖ ఆ పై పట్టణాలకు రాకపోకలు చేసే బస్సుల్లో మెరుగైన ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని ప్రయాణికులు సూచిస్తున్నారు. డెబిట్‌కార్డు, ఫోన్‌పే, నగదు బదిలీ చేసే యాప్‌లు ఉపయోగిస్తే చిల్లర సమస్య కొంతమేర తీరే అవకాశం ఉంది.  

సమస్య తీవ్రంగా ఉంది
చిల్లరతో ప్రతిరోజూ సమస్యలొస్తున్నాయి. విధుల్లో చేరే ముందుగానే చిల్లర సిద్ధం చేసుకుంటున్నాం. అయినప్పటికీ ప్రయాణికులు రూ. 500 నోట్లు ఎక్కువగా ఇస్తుండడంతో ఇబ్బందులేర్పడుతున్నాయి. దీనికితోడు యాజమాన్యం చిల్లర నాణేలు, రూ.10 నోట్లు ఇవ్వడం లేదు.
–ఎం.రామారావు, కండక్టర్, విజయనగరం డిపో

సహకరించాలి
చిల్లర సమస్య అన్ని చోట్లా ఎదురవుతున్నట్లు గుర్తించాం. ప్రయాణికులు ఎక్కువగా రూ. 100, రూ. 500 నోట్లు ఇస్తున్నారు. బ్యాంక్‌ల నుంచి చిల్లర తీసుకుంటున్నాం. ప్రయాణికులు సరిపడా చిల్లర తెచ్చుకుంటే మంచింది. కండక్డర్లకు ప్రయాణికులు సహకరిస్తే చిల్లర సమస్య అధిగమిస్తాం.
– ఎన్‌వీఏస్‌వేణుగోపాల్, డిపో మేనేజర్, విజయనగరం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top