
బాబు... బీజేపీతో పొత్తుకు ఎందుకంత తాపత్రయం: రఘువీరా
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్ రఘువీరా రెడ్డి ఆదివారం గుంటూరులో నిప్పులు చెరిగారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్ రఘువీరా రెడ్డి ఆదివారం గుంటూరులో నిప్పులు చెరిగారు. చంద్రబాబు రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయారని అన్నారు. అటు సీమాంధ్రకు వెళ్లితే ఆ ప్రాంతానికి, ఇటు తెలంగాణ వెళ్లితే ఆ ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లిందని ఆయన వ్యాఖ్యానించారు. నాడు రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి.. ఇప్పడు చంద్రబాబు ముసలి కన్నీరు కార్చుతున్నారని ఆరోపించారు.
బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు తహతహలాడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బాబు ఎందుకంత తాపత్రయపడుతున్నారో అర్థం కావడం లేదని రఘువీరారెడ్డి అన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం భోపాల్ లో ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అయితే ఆ కార్యక్రమానికి హాజరైన బీజేపీ అగ్రనేతలతో బాబు విడివిడిగా మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో బాబు మళ్లీ ఎన్.డి.ఎ కూటమిని ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రఘువీరారెడ్డిపై విధంగా స్పందించారు.