వెరీ'గుడ్డు'

Poultry owners happy with increased prices - Sakshi

అపోహలు తొలగడంతో పెరిగిన వినియోగం

లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపుతో తీరిన రవాణా సమస్య

పెరిగిన ధరలతో పౌల్ట్రీ యజమానుల హర్షం  

సాక్షి, అమరావతి: కోడిగుడ్డుకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. కరోనా నేపథ్యంలో అపోహలతో వినియోగం తగ్గి ధరలు పడిపోవడం, తర్వాత లాక్‌డౌన్‌తో రవాణా ఆగిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన పౌల్ట్రీ రైతులు ఇప్పుడిప్పుడే ఊరట చెందుతున్నారు. కోడిమాంసం, గుడ్లు వల్ల కరోనా వైరస్‌ సోకదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పడం, కరోనా వైరస్‌ బారిన పడిన వారికి సైతం చికెన్‌ సూప్, గుడ్డు ఇవ్వొచ్చని కేంద్రప్రభుత్వ పశు సంవర్థక శాఖ అడ్వయిజరీ ప్రకటించడంతో అపోహలు తొలగిపోయాయి. అలాగే లాక్‌డౌన్‌ నుంచి కోడిగుడ్లను మినహాయించి నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చడం వల్ల నాలుగైదు రోజులుగా రాష్ట్రం నుంచి వివిధ రాష్ట్రాలకు కోడిగుడ్లు ఎగుమతి అవుతున్నాయి. దీంతో ధరలు మళ్లీ పుంజుకున్నాయి. మంగళవారం మార్కెట్‌ ధరలతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు.  

ఇబ్బందులు ఇలా... 
► కోడి గుడ్ల ఉత్పత్తిలో దేశంలో ద్వితీయ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మూడో వంతు ఇతర రాష్ట్రానికి ఎగుమతి చేయాలి. 
► కరోనా నేపథ్యంలో స్థానిక వినియోగం తగ్గడంతో గుడ్లు మిగిలిపోవడం మొదలైంది. ఆ వెనువెంటనే వెలువడిన లాక్‌డౌన్‌తో ఎగుమతులపైనా ప్రభావం పడింది.  
► ఎండ పడకపోతే 15 రోజుల వరకు గుడ్లను నిల్వ చేయవచ్చు. ఎండ పడితే వారానికే మురిగిపోతాయి.  
► ఒక దశలో ఒక్కో గుడ్డును రూపాయిన్నరకు కూడా కొనే పరిస్థితి లేకపోయింది. ఫలితంగా నష్టాలు తీవ్రమయ్యాయి. 

లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపుతో..
► జిల్లాల సరిహద్దుల వద్ద, చెక్‌పోస్టుల వద్ద కోడిగుడ్ల వాహనాలను ప్రస్తుతం ఆపడం లేదు. స్థానిక మార్కెట్లకు తరలించుకునే అవకాశం వచ్చింది.   
► అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద సైతం తనిఖీ చేసి పంపిస్తున్నారు. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, అసోం తదితర రాష్ట్రాలకు మళ్లీ రవాణా ఊపందుకుంది. 
►  లాక్‌డౌన్‌ ప్రారంభంలో మాదిరిగా రెండు మూడు రోజులు చెక్‌పోస్టుల వద్ద ఆగిపోయే పరిస్థితి ఇప్పుడు లేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top