ప్రశ్నించినందుకు ఈడ్చుకెళ్లారు

Police Attack on YSRCP Corporater - Sakshi

కార్పొరేటర్‌పై పోలీస్‌ జులుం

పచ్చనేతల ఒత్తిడితో ఖాకీల దూకుడు

స్టేషన్‌ వద్దే బైఠాయించిన కార్పొరేటర్‌ కిశోర్‌

తూర్పుగోదావరి, కాకినాడ: నియంతృత్వధోరణిలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఏకపక్షంగా ఓ కమ్యూనిటీహాలు ప్రారంభించేందుకు చేసిన ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెండువర్గాల మధ్య వివాదాన్ని రేపేలా వ్యవహరించిన ఆయన తీరును ప్రశ్నించిన వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్‌ ఎంజీకే కిశోర్‌పై పోలీసులు జులుం ప్రదర్శించి ఈడ్చుకు వెళ్లిన వైనంపై స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. పోలీసులు, ఎమ్మెల్యే కొండబాబు తీరుపై ఆగ్రహించిన కార్పొరేటర్‌ పోలీసుస్టేషన్‌ముందే నిరసనకు దిగడం, విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ సిటీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే...
కాకినాడ జగన్నాథపురం చిన్నమార్కెట్‌లో సుమారు 400 మంది చిరు వ్యాపారాలు సాగిస్తున్నారు. వీరికి అక్కడ ఓ కమ్యూనిటీ హాలు నిర్మాణం చేపట్టాలని చాలా కాలంగా ప్రయత్నం జరుగుతోంది. అనేక వివాదాలు అనంతరం వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్‌ ఎంజీకే కిషోర్‌ న్యాయపరమైన అవరోధాలను పరిష్కరించి కార్పొరేషన్‌ నిధులతో ఇటీవలే అక్కడి కమ్యూనిటీహాలును పూర్తి చేయించారు. స్థానికంగా ఉండే డ్వాక్రా సంఘాల సమావేశాలకు, పింఛన్ల పంపిణీతోపాటు మార్కెట్‌లోని వ్యాపారులకు ఉపయోగపడేలా ఈ కమ్యూనిటీహాలును వినియోగించాలన్న ప్రతిపాదన ఉంది. అయితే ఎమ్మెల్యే వనమాడి ఆ ప్రాంతానికి సంబంధం లేని వేరొక వర్గానికి కమ్యూనిటీ హాలు కేటాయించేందుకు హామీ ఇచ్చారంటూ సదరు అసోసియేషన్‌ బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమం వద్ద ఫ్లెక్సీ పెట్టడంతో వివాదం రాజుకుంది. విషయం తెలుసుకున్న కార్పొరేటర్‌ కిశోర్‌ అక్కడికి చేరుకుని ఓపక్క స్థానిక వ్యాపారులకు, మరో అసోసియేషన్‌కు ఒకరికి తెలియకుండా ఒకరికి కమ్యూనిటీహాలు మీదేనంటూ హామీ ఇచ్చి ఎమ్మెల్యే వనమాడి ఇద్దరి మధ్య వివాదం రేపడం సరికాదని, దీనిపై స్పష్టత ఇచ్చి ప్రారంభించాలంటూ నిరసనకు దిగారు.

ఇంతలో అక్కడికి చేరుకున్న కొంతమంది టీడీపీ కార్యకర్తలు కిశోర్‌తో వాగ్వివాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఏకపక్షంగా కార్పొరేటర్‌ కిశోర్‌ను బలవంతంగా ఈడ్చుకుని వెళ్లి జీపులో పోలీసుస్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌కు వెళ్లాక కార్పొరేటర్‌ కిశోర్‌ అక్కడే బైఠాయించి నిరసనకు దిగడంతో విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పార్టీ శ్రేణులతో అక్కడికి చేరుకుని పోలీసుల తీరుపై మండిపడ్డారు. పోలీసుశాఖ అధికార పార్టీ కనుసన్నల్లో ఏకపక్షంగా వ్యవహరించడం సమంజసంకాదని, అక్కడ వివాదానికి కారణమైన టీడీపీ శ్రేణులను వదిలి ప్రజాప్రతినిధిగా ఉన్న కిశోర్‌పై దుందుడుకుగా వ్యవహరించడం మంచిదికాదని మండిపడ్డారు. స్టేషన్‌ నుంచి నేరుగా ద్వారంపూడితో పాటు పార్టీశ్రేణులందరూ చిన్నమార్కెట్‌ వద్ద ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లి ఎమ్మెల్యే వనమాడిని నిలదీశారు.

ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టి సమస్యను పరిష్కరించకుండా ఎలా ప్రారంభోత్సవం చేస్తారంటూ ద్వారంపూడి కొండబాబును నిలదీశారు. ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇలా తొందరపాటు చర్యల ద్వారా అశాంతిని రేకెత్తించడం మంచిదికాదని ద్వారంపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వనమాడిని ద్వారంపూడి గట్టిగా నిలదీసిన నేపథ్యంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున మోహరించి తమ తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఆ కమ్యూనిటీ హాలును స్థానికులకే కేటాయిస్తానని ఎమ్మెల్యే చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే వనమాడితోపాటు పోలీసులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top