భవితకు బంగరు విత్తు వేసే చదువులను సైతం విద్యార్థులు త్యాగం చేస్తున్నారు.. కుటుంబాన్ని పోషించాల్సిన ఉద్యోగులు జీతాలను త్యాగం చేసేందుకు వెనకాడటం లేదు..
సాక్షి, మచిలీపట్నం : భవితకు బంగరు విత్తు వేసే చదువులను సైతం విద్యార్థులు త్యాగం చేస్తున్నారు.. కుటుంబాన్ని పోషించాల్సిన ఉద్యోగులు జీతాలను త్యాగం చేసేందుకు వెనకాడటం లేదు.. నెలవారీ బడ్జెట్‌తో బతుకు బండి లాగే ఉపాధ్యాయులు వేతనాలు అందకపోయినా సమరం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు.. పొట్టపోసుకునేందుకు దోహదం చేసే రాయితీలను సైతం వదులుకునేందుకు పేదలు సిద్ధమయ్యారు.. వైఎస్సార్‌సీపీ నేతలు పదవీత్యాగాలకు కూడా వెనకాడలేదు.. ఇది జిల్లాలో 45 రోజులుగా కొనసాగుతున్న త్యాగాల ఉద్యమం.. సమైక్య సమరం.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ జిల్లాలో ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలూ కష్టనష్టాలెన్ని ఎదురైనా వన్నుచూపక ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వైఎస్సార్‌సీపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలు పూర్తిగా సమైక్య నినాదాన్ని మరచిపోయిన తరుణంలోను ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమాన్ని ముందుకు నడుపుతున్నారు. జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం మొదలై 45 రోజులు దాటింది. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి సీమాంధ్ర ప్రజల మన్ననలు అందుకున్నారు.
అదే స్ఫూర్తితో జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సమైక్య శంఖారావాన్ని చేపట్టారు. జిల్లాలోని వైఎస్సార్‌సీపీ శ్రేణులు సైతం సమైక్య ఉద్యమంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. నాన్‌పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ ఉద్యమంలో ఎన్‌జీవోల పిలుపుతో సుమారు 35 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు 370 మంది, పంచాయతీ సిబ్బంది 1,200 మంది, వీఆర్వోలు సుమారు 900 మంది, వీఆర్వోలు రెండువేల మంది ఉన్నారు.
ఐదు మున్సిపాలిటీల్లో 1,274 మంది పర్మినెంట్ ఉద్యోగులు, మూడు నగర పంచాయతీల్లో సుమారు 150 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. అప్పటినుంచి వారు ప్రభుత్వ కొలువుల్లో విధులను బహిష్కరించి ఉద్యమ పథంలో సాగుతున్నారు. ట్రెజరీ ఉద్యోగుల సమ్మెతో సమ్మెలో కొనసాగుతున్న ఉద్యోగులకు గత నెల జీతాలు రాలేదు. జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు సుమారు రూ.85 కోట్ల మేర జీతాల బిల్లులు నిలిచిపోయాయి. గత నెల 22 నుంచి విద్యాసంస్థల బంద్‌ను పాటిస్తున్నారు.
దీంతో జిల్లాలోని 3,340 సర్కారీ బడుల్లో పనిచేస్తున్న సుమారు 16 వేల మంది ఉపాధ్యాయుల్లో చాలా వరకు విధులను బహిష్కరించి సమైక్య ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు. ఉపాధ్యాయుల సమ్మెతో పాఠశాలలు మూతపడి సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు చదువులు నష్టపోతున్నారు. అయినా ఏమాత్రం కలవరపడకుండా అవకాశం ఉన్న మేరకు ఉద్యమంలో నినదిస్తున్నారు.
ప్రజలకూ ఇబ్బందులు..
జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన ఉద్యమం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయినా సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా ఉద్యమాలకు జనం మద్దతు పలుకుతున్నారు. జిల్లాలోని మండల లెవెల్ స్టాక్ (ఎంఎల్‌ఎస్) పాయింట్ల నిర్వాహకులు సైతం సమ్మెబాట పట్టడంతో ఈ నెల రేషన్ బియ్యం ఆలస్యంగానే అందిస్తున్నారు. అమ్మహస్తం, కిరోసిన్ వంటి సరకుల సరఫరా అనుమానమే. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు సైతం పింఛన్లు ఆలస్యంగానే పంపిణీ చేశారు.
జిల్లాలో పాలన పడకేయడంతో విద్య, వైద్యం, వ్యవసాయ, ఆక్వా రంగాలతో పాటు ప్రజలు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రతి సోమవారం మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రజావాణి జరగకపోవడంతో ప్రజల మొర వినేవారు లేరు. వారి సమస్యలు పరిష్కరించే అవకాశమూ లేదు. సమైక్యాంధ్ర ప్రభావంతో తిరగని బస్సులు, ఆటోల అడ్డగింపుతో ఇళ్లు కదిలి ప్రజలు బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇంకా మంచినీరు, పారిశుధ్యం, కరెంటు వంటి సమస్యలు సైతం ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. అయినా ఏమాత్రం చలించకుండా త్యాగాలకు సైతం సిద్ధమై ప్రజలు సమైక్యవాదంతో తమ గొంతు కలుపుతుండటం విశేషం.