అంగన్‌వాడీల్లో ఆటలు లేవు

Play Equipments Not Available In Anganwadi Centre - Sakshi

సాక్షి, చిల్లకూరు (నెల్లూరు): ఆట వస్తువులు తుప్పు పట్టిపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఆటలకు దూరమవుతున్నారు. కార్పొరేట్‌కు దీటుగా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణను చేపడతామని గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసింది. అయితే ఎన్నికలు సమీపంచే సమయంలో భారీగా నిధులను ఐసీడీఎస్‌కు విడుదల చేస్తున్నట్టు ప్రకటించి, ఎన్నికలు రావడంతో ఏమీ చేయలేమని చేతులెత్తేసింది. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో సరైన వసతులు లేక చిన్నారులు ఆటలకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపితే అక్కడ ఆటలు ఆడుకునేందుకు అవసరమైన సామగ్రి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఫలితంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య తగ్గనుంది.

మండలంలో ఇది పరిస్థితి
చిల్లకూరు మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాలు గూడూరురూరల్‌ ఐసీడీఎస్‌ పరిధిలోకి వస్తాయి. మండలంలో సుమారు 85 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 11 మినీ కేంద్రాలు కాగా ప్రతి కేంద్రంలో 15 మందికి తక్కువ కాకుండా పిల్లలు ఉన్నారు. వీరంతా ఇంటి నుంచి వచ్చిన తర్వాత కేంద్రంలో ఉండి సాయంత్రం కొద్దిసేపు బయట ఉన్న కొద్ది స్థలంలో ఆడుకుని వెళ్తున్నారు. గతంలో అయితే సగా నికి పైగా కేంద్రాల్లో వివిధ రకాల అట పరికరాలు, బొమ్మలు ఉండేవి. అయితే గత ప్రభుత్వం కేంద్రాలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చి దిద్దుతామని చెప్పి కేంద్రాలకు అవసరమైన ఆట వస్తువలు జాబితాలను తెప్పించుకుంది. ఇందుకు గాను నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఎన్నికలు సమీపంచడంతో వాటి ఊసే ఎత్తలేదు.

పూరి గుడిసెల్లో కేంద్రాలు
చిల్లకూరు మండలంలో కొన్ని అంగన్‌వాడీ కేం ద్రాలకు సొంత భవనాలు ఉండగా మరికొన్ని గతంలో ప్రాథమిక పాఠశాలలకు నిర్మించిన అదనపు గదుల్లో కొనసాగుతున్నాయి. అలాగే 12 కేంద్రాలను అద్దె ఇళ్లలో నడుపుతుండగా వాటిలో అధిక శాతం పూరి గుడిసెల్లో ఉన్నాయి. వీటిని కూడా నిర్మించేందుకు గత ప్రభుత్వ హాయంలో నిధులు విడుదల చేస్తున్నామని చెప్పి కాంట్రార్లకు పనులు అప్పగించారు. వారు పనులు మొదలు పెట్టి నిధులు విడుదల చేయకపోవడంతో మధ్యలోనే నిలిపేసారు. ఇలా అర్ధంతరంగా నిలిచిన భవనాలకు మోక్షం లేకుండా పోయింది. కాగా ప్రస్తుత ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించేలా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఆదేశాలు అందాల్సి ఉంది
అంగన్‌వాడి కేంద్రాలలో మౌళ వసతుల కల్పనకు సంబందించి నివేదకలను పంపేందుకు తాము సిద్దంగా ఉన్నాము. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాల్సి ఉంది. అసంపూర్తి భవనాలకు నిదులు విడుదల చేసి భవనాలను పూర్తి చేయించాలి.
– ఈశ్వరమ్మ, సీడీపీఓ, ఐసీడీఎస్‌ రూరల్‌ ప్రాజెక్ట్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top