పలు జిల్లాల్లో వరుణుడి బీభత్సం

Premature Rain In Districts Of Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట వ్యాప్తంగా గురువారం తెల్లవారుజామున పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుముల మెరుపులతో కూడిన వడగండ్ల వానతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. కృష్ణా జిల్లా కురవటంతో కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాలు చిగురుటాకులా వణికాయి. దీంతో మామిడి ,కొబ్బరి చెట్లు విద్యుత్ స్తంభాలు, పూరి గుడిసెలు నేలకొరిగాయి.

కృత్తివెన్ను పల్లెపాలెంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన ఇద్దరు జాలర్లు గల్లంతయ్యారు. ఒకరు మృతి చెందారు. నిడమరు పంచాయతీలో మరో ఐదుగురు మత్స్యకారులు గల్లంతవటంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అకాల వర్షం తమ పాలిట శాపంగా మారిందని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని కైకలూరు, కలిదిండి,  మండవల్లి, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్,  గుడివాడతో పాటు పలు ప్రాంతాల్లోలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

ప్రకాశం: పర్చూరు ప్రాంతంలో చిరుజల్లులు కురవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా  మిర్చి రైతులు, మిర్చిని పరదాలతో కాపాడుకోటానికి పాట్లు పడ్డారు.

పశ్చిమ గోదావరి: జంగారెడ్డిగూడెం మండలంలో తెల్లవారుజామున ఉరుములతో కూడిన గాలి, వాన బీభత్సం సృష్టించింది. దీంతో మండలంలో పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా మామిడి కాయలు నెలరాలాయి.  మొక్కజొన్న, వరి పంటలు తడిసిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

గుంటూరు: జిల్లాలో పలు చోట్ల చెదరుమదరుగా వర్షం కురిసింది. పొన్నూరు, రేపల్లె, బాపట్ల, చిలకలూరిపేటలో మోస్తరు వర్షం పడింది. పొన్నూరు మండలం కొండముదిలో పిడుగుపడి రెండున్నర ఎకరాల వరికుప్ప దగ్ధం అయింది.


తూర్పు గోదావరి: జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో వేకువజాము నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అదేవిధంగా రాజనగరం నియోజకవర్గం మూడు మండలాల్లో గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఉపయోగించి రైతులు మొక్కజొన్న, ధాన్యాన్నివర్షం నుంచి కాపాడుకోవడానికి  ప్రయత్నం చేశారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top