సిబ్బంది పనితీరు భేష్‌ ! | Sakshi
Sakshi News home page

సిబ్బంది పనితీరు భేష్‌ !

Published Sun, Jul 29 2018 11:25 AM

Police performance Half year review  - Sakshi

గుంటూరు: ప్రస్తుతం రూరల్‌ జిల్లా పరిధిలోని పోలీసుల పనితీరు మెరుగుపడిందని రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ వెంకటప్పల నాయుడు కొనియాడారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ నిర్ధేసించిన లక్ష్యాలను చేరుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. చార్జిషీట్‌లను సకాలంలో వేస్తూ రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచామన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో రూరల్‌ జిల్లా అర్ధ సంవత్సర నేర సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వమించారు. ముందుగా పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సాధించిన విజయాలు, చేపట్టాల్సిన చర్యలు, నిర్ధేసించిన లక్ష్యాలు, దర్యాప్తుల్లో తీసుకోవాల్సిన మెలకువలు తదితర అంశాలను వివరించారు.

 సమావేశానికి అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ జడ్జి ఎన్‌.నరసింహారావు, అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జడ్జి నరసింహారావు మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తు పారదర్శకంగా కొనసాగిస్తే విచారణ సమయంలో ఎలాంటి లోపాలు లేకుండా నిజమైన బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. సివిల్‌ వివాదాల్లో ప్రజలు న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించి న్యాయం పొందేలా మరింతగా అవగాహన కల్పించాలని సూచించారు. ఐజీ కేవీవీ గోపాలరావు సలహాలతో రూరల్‌ ఎస్పీ సమయస్ఫూర్తిగా సిబ్బంది విభజనను పూర్తి చేశారని ఎస్పీ సీహెచ్‌ విజయారావు కొనియాడారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ అధికారుల సూచనల మేరకు పనిచేస్తే నిర్ధేసించుకునే లక్ష్యాలను సునాయాసంగా చేరుకోవచ్చన్నారు. 

త్వరలో వింగ్స్‌ యాప్‌
జాయింట్‌ కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ.. స్థలాలు, పొలాలు ఆక్రమణ సమయంలో బాధితులకు సరైన సూచనలు ఇచ్చి వారికి అవగాహన కల్పించాలని చెప్పారు. రెవెన్యూ, పోలీస్‌శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగం ప్రొఫెసర్‌ టీటీకే రెడ్డి, సీనియర్‌ సివిల్‌ జడ్జి తేజేవంత్‌లు మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసులు తీసుకోవాల్సిన మెలకువలను వివరించారు. ఎస్పీ సీహెచ్‌ వెంకటప్పల నాయుడు మాట్లాడుతూ మహిళలపై వేధింపుల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సబల కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. నెల రోజుల వ్యవధిలో 300కు పైగా బాధితుల నుంచి ఫిర్యాదు అందాయని చెప్పారు. 

త్వరలో వింగ్స్‌ పేరుతో నూతన యాప్‌ను రూపొందించి భద్ర, బ్లూకోట్స్‌ను అనుసంధానం చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. వృద్ధుల కోసం ముదిమ పేరుతో కూడ నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అర్బన్, రూరల్‌ సిబ్బంది విభజన పూర్తి చేసి అర్హులైన 164 మందికి ఉద్యోగోన్నతులు కల్పించామన్నారు. అనంతరం సబల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో లక్ష్యాలను చేరుకుంటున్నామని తెలిపారు. అనంతరం విధినిర్వహణలో ప్రతిభను చూపిన 84 మందికి శోభిత, శోధన, స్పందన, సబల అవార్డులను అందజేశారు. అతిథులకు మొక్కులు అందజేసి ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఆర్డీవో నాగబాబు, సీనియర్‌ సిటిజన్స్‌ అండ్‌ డిజేబుల్‌ ఏడీ కే పద్మ సుందరి, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, వివిధ విభాగాల అదికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement