రాకాసి బస్సు


 కాసేపట్లో బస్సు దిగాలి.. బెంగళూరు వచ్చేస్తోందని ప్రయాణికులు అప్పుడప్పుడే నిద్రలోంచి మేల్కొంటున్నారు. ఇంతలో ఉన్నట్లుండి ఒక్క సారిగా.. ధడేల్ మంటూ పెద్ద శబ్దం.. బస్సు డివైడర్‌ను ఢీకొందంటూ ప్రయాణికుల కేకలు.. అయ్యో.. బస్సు.. ఆపండి అంటూ ఆర్తనాదాలు.. అంతలోనే బస్సు డివైడర్‌పై నుంచి ఎడమ వైపు తిరిగి బోల్తా.. దేవుడా.. కాపాడు అంటూ గావు కేకలు.. అరుపులు, ఆర్తనాదాలు, ఏడుపులు, పెడబొబ్బలు... హోస్‌కోట వద్ద సోమవారం తెల్లవారు జామున నెల్లూరు నుంచి బెంగళూరుకు వస్తూ ప్రమాదానికి గురైన వోల్వో బస్సు వద్ద దృశ్యమిది.. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం, కర్ణాటకలోని హావేరిల్లో రెండు వోల్వో బస్సులు దగ్ధమైన ఘటనలు ప్రజల స్మృతి పథం నుంచి చెరిగిపోక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడం అందరినీ నిశ్చేష్టులను చేసింది. ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికుల భద్రతపై కలుగుతున్న అనుమానాలకు బలం చేకూర్చింది.

 

 సాక్షి, నెల్లూరు:  ‘పాలెం’ ఘటన కళ్ల ముందు మెదలుతుండగానే మరో ప్రైవేటు బస్సు మృత్యు శకటంగా మారింది. ఐదుగురి ప్రాణాలను బలితీసుకుని జిల్లాలో విషాదం నిం పింది. తనిఖీలు చేస్తున్నామని ఓ వైపు ఆర్టీఏ అధికారులు చెబుతున్నా, మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా బస్సులు తిరుగుతూ ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయి. రాజేష్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఆదివారం రాత్రి 10 గంటలకు 52 మంది ప్రయాణికులతో నెల్లూరు నుంచి బెంగళూరుకు బయలుదేరింది. విజయవాడ నుంచి ఈ బస్సు బయలుదేరాల్సి ఉన్నా, నెల్లూరులోనే టికెట్లన్నీ రిజర్వ్ కావడంతో ఇక్కడ నుంచే పంపారు. సోమవారం తెల్లవారుజామున 5.15 గంటలకు కర్ణాటకలోని హోస్‌కోట వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని మూడు ఫల్టీలు కొట్టింది. అనంతరం కొద్దిదూరం బస్సు వేగంగా ఈడ్చుకుపోవడంతో సంఘటన స్థలంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 8 మందికి తీవ్రంగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. ఎక్కువ మందికి చేతులు, కాళ్లు విరిగాయి. మృతుల్లో నెల్లూరుకు చెందిన అనూష్(25), విజయకుమార్(32), మానస్‌కుమార్(7), గూడూరుకు చెందిన ప్రదీప్(25), పొదలకూరు మండటం వావింటపర్తికి చెందిన చిన్నం ప్రసాద్(28) ఉన్నారు. వీరిలో ప్రదీప్, ప్రసాద్, విజయకుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, అనూష నిండు గర్భిణి.  

 

 పత్తాలేని ట్రావెల్స్ నిర్వాహకులు

 ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ప్రయాణికుల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో, తమ వారు ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు హుటాహుటిన రాజేష్ ట్రావెల్స్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఏజెన్సీ నిర్వాహకులు కార్యాలయానికి తాళం వేసి పత్తా లేకుండా పోయారు. ఆర్టీఏ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు కరువయ్యారు. తమవారి క్షేమ సమాచారం తెలుసుకునేందుకు వచ్చిన వారంతా నానా తంటాలు పడ్డారు.

 

 నిర్లక్ష్యమే కారణమా

 రాజేష్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి యాజ మాన్యం నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది.  డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొట్టినట్లు తెలిసింది. ఘటన జరిగేందుకు అరగంట ముందు డ్రైవర్ బస్సు ఆపి టీ తాగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. మరోవైపు ప్రయాణికుల జాబితా రూపకల్పనలోనూ యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిం చింది. తిరుపాల్ పేరు మీద ఎల్-11 ఎస్‌టీ, ఎల్-13 ఎస్‌టీ, ఎల్-14 ఎస్‌టీ సీట్లు రిజర్వయ్యాయి. ఈ పేర్లపై వయస్సు కాలంలో 0 అని ఉంది. ఎల్-23, ఎల్-24 నంబర్లలో చూపినట్లు మల్లికార్జున, పంకజ్‌జైన్ అసలు ప్రయాణమే చేయలేదు. ఆర్-11 పేరున శ్రీకాంత్ శనివారం ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. ఆ వివరాలను జాబితాలో తెలపలేదు. ఈ తప్పుల తడక జాబితాను అధికారికంగా ఆర్టీఏ అధికారులు విడుదల చేయడం గమనార్హం. ఇంత జరిగినా ఆయా ట్రావెల్స్ సంస్థలపై చర్యలు తీసుకోవడానికి అటు పాలకులకు, ఇటు అధికారులకు ధైర్యం కరువైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top