ఆదాయం లేని వేళ ఆదా

Power Department said that saving public money in Corona crisis - Sakshi

మార్చి నెలలో రూ.56 కోట్లు ఆదా చేసిన విద్యుత్‌ శాఖ

ముందస్తు వ్యూహంతో పురోగతి  

సాక్షి, అమరావతి: సంక్షోభంలోనూ ప్రజాధనం ఆదా చేయడంపైనే దృష్టి పెట్టినట్లు విద్యుత్‌ శాఖ తెలిపింది. మార్చి నెలలో మార్కెట్‌లో చౌక ధరకు లభించే విద్యుత్‌ కొనుగోలు చేసి రూ.56 కోట్లు మిగిల్చినట్లు వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మార్చి నెలలో సంస్థ పరిస్థితిపై ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం పత్రికలకు విడుదల చేశారు. 

► దేశవ్యాప్తంగా విద్యుత్‌ ధరలు తగ్గడాన్ని గుర్తించిన అధికారులు మార్కెట్లో లభించే చౌక విద్యుత్‌నే తీసుకున్నారు. 
► మార్చి నెలలో మొత్తం 357.22 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొన్నారు. యూనిట్‌కు గరిష్టంగా రూ.2.64 వరకూ చెల్లించారు. 
► విద్యుత్‌ నియంత్రణ మండలి నిర్ణయించిన కొనుగోలు ధర కన్నా ఇది యూనిట్‌కు రూ.1.57 తక్కువ. కొనుగోలు చేసిన మొత్తం విద్యుత్‌పై రూ.56 కోట్లు ఆదా అయింది. 

ప్రతికూలతల్ని అధిగమించి..
లాక్‌డౌన్‌ ప్రకటించిన వెంటనే ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి అప్రమత్తమయ్యారు.
► సమన్వయం, వాణిజ్య, సాంకేతిక విభాగాల పర్యవేక్షణ బాధ్యతను ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్‌ చక్రధర్‌బాబుకు అప్పగించి, అనుభవజ్ఞులతో ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశారు. 
► గ్రిడ్‌ నిర్వహణ, రాష్ట్రంలో డిమాండ్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేయడంతో పాటు, మార్కెట్లో విద్యుత్‌ లభ్యత, ఎంత చౌకగా ఏ సమయంలో దాన్ని తేవచ్చనే నిరంత విశ్లేషణలు చేపట్టడం వల్ల మంచి ఫలితాలొచ్చాయి.
► మార్కెట్‌లో చౌక విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్ల థర్మల్‌ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పెరిగాయి.
► ప్రస్తుతం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి.

ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి
లాక్‌ డౌన్‌ సంక్షోభాన్ని కూడా అవకాశంగా మలుచుకుని విద్యుత్‌ కొనుగోలు భారాన్ని తగ్గించేందుకు ఏపీ ట్రాన్స్‌కో చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. ప్రజాధనాన్ని ఆదా  చేయటంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది సరైన రుజువు. అధికారులు ఇదే స్పూర్తితో ముందుకెళ్లాలి.
– బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంధన శాఖ మంత్రి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top