
పుంగనూరులో తీవ్రవాదులు?.. ముమ్మరంగా పోలీసు తనిఖీలు
అది చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని నక్కబండ ప్రాంతం. అర్ధరాత్రి ఉన్నట్టుండి పోలీసులు వచ్చిపడ్డారు.
అది చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని నక్కబండ ప్రాంతం. అర్ధరాత్రి ఉన్నట్టుండి పోలీసులు వచ్చిపడ్డారు. ఆ ప్రాంతం నుంచి ఎవరూ బయటకు వెళ్లేందుకు వీల్లేదన్నారు. తమిళనాడులోని నైవేలికి చెందిన సీఐఎస్‌ఎఫ్ దళాలు , స్థానిక ఎస్టీఎఫ్ దళాలు ఆయుధాలతో ఇల్లిల్లూ గాలించారు. పుంగనూరుకు తూర్పుదిశలో ఉన్న నక్కబండ ప్రాంతంలో సుమారు 1200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ ప్రాంతంలో అధికశాతం ఇతర ప్రాంతాలవారే ఉన్నారు.
ఈ ప్రాంతంపై పోలీసులకు అనుమానం రావడంతో సీఐ సురేంద్రరెడ్డి, ఎస్‌ఐ శంకరమల్లయ్య కలసి ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం నైవేలికి చెందిన సీఐఎస్‌ఎఫ్ దళాలను, ఎస్టీఎఫ్ దళాలను పుంగనూరుకు పిలిపించుకున్నారు. బుధవారం రాత్రి 1:30 గంటలకు ప్రైవేటు వాహనాలలో నక్కబండ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. కాలనీ చుట్టూ సాయుధ పోలీసులను ఏర్పాటుచేసి, ప్రతి ఇల్లు సోదా చేశారు. అనుమానితులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
కాగా పుంగనూరుకు రంగూన్, మహారాష్ట్ర, కాశ్మీర్, బీహార్ నుంచి తీవ్రవాదులు వస్తున్నందున పోలీసులు తనిఖీలు చేశారని పట్టణంలో చర్చ సాగుతోంది. ఈ తనిఖీలలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.