పాస్‌పోర్టుకూ సమైక్య సెగ! | public faces problem for pass ports due to samaikyandhra protest | Sakshi
Sakshi News home page

పాస్‌పోర్టుకూ సమైక్య సెగ!

Sep 23 2013 12:09 AM | Updated on Sep 1 2017 10:57 PM

పాస్‌పోర్టుల జారీకీ సమైక్య సెగ తగులుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాజమండ్రి అర్బన్, ఉభయగోదావరి జిల్లాల వాసుల పాస్‌పోర్ట్ కార్యకలాపాలకు విశాఖలోనే కార్యాలయం ఉంది.

సాక్షి, విశాఖపట్నం: పాస్‌పోర్టుల జారీకీ సమైక్య సెగ తగులుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాజమండ్రి అర్బన్, ఉభయగోదావరి జిల్లాల వాసుల పాస్‌పోర్ట్ కార్యకలాపాలకు విశాఖలోనే కార్యాలయం ఉంది. బస్సుల బంద్ కారణంగా అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నా ఆన్‌లైన్ సేవలకు సంబంధించి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని రకాల పాస్‌పోర్ట్ పనులకు సంబంధించి సమయం మించిపోతే ఆన్‌లైన్ సేవలు ఆగిపోయే అవకాశం ఉంది. దీంతో వివిధ జిల్లాల నుంచి పాస్‌పోర్టు కోసం వస్తున్న అభ్యర్థులు మురళీనగర్‌లో ఉన్న పాస్‌పోర్ట్ సేవాకేంద్రం (పీఎస్‌కే), మర్రిపాలెం రైతు బజార్ వద్ద ఉన్న ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సివస్తోంది. పాస్‌పోర్ట్ కార్యాలయం వారానికి ఐదురోజులే పనిచేస్తుంది.


 
 ఇటీవల సమైక్యవాదులు కేంద్ర కార్యాలయాలనూ మూయించే ప్రయత్నం చేశారు. ఈ కారణంగా సిబ్బంది కొద్దిసేపు షట్టర్ దించేసి విధులు బహిష్కరించారు. సమ్మె సమయంలో పోలీస్ బందోబస్తు మధ్య విధులు నిర్వహిస్తున్నారు. సమైక్య ఆందోళన ఊపందుకుంటే పాస్‌పోర్టు సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి పీఎస్కేలో నిత్యం సుమారు 700 లావాదేవీలు జరుగుతుంటాయి. ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ ఉన్న అభ్యర్థులకు పెద్దగా ఇబ్బందుల్లేకున్నా మిస్‌లీనియన్ కార్యకలాపాలకు నష్టం వాటిల్లనుంది.
 
 

స్పౌజ్ కోటాలో ఎవరికి పాస్‌పోర్ట్ కావాలన్నా మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్లశాఖ సిబ్బంది కూడా ఉద్యమంలో ఉండడంతో ఈ తరహా పాస్‌పోర్ట్‌లు పొందడానికి అభ్యర్థులు ఇబ్బందులు పడాల్సివస్తోంది. కొత్త జంటకు పాస్‌పోర్ట్ కావాలన్నా సర్టిఫికెట్ కావాల్సి ఉన్నప్పటికీ ఎనెగ్జర్-టి నోటరీ రూపంలో అధికారులు భర్తీ చేస్తున్నారు. అత్యవసర కోటా కింద ఈ తరహా సర్టిఫికెట్లను కొన్ని చోట్ల ఐజీ స్థాయి పోలీస్ అధికారులు ఇస్తున్నారు. ఇక్కడా ఈ సౌకర్యం అమలు చేస్తే బావుంటుందని కోరుతున్నారు.

 

పీసీసీకి మర్రిపాలెం కార్యాలయం
 
  పీఎస్కేలో ఒకేరోజు పోలీస్ వెరిఫికేషన్ పత్రాలు, పాస్‌పోర్ట్‌ల కార్యకలాపాలకు డిమాండ్ ఉండడంతో రద్దీ ఏర్పడుతోంది. దీంతో ఇక  పీసీసీ పత్రాల కోసం మర్రిపాలెంపాస్‌పోర్ట్ కార్యాలయంలోనే పొందాల్సి ఉంటుంది. ఉదయం 9నుంచి 11గంటల మధ్యే పీసీసీలు జారీ చేస్తున్నారు.  పాస్‌పోర్ట్ జారీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పీసీసీ జారీకి పీఎస్కే మంచిదా..రద్దీని తట్టుకునేందుకు ప్రధాన కార్యాలయం అనువైనదా అన్న విషయంలో  తర్జనభర్జన పడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement