వెలుగుల నివేదికలపై అసంతృప్తి చీకట్లు!

వెలుగుల నివేదికలపై అసంతృప్తి చీకట్లు!


 విజయనగరం మున్సిపాలిటీ : విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై ప్రభుత్వంతో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు అసంతృప్తిగా ఉన్నారా ...? అధికారులు ప్రతి రోజూ అందిస్తున్న నివేదికలపై నమ్మకం కుదరలేదా...? అంటే అవుననే ఆయా వర్గాల నుంచి సమాధానం వినిపిస్తోంది. విద్యుత్ శాఖ అధికారులు ఇస్తున్న నివేదికలకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.దాదాపు పక్షం రోజులుగా జరుగుతున్న పునరుద్ధరణపనులపై  ప్రజాప్రతినిధులు   అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఇదే విషయాన్ని ప్రజాప్రతినిధులు వ్యక్తం చేశారు. ఆదివారం నాటికి విద్యుత్ శాఖ అధికారుల లెక్కల ప్రకారం నాలుగు మున్సిపాలిటీలతో పాటు 34 మండల కేంద్రాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. జిల్లావ్యాప్తంగా మరో 226 గ్రామాలకు మాత్రమే విద్యుత్‌సరఫరా పునరుద్ధరించవలసి ఉందని అధికారులు ప్రకటించారు.

 

 సోమవారం నాటికి పరిశ్రమలకు విద్యుత్‌సరఫరాను చేస్తామని కలెక్టర్ ప్రకటించగా.. ఈనెలాఖరు నాటికి వ్యవసాయ విద్యుత్ కనక్షన్‌లకు సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే అధికారలు చెబుతున్న లెక్కలపై అటు ప్రభుత్వంతో పాటు ఇటు స్థానిక ప్రజాప్రతినిధులకు నమ్మకం కుదరలేదు. ఈనేపథ్యంలోనే వారికి అనుగుణంగా ఉండే బృందాలతో ప్రత్యేకంగా సర్వేలు నిర్వహిస్తున్నారు. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో దీపావళి ముందు రోజుకే విద్యుత్‌సరఫరాను పునరుద్ధరిస్తామని చేసిన  విద్యుత్ శాఖ అధికారుల ప్రకటన ఎంతవ రకు ఇది అమల్లో సాధ్యమైందన్న విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు స్పెషల్ బ్రాంచి అధికారులు ఇంటిఇంటికి వెళ్లి సర్వే చేశారు. అయితే ఈ విషయంలో సంబంధిత శాఖ అధికారులు చేసిన ప్రకటనలకు సరఫరా అవుతున్న తీరుకు పొంతన లేకపోవడంతో అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించి  నట్లు తెలుస్తోంది.

 

 అయితే ఆ రోజు నుంచి ప్రతి రోజు ఈ విషయంపై పలు సర్వే బృందాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు, స్పెషల్ బ్రాంచి యంత్రాంగం పని చేస్తోంది. ఇది కాకుండా జిల్లా పరిషత్ ప్రజాప్రతినిధులు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వ్యవహరాన్ని ఎప్పటికప్పుడు పరిశీ లిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రతి రోజూ విద్యుత్ శాఖ అధికారుల నుంచి నివేదికలను రప్పించుకుని ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌సరఫరా జరుగుతుందో లేదో తెలుసుకుంటున్నారు.

 

 ఇందుకోసం  మండలాభివృద్ధి అధికారుల నేతృత్వంలో సంబంధిత గ్రామాల రెవెన్యూ అధికారుల ద్వారా వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అటు ఇంటెలిజెన్స్,స్పెషల్ బ్రాంచి అధికారులతో పాటు గ్రామ స్థాయిలో మండల అభివృద్ధి అధికారులు ప్రతి రోజు ఇస్తున్న నివేదికల ఆధారంగా  విద్యుత్ శాఖ అధికారుల పని తీరును పరిగణించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎవరైతే కచ్చితమైన సమాచారం ఇస్తారో వారికి పదోన్నత కల్పించి... తప్పుడు నివేదికలు ఇచ్చే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించే అవకాశం లేకపోలేదు. ఇదంతా విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి స్థాయిలో జరిగిన తరువాతనే చర్యలు ఉంటాయన్న భావన వ్యక్తమవుతోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top