పోలీస్‌ లాంఛనాలతో జాగిలం ‘ప్రాంకీ’ అంత్యక్రియలు !

Police Official Funeral For Police Dog Pranky In Guntur - Sakshi

పదేళ్ల పాటు పోలీస్‌శాఖలో సేవలు

నివాళులర్పించిన ఏఆర్‌ ఏఎస్పీ, డీఎస్పీ, సిబ్బంది

పేలుడు పదార్థాలను గుర్తించడంలో దిట్ట

గుంటూరు: నిత్యం విధినిర్వహణలో పోలీసులకు చేదోడు వాదోడుగా నిలిచింది. ఎన్నో సాహసాలకు ప్రతీకగా గుర్తింపుపొందింది. మావోయిస్టులు పెట్టిన మందుపాతరలను ముందే పసిగట్టి మన్ననలు పొందింది. పదేళ్ల పాటు పోలీసు శాఖలో సేవలందించి శాశ్వత విశ్రాంతిలోకి వెళ్లిపోయింది. పోలీస్‌ జాగిలం ప్రాంకీ(13) అనారోగ్యం కారణంగా బుధవారం తెల్లవారు జామున మృతి చెందింది. పోలీస్‌ క్వార్టర్స్‌లో పోలీస్‌ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి సంతాపం తెలిపారు. ఆర్మడ్‌ రిజర్వ్‌ అదనపు ఎస్పీ ప్రసాద్, డీఎస్పీ బి.సత్యనారాయణ, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది గౌరవ వందనం చేసి తుది వీడ్కోలు పలికారు.

దటీజ్‌ ప్రాంకీ..
ప్రాంకీ 2007లో పోలీస్‌శాఖలోకి అడుగుపెట్టి హైదరాబాద్‌లోని మొయినాబాద్‌ శిక్షణా కేంద్రంలో ఎక్స్‌ప్లోజీవ్స్‌ ఐడెంటిఫికేషన్‌ విభాగంలో 9 నెలల శిక్షణను పూర్తి చేసుకుంది. అనంతరం 2008లో జిల్లా పోలీస్‌ బలగాల్లో చేరింది.  2010లో        బెల్లంకొండ మండలంలో మూడు ప్రాంతాల్లో మవోయిస్టులు అమర్చిన ల్యాండ్‌మైన్స్‌ను గుర్తించి ప్రశంసలు పొందింది. 2011లో రాజుపాలెం మండలంలో రెండు ప్రాంతాల్లో మావోయిస్టులు పెట్టిన మందుపాతరను గుర్తించి పోలీస్‌శాఖలో తనకంటూ ప్రత్యేకను తెచ్చుకుంది. ఈ క్రమంలో మంగళవారం అనారోగ్యానికిగురైన ప్రాంకీ చికిత్స పొందుతూ  మృతి చెందింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top