దోచేందుకే పరీక్ష

Private Hospital Tests Without Dengue Fever  - Sakshi

డెంగీ నిర్ధారణ పరీక్షలకు రూ.వేలల్లో గుంజుడు

ల్యాబ్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యం

అప్రమత్తత అవసరమంటున్న వైద్యులు

మహేంద్ర కుమార్తెకు జ్వరంగా ఉండడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. యువతికి డెంగీ సోకినట్లు అనుమానంగా ఉందని వైద్యులు రాసిచ్చిన పరీక్షలకు రూ.6వేలు ఖర్చు చేశాడు. అయినా సరే ఏ జ్వరం అనే దానిపై నివేదికల్లో స్పష్టత లేదు. మరో ఆస్పత్రికి వెళ్లగా అక్కడ రూ.4వేలు ఖర్చు అయ్యింది. అయినా జ్వరం తగ్గకపోవడంతో నెల్లూరులోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా రూ.800 ఖర్చుతో వైరల్‌ జ్వరం వచ్చినట్లు తేల్చారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి సైతం కుదుటపడింది.’’

చిత్తూరు అర్బన్‌ : ఇది మహేంద్ర ఒక్కడి సమస్యే కాదు జిల్లాలోని చాలామంది తల్లిదండ్రుల ఆవేదన. ఇటీవల జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో నివాసాల మధ్య నీటి నిల్వ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫలితంగా దోమల వ్యాప్తి పెరిగింది. ఇదే అదునుగా జ్వరమొచ్చి రక్తపరీక్షల్లో ప్లేట్లెట్లు కాస్త తగ్గినా కొందరు వైద్యులు డెంగీని బూచిగా చూపుతూ బాధితుల జేబులు గుల్ల చేస్తున్నారు. డెంగీ జ్వరాలపై ప్రజలకు కనీస అవగాహన ఉంటే తప్ప ఈ దోపిడీకి అడ్డుకట్ట పడేటట్లు కనిపిం చడం లేదు.

డెంగీ వ్యాప్తి ఇలా..
డెంగీ జ్వరం ఎడిస్‌ ఈజిప్టి (టైగర్‌ దోమ) దోమవల్ల వ్యాప్తి చెందుతుంది. ఆర్బో అనే వైరస్‌ ఎడిసన్‌ దోమలోకి ప్రవేశించి అది మనిషిని కుట్టడం ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశి స్తుంది. దోమ కుట్టిన ఐదు రోజులుతర్వాత డెంగీ లక్షణాలు కనిపిస్తాయి. ఈ దోమలు ఇళ్లల్లోని మంచినీళ్లు, పూలకుండీలు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కూలర్లు, నిల్వ ఉన్న వర్షపు నీళ్లల్లో వృద్ధి చెందుతుంటాయి. కేవలం ఇది పగటి పూట కుట్టడం ద్వారానే డెంగీ వ్యాప్తి చెందుతుంది.

నిర్ధారణ పరీక్షలు మ్యాక్‌ ఎలీసా పరీక్ష
తిరుపతిలోని రుయా, స్విమ్స్‌ ఆస్పత్రుల్లో మ్యాక్‌ ఎలీసా ద్వారా డెంగీ నిర్థారణ పరీక్ష ఉచితంగా చేస్తారు. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి నుంచి రక్తనమూనా సేకరిస్తారు. రక్తంలోని సీరంకు ఐజీజీ, ఐజీఎం పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి 8 గంటల సమయం పడుతుంది. ఇందులో పాజిటివ్‌ వస్తే డెంగీ జ్వరం ఉన్నట్లు నిర్థారిస్తారు. డెంగీ జ్వరం నుంచి కోలుకున్న ఆరునెలల వరకు మ్యాక్‌ ఎలిసా పరీక్ష ఎప్పుడు నిర్వహించినా పాజిటివ్‌ వస్తుంది. అంతమాత్రాన డెంగీ జ్వరం ఆరునెలలుగా ఉందని అర్థం కాదు. ఈ పరీక్షలకు కొన్ని ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లో రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారు.

