పురోహితులపై పోలీసుల ఆంక్షలు..! | police sanctions on Priests | Sakshi
Sakshi News home page

పురోహితులపై పోలీసుల ఆంక్షలు..!

Jul 18 2015 1:23 AM | Updated on Aug 21 2018 9:06 PM

కోటిలింగాల ఘాట్‌లో భక్తులకు అసౌకర్యంగా మారుతున్నారని ఆరోపిస్తూ పురోహితులను ఘాట్ల నుంచి బయటకు వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరికలు

కోటిలింగాల ఘాట్ (రాజమండ్రి) : కోటిలింగాల ఘాట్‌లో భక్తులకు అసౌకర్యంగా మారుతున్నారని ఆరోపిస్తూ పురోహితులను ఘాట్ల నుంచి బయటకు వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేయడంతో వారు ఆందోళనకు దిగారు. దీంతో శుక్రవారం తెల్లవారు జామున 4 గంటల నుంచి 6 గంటల వరకు పురోహితుల ఆందోళన నేపథ్యంలో పిండ ప్రదానాది కార్యక్రమాలు నిలిచిపోయాయి.  ఘాట్‌లో సంకల్పం పేరు తో ఎక్కువ సమయాన్ని గడుపుతూ భక్తుల రద్దీకి పురోహితులే కారణమవుతున్నారని,   ఘాట్లలో ప్రవేశించరాదని ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున ఓ పురోహితుడు ఘాట్‌లో సంకల్పం చెబుతుం డగా పోలీసులు అతడిపై దౌర్జన్యానికి దిగినట్టు పలువురు  ఆరోపించారు.  సుమారు వెయ్యి మంది పురోహితులు ఆందోళనకు దిగారు. రెండు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. అర్చక సంఘం ట్రెజరర్ పోరంకి సాయిరాంశర్మ తమ సమస్య పరిష్కరించాలని ఏఎస్పీ రామ్‌ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన పురోహితులు ఎక్కువ సమయం ఘాట్లలో భక్తులను నిలిపివేయడం వల్ల రద్దీ పెరిగిపోతుందన్నారు. భక్తులకు ఇబ్బంది కలిగించనంత వరకు తీర్థవిధులకు ఎటువంటి ఆటంకం కలిగించమని ఆయన చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
 
 డీఐజీని ముట్టడించిన పురోహితులు
 పుష్కరఘాట్ (రాజమండ్రి) : గోదావరి పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటే పోలీసులు ఓవరాక్షన్ వల్ల పురోహితులు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా పురోహితులు సహనం వహించారు. శుక్రవారం పుష్కర ఘాట్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు పురోహితులను బయటకు వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. అంతటితో ఆగకుండా వాకిటాకీలతో పురోహితులను కొట్టారు. ఆగ్రహించిన పురోహితులు పోలీసులకు వ్యతిరేకకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న డీఐజీ హరిప్రీత్‌సింగ్ పురోహితులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. పిండ ప్రదానాలు, గోదావరి వచనం తదితర కార్యక్రమాలను నిలిపివేసి పోలీసులు తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. వ్రత పురోహితులు సంఘం అధ్యక్షుడు ప్రసాద్ డీఐజీతో జరిపిన చర్చలు విఫలమయ్యా యి. లక్ష మంది పురోహితులు దరఖాస్తులు చేసుకుంటే కేవలం ఐదు వేల మంది పురోహితులకు మాత్రమే పాస్ ఇచ్చి ఘాట్‌లోకి అనుమతించారన్నారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు అనుమతించిన పురోహితులతో కార్యక్రమాలు నిర్వహించడం కష్టమన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement