నిధుల ‘పంచాయితీ’ | pilot project implementation in panchayat | Sakshi
Sakshi News home page

నిధుల ‘పంచాయితీ’

Published Mon, Nov 4 2013 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM

కొట్టినా దెబ్బ తగలరాదు.. పొడిచినా రక్తం కారకూడదు.. కాల్చినా చనిపోరాదు.. ఈ కోవకు చెందినదే ప్రభుత్వ తాజా పాలసీ.

కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్:  కొట్టినా దెబ్బ తగలరాదు.. పొడిచినా రక్తం కారకూడదు.. కాల్చినా చనిపోరాదు.. ఈ కోవకు చెందినదే ప్రభుత్వ తాజా పాలసీ. అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను ఆయా గ్రామ పంచాయతీలే సమకూర్చుకునేలా ప్రజలపై పన్నుల భారం మోపేందుకు కసరత్తు జరుగుతోంది. పెలైట్ ప్రాజెక్టుగా ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి అమలు చేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలవుతున్న గ్రాంట్లు ఏటా తగ్గిపోతున్న దృష్ట్యా పంచాయతీల్లో ఆర్థిక వనరుల పెంపునకు ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 28న హైదరాబాద్‌లో సీమాంధ్ర జిల్లాల పంచాయతీ అధికారులు, సర్పంచ్‌ల వర్క్‌షాప్‌లో ఈ అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయనున్న మండలంలోని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర మండల అధికారులకు పన్నుల వసూలుపై అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 852 మైనర్, 31 మేజర్ గ్రామ పంచాయతీల నుంచి ఇంటి పన్నులకు సంబంధించి డిమాండ్ మేరకు రూ.9 కోట్ల నుంచి రూ.10 కోట్లు.. మార్కెట్లు, ఇతర షాపింగ్ కాంప్లెక్సుల ద్వారా రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు వసూలవుతున్నాయి.

వీటికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవలే టీఎఫ్‌సీ కింద రూ.15 కోట్లు, ఎస్‌ఎఫ్‌సీ నిధులు రూ.4.96 కోట్లను విడుదల చేశాయి. ఈ మొత్తంతో పాటు వసూలవుతున్న పన్నులు ఏమాత్రం సరిపోకపోవడంతో ఆ భారాన్ని ప్రభుత్వం ప్రజలపైనే మోపేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుత పన్నులతో పాటు ప్రకటనలు, కేబుల్ టీవీ కనెక్షన్లు, సెల్ టవర్లపై ఇప్పుడు వసూలు చేస్తున్న అనుమతి ఫీజుతో పాటు అదనంగా బాదనున్నారు. జీఓ నెంబర్ 67 ప్రకారం బిల్డింగ్ ఫీజు స్కైర్ మీటర్ ప్రకారం రెసిడెన్షియల్, కమర్షియల్‌కు వేర్వేరుగా.. లేఅవుట్లు, నాలుగు చక్రాల వాహనాలకు, చేపలు, ఫల సాయం తదితరాల నుంచి ఆదాయాన్ని పెంచుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. పంచాయతీ పరిధిలో నాