కలకలం రేపిన పోస్టర్‌లు

Posters Against CMS IN West Godavari Eluru - Sakshi

సీఎంఎస్‌ను వ్యతిరేకిస్తూ రాతలు

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు : జిల్లాలోని పలు మహిళా కళాశాలల్లో, హాస్టళ్ళ వద్ద రాత్రికి రాత్రి హెచ్చరిక పోస్టర్లు ఏర్పాటుకావడం కలకలం రేపింది. తస్మాత్‌ జాగ్రత్త అంటూ విద్యార్థిని చైతన్య వేదిక పేరుతో ఈపోస్టర్లు వెలిశాయి. రాత్రికి రాత్రే ఈ పోస్టర్లు ఎవరు అంటించారని విద్యార్థినులు, కళాశాల యాజమాన్యాలు చర్చించుకుంటున్నాయి. గతంలో కూడా ఏలూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి మహిళా కళాశాలల వద్ద ఇదే రకమైన పోస్టర్లు వెలిశాయి. ఇప్పుడు తాజాగా ఈ పోస్టర్‌ల పట్ల కలకలం రేగింది. చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్‌)ను వ్యతిరేకిస్తూ ఈ పోస్టర్‌లు ఉన్నాయి. సీఎంఎస్‌ మావోయిస్టు ముసుగు సంఘం అని, మావోయిస్టులతో సంబంధం కలిగి ఉన్న సంస్థ అని పోస్టర్‌లలో ఉంది.

వీరంతా సీఎంఎస్‌ పేరుతో కళాశాలల్లో చొరబడి నూతన విద్యార్థినిలకు స్వాగతం పలుకుతూ వారికి దగ్గరై మావోయిజం వైపు ఆకర్షితులను చేస్తారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పోస్టర్‌లు ఏర్పాటు కావడంతో చర్చనీయాంశం అయ్యింది. విద్యార్థినులకు మాయమాటలతో మావోయిస్టు భావజాలం బోధిస్తారని, మావోయిజం వైపు ఆకర్షితులను చేసి విద్యార్థినులను మావోయిస్టు దళాల్లో చేర్చడం సీఎంఎస్‌ బృందం మహిళల, యువతుల లక్ష్యమని అందువల్ల వీరిని నమ్మవద్దని, కళాశాలల్లో అనుమతించవద్దని పోస్టర్‌లలో పేర్కొన్నారు. పోస్టర్‌లలో మావోయిస్టు, మావోయిస్టు సానుభూతిపరుల చిత్రాలను ముద్రించారు. మావోయిస్టుల్లో పనిచేసిన అన్నపూర్ణ, సిఫోరా, ఆమె కుమార్తెలు ఇందు, మంజు, మావోయిస్టు సానుభూతిపరురాలు సంధ్య ఫొటోలు పోస్టర్‌లలో ముద్రించారు.

వీరు కళాశాల ప్రారంభం సమయంలో ఆయా కళాశాలల వద్దకు వచ్చి నూతనంగా చేరే విద్యార్థినులను మావోయిస్టు భావజాలం వైపు ఆకర్షించేలా పాటలు, మావోయిస్టుకు సంబంధించిన కథనాలను వివరిస్తూ ఆకర్షితులను చేస్తారని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రత్యేకంగా సీఎంఎస్‌ సభ్యులు మావోయిస్టు రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీగా పనిచేస్తుందని పోలీసుల వద్ద కచ్చితమైన సమాచారం ఉంది. దీంతో సీఎంఎస్‌ సభ్యులకు ఆకర్షితులు కావద్దని విద్యార్థిని చైతన్య వేదిక పేరుతో పోస్టర్‌లు వెలవడం చర్చనీయాంశం అయ్యింది.  ఏలూరు, తాడేపల్లిగూడెం మహిళా కళాశాలల వద్ద, హాస్టళ్ళ వద్ద ఈ పోస్టర్‌లను అతికించారు. సీఎంఎస్‌ సభ్యులు పట్టుదలతో కొంతమందినైనా ఆకర్షితులు చేయకపోతారా అని మావోయిస్టు సంఘం ఆయా కళాశాలల వద్దకు చైతన్య మహిళా సంఘం పేరుతో పంపుతున్నట్లు తెలుస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top