స్వగృహ ప్రాప్తిరస్తు

Receiving Applications For Allotment Of Houses For Poor - Sakshi

అర్హులైన అందరికీ ఇళ్లు

జీవీఎంసీ పరిధిలో చురుగ్గా ప్రక్రియ

వార్డు వలంటీర్ల ద్వారా సర్వే, దరఖాస్తుల స్వీకరణ

ఇప్పటికే 50 శాతం దరఖాస్తుల అప్‌లోడ్‌ పూర్తి

నెలాఖరునాటికి జాబితా సిద్ధం చేసేందుకు కసరత్తు

సాక్షి, విశాఖపట్నం: నవరత్నాల అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. అధికారంలోకి రాగానే నవరత్నాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆ దిశగా నడిపిస్తున్నారు. ఇందులో భాగంగా నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇళ్లులేని లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం జీవీఎంసీ పరిధిలో ఇళ్లు లేని వారి జాబితాను సిద్ధం చేస్తోంది. గత ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించేందుకు వివిధ ప్రాంతాల్లో నిర్మాణాలు తలపెట్టింది. ఆ గృహ నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ సక్రమమా.. కాదా.. అనే విషయాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. దానికనుగుణంగా తదుపరి నిర్మాణాలు పూర్తి చేసి అందరికీ ఇళ్లు మంజూరు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముందస్తుగా లబ్ధిదారుల సమాచారం సేకరణ ప్రక్రియ ప్రారంభించింది.

వార్డు వలంటీర్ల ద్వారా సర్వే..
నగర పరిధిలో ఇళ్లు లేని లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను ఇప్పటికే జీవీఎంసీ ప్రారంభించింది. ఇటీవల నియమితులైన వార్డు వలంటీర్లు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఒక్కో వలంటీరు 50 నుంచి 100 ఇళ్లకు వెళ్లి వారి వివరాలు సేకరిస్తున్నారు. ప్రజాసాధికార సర్వేలో నమోదై, సొంత ఇల్లు కానీ, స్థలం కానీ లేని వారి వివరాలు, ఆధార్‌ నంబర్‌లు, రేషన్‌కార్డు వివరాలు తీసుకొని ఆయా జోన్‌ పరిధిలో ఉన్న అర్బన్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌(యూసీడీ) అధికారులకు అందజేస్తున్నారు. ఆధార్‌ కార్డులు, ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా అధికారులు లబ్ధిదారులను గుర్తించి.. దరఖాస్తులు సిద్ధం చేస్తున్నారు. ఈ దరఖాస్తుల్ని నవరత్నాలు హౌస్‌సైట్స్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులకు సంబంధించిన దరఖాస్తులన్నీంటినీ వార్డు, జోన్‌ వారీగా అప్‌లోడ్‌ చెయ్యాలని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు యూసీడీ అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. త్వరితగతిన లబ్ధిదారుల జాబితా రూపొందించి నివేదికల్ని సిద్ధం చేసి అప్‌లోడ్‌ చేసేందుకు జీవీఎంసీ అధికారులు, సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

వెంటపడుతున్న దళారులు..
గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో గృహాలు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభించింది. నాలుగు విడతల్లో 56,059 ఇళ్లు ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం గాలిలో లెక్కలు వేసి.. కేవలం వందల సంఖ్యలో మాత్రమే కేటాయింపులు జరిపింది. కానీ ఎన్నికలు వస్తున్న సమయంలో ప్రజల్ని మభ్యపెట్టి లక్షలాది మంది వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించేశారు. తీరా ఎన్నికలయ్యాక ఆ దరఖాస్తుల్ని తిరిగి ప్రజలకు ఇచ్చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ప్రభుత్వం మారిన తర్వాత కొందరు టీడీపీ దళారులు కొత్త వ్యాపారం ప్రారంభించారు. ఇప్పటికే ఇళ్లు మంజూరైన వారి వద్దకు వెళ్లి కొత్త ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో మీకు ఇచ్చిన ఇళ్లు రద్దు అయిపోతాయి.. కాబట్టి.. మాకు ఎంతో కొంత ధరకు అమ్మేస్తే.. ఆ తర్వాత మేము వాటిని కాపాడుకోగలమని కొందరు మభ్యపెడుతున్నారు’. లబ్ధిదారుల వద్దకు వెళ్లి మీకు మంజూరైనప్పటికీ ఫైనల్‌ లిస్టులో పేరు తొలగించకుండా ఉండాలంటే.. డబ్బులు చెల్లించాలంటూ ఇంకొందరు రూ. 5 నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు.

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక..
లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తోంది. వలంటీర్లు స్వయంగా ప్రతి ఇంటికీ వెళ్లి వారి వివరాలు నమోదు చేస్తున్నారు. పూర్తిస్థాయి డేటా తీసుకొని ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డుల ద్వారా డేటాను పరిశీలించి అసలైన లబ్ధిదారులుగా గుర్తించేందుకు కసరత్తులు చేస్తున్నారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లు ఎవరిది.. ఇలా మొత్తం సమాచారం అధారంగా అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. మొత్తంగా ఈ నెలాఖరునాటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేసేందుకు జీవీఎంసీ యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్‌ వై శ్రీనివాసరావు నేతృత్వంలో సిబ్బంది తీవ్రంగా కృషిచేస్తున్నారు.

వదంతులు నమ్మొద్దు..
నవరత్నాల్లో భాగంగా అందరికీ ఇళ్లు కేటాయింపునకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి ఆలో చనలకు అనుగుణంగా జీవీఎంసీ పరిధి లో హౌస్‌ సర్వే నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. దరఖాస్తుల్ని నవరత్నాలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసే ప్రక్రియ వేగవంతమవుతోంది. గతంలో ఇళ్లు కేటాయింపులు పూర్తయిన వారు చాలా మంది వదంతులు నమ్ముతున్నారని తెలిసింది. ఎలాట్‌మెంట్‌ చేసినవారి దగ్గరికి కొంద రు వెళ్లి వాళ్ల ఎలాట్‌మెంట్‌ క్యాన్సిల్‌ అయ్యిందనీ.. ఇప్పుడే దాన్ని తమ పేరుపై రాయకపోతే కట్టిన డబ్బులు వృథా అని మాయమాటలు చెబుతున్నారని ఫిర్యాదులు వస్తున్నా యి. జీవీఎంసీ కమిషనర్‌ పేరుతో అధికారికంగా ప్రకటనలు వచ్చేంత వరకూ ఎవ్వరూ ఏ విషయాన్ని నమ్మవద్దు.
– జి.సృజన, జీవీఎంసీ కమిషనర్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top