ఆర్‌డీటీ పరీక్ష
ర్యాపిడ్‌ డయోగ్నస్టిక్‌ టెస్ట్‌ (ఆర్‌డీటీ) ద్వారా ఇటీవల డెంగీ జ్వరాలను నిర్థారణ చేయడం చాలా ల్యాబ్‌లకు అలవాటైపోయింది. ఈ పరీక్ష ద్వారా రక్త నమూనా సేకరించి ఐదు రోజుల్లోపు జ్వరంతో బాధపడుతుంటే ఎన్‌ఎస్‌–1 పరీక్ష చేస్తారు. ఐదు రోజులకు పైబడి జ్వరం వస్తూనే ఉంటే ఐజీజీ, ఐజీఎం పరీక్షలు చేస్తారు. ఇది అరగంటలో పూర్తయిపోతుంది. అయితే డెంగీ నిర్థారణకు ఇది సరైన పరీక్ష కాదు. డెంగీతో పాటు ఇతర వైరల్‌ జ్వరాలు వస్తే కూడా ఈ పరీక్షలో పాజిటివ్‌ వస్తుంది. ఈ పరీక్ష చేయడానికి రూ.300 పైన చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ప్రైవేటు వైద్యులు రూ.2వేల వరకు తీసుకుంటున్నారు.

ప్లేట్లెట్ల పరీక్ష
సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో రక్తంలోని ప్లేట్లెట్లు సంఖ్య 2లక్షల వరకు ఉంటుంది. వైరల్‌ జ్వరాలు వచ్చినప్పుడు ప్లేట్లెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ప్లేట్లెట్ల సంఖ్యను తెలిపే పరీక్షకు రూ.100 – 200 చెల్లిస్తే సరిపోతుంది. గంటలో ఫలితాన్ని ఇచ్చేస్తారు. పౌష్టికాహారం, వైద్యులు సూచించిన మందులు వేసుకుంటే ప్లేట్లెట్లు పెరుగుతాయి. ఒక్కోసారి ప్లేట్లెట్లు 10వేలకు కూడా పడిపోతాయి. అంతమాత్రాన కంగారు పడాల్సినవసరం లేదు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రి, తిరుపతిలోని రుయా, స్విమ్స్‌ ఆస్పత్రుల్లో రోగికి నేరుగా ప్లేట్లెట్లనే ఎక్కించే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. నాలుగు రోజుల్లో ప్లేట్లెట్లు పడిపోయిన వ్యక్తికి 1.40లక్షల వరకు ప్లేట్లెట్లను పునరుత్పత్తి చేసే యంత్రాలు ప్రభుత్వాస్పత్రుల్లోనే ఉన్నాయి. కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో వేల రూపాయలు ఫీజుగా వసూలు చేస్తున్నారు.

వైద్యులు ఏం చెబుతున్నారంటే
ప్లేట్లెట్లు తగ్గినా, ఆర్‌డీడీ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినా డెంగీ వచ్చినట్లు కాదు.
కొందరు ల్యాబ్‌ నిర్వాహకులు, మరికొందరు ప్రైవేటు వైద్యులు డెంగీపై కంగారు పెట్టేస్తుంటారు. అలాంటి వాటికి భయపడొద్దు.
ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక, సామాజిక, ఉప ఆరోగ్య కేంద్రాల్లో అనుభవమున్న వైద్యులున్నారు. విడవని జ్వరంతో బాధపడుతున్న వారిని అక్కడికి తీసుకెళ్తే రోగికి ఉన్న లక్షణాల ఆధారంగానే డెంగీ ఉందా, లేదా అని చెప్పేస్తారు.
డెంగీ నిర్ధారణ కోసం మ్యాక్‌ ఎలీసా పరీక్షలకు రక్తనమూనా సేకరించి తిరుపతికి పంపిస్తారు. అక్కడి నుంచి రిపోర్టు వచ్చిన తర్వాత డెంగీ ఉంటే చికిత్స ప్రారంభిస్తారు. ఇవన్నీ ఉచితంగా చేయాలి.

ఇక డెంగీ వైరస్‌ ద్వారా వచ్చే జ్వరానికి పారాసిట్మాల్‌ మాత్ర వేస్తేనే క్రమంగా తగ్గిపోతుంది. బొప్పాయి, దానిమ్మ పండ్లను బాగా తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు ప్లేట్లెట్లు కూడా పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది.– డాక్టర్‌ పి.సరళమ్మ, జిల్లా ప్రభుత్వవైద్యశాలల సమన్వయాధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top