అక్రమ రవాణాకు రెడీమేడ్‌ సోకు | Ready made clothes smuggling From Kolkata | Sakshi
Sakshi News home page

అక్రమ రవాణాకు రెడీమేడ్‌ సోకు

Dec 24 2018 1:46 PM | Updated on Dec 24 2018 1:46 PM

Ready made clothes smuggling From Kolkata - Sakshi

రిక్షాల ద్వారా తరలిస్తున్న రెడీమేడ్‌ వస్త్రాలు

ప్రకాశం,చీరాల:చీరాలలో జరిగే వాణిజ్య వ్యాపారాల్లో అధిక శాతం అక్రమాలే ఉంటాయి. పప్పు నుంచి ఉప్పు దాకా అంతా కల్తీ మయం. ఏ నూనెలో వేలు పెట్టినా కలుషితం. చివరికి తాగే టీ పొడిలో కూడా రంగు కోసం షూ పాలీష్‌కు వాడే కెమికల్‌ను కొందరు వినియోగిస్తుంటారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బంది అందిన కాడికి దోచేసుకుని నాలుగు రూపాయలు సంపాదించి వెళ్లిపోదామనే ఆలోచన తప్ప అక్రమ వ్యాపారంపై కొరడా ఝుళిపించి సక్రమంగా పన్నులు కట్టేలా చేయడంలో తీవ్రంగా విఫలమయ్యారు. వ్యాపారులు ఇచ్చే మామూళ్లతో సరిపుచ్చుకుంటున్నారు. జీఎస్టీ విధించిన తర్వాత పలు వ్యాపారాల గుట్టు రట్టువుతోంది. దీని వలన తమ వ్యాపార లావాదేవీలు బయటకు వస్తాయని భావించిన రెడీమేడ్‌ వ్యాపారస్తులు కొత్త అక్రమ రవాణాకు తెరలేపారు. గతంలో కలకత్తా, ఢిల్లీ ఇతర ప్రాంతాల నుంచి పార్శిల్‌ వాహనాల ద్వారా చీరాలకు వస్త్రాలు రవాణా చేసేవారు. దీని వలన మధ్యలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టుకుని జీఎస్టీ పన్నులతో పాటు అక్రమ రవాణాకు భారీగా జరిమానా విధిస్తుండడంతో వారి కన్ను కప్పి రైళ్లలో తరలిస్తున్నారు. కలకత్తా నుంచి విజయవాడకు  చిన్నారులు, యువత, మహిళలు వినియోగించే అన్ని రెడీమేడ్‌ వస్త్రాలను తరలించి అక్కడ నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌తో పాటు  పలు రైళ్లలో తరలిస్తున్నారు. చీరాలలో 150–170 వరకు రెడీమేడ్‌ దుకాణాలున్నాయి. వస్త్ర వ్యాపారంలో చినబొంబాయిగా పేరున్న చీరాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. చాలా తక్కువ ధరలకు కలకత్తా నుంచి రెడీమేడ్‌ వస్త్రాలు  చీరాలకు వస్తాయి. అలానే చీరాల నుంచి పర్చూరు, మార్టూరు, చినగంజాం, ఒంగోలులోనిరెడీమేడ్‌ దుకాణాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తుంటారు.

కళ్లు గప్పి..పన్ను ఎగ్గొట్టి: రెడీమెడ్‌ వస్త్రాలు జీఎస్టీ పరిధిలో ఉన్నాయి. వీటిపై ఐదు శాతం జీఎస్టీ విధించింది. అయితే వ్యాపారులు లక్షకు రూ.5 వేలు చెల్లించడం తమకేమి అవసరం అనుకోవడంతో పాటు ఒక్కసారి జీఎస్టీ చెల్లిస్తే నెలకు ఏడాదిలో జరిగే క్రయవిక్రయాల లొసుగులు బహిర్గమవుతాయని భయపడిన వారు పైసా కూడా పన్ను చెల్లించకుండా పక్కా వ్యూహం పన్నారు. కలకత్తా నుంచి ప్రయాణీకుల రైళ్లలో చీరాలకు తరలించి వాటిని నేరుగా రెడీమేడ్‌ దుకాణాలకు తరలిస్తున్నారు. ఇది కొద్ది నెలలుగా జరుగుతోంది. ఈ అక్రమ రవాణాకు చీరాలలో ఒక ముఠా ఏర్పడింది. ఇందులో దియాజ్‌ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారి. వచ్చిన సరుకును ఎవరి కళ్లకూ కనిపించకుండా జిల్లాలోని రెడీమేడ్‌ దుకాణాలకు తరలించడంతో పాటు వాణిజ్య పన్నుల అధికారులను తమ దారిలోకి తెచ్చుకోవడం అతని పని.

ఈ అక్రమ రవాణాలో దియాజ్‌ లక్షలాది రూపాయలు పోగేసుకున్నట్లు సమాచారం. రైళ్ల ద్వారా రోజూ రూ.15– రూ.20 లక్షల విలువైన వస్త్రాలు దిగుమతి అవుతున్నాయని ఒక రెడీమేడ్‌ వస్త్ర వ్యాపారే చెప్పడం గమనార్హం.

అక్రమ రవాణా వ్యవహారం వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ దృష్టికి: రైళ్లలో జరుగుతున్న రెడీమేడ్‌ వస్త్రాల అక్రమ రవాణాపై చీరాలకు చెందిన కొందరు స్థానిక వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల పాటు అధికారులకు ఫిర్యాదు చేసినా ఒకేఒక్కసారి మాత్రం ఫిర్యాదుదారులు అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను దగ్గరుండి చూపించడంతో పట్టుకున్నారు. అయితే ఆ తర్వాత నెలలో ప్రతిరోజు జరుగుతున్నా ఆ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఆ వ్యక్తులు నేరుగా అక్రమ రవాణా జరుగుతున్న తీరును ఫొటోలతో సహా కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కార్యాలయ ఒత్తిడితో ఒక్కసారి మాత్రమే రైల్వేస్టేషన్‌లో పట్టుకున్నట్లు సమాచారం. కొద్ది నెలలుగా జరుగుతున్న ఈ తంతు వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు, సిబ్బందికి పూర్తిగా సమాచారం ఉంది. రోజూ లక్షల్లో జరుగుతున్న ఈ వ్యాపారంపై కనీసం దాడులు చేయడంతో పాటు రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం విశేషం. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. రెడీమేడ్‌ వస్త్ర వ్యాపారులంతా తమపై దాడులు చేయకుండా ఏడాదికి రూ.5 – రూ.7 లక్షలు మామూళ్లు చెల్లిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి కూడా ముడుపులు చెల్లించాల్సిందే. ఎప్పుడైనా రాష్ట్ర స్థాయిలో నుంచి దాడులు చేయాలని ఆదేశిస్తే వ్యాపారులకు ముందస్తుగానే సమాచారం అందుతుంది. మీ దుకాణాలపై దాడులు జరుగుతాయని మా అధికారులు వస్తున్నారంటూ ముందస్తుగానే సమాచారం ఇస్తారు. సదరు వ్యాపారులు మాత్రం అంతా సక్రమంగానే ఉన్నాయంటూ చూపించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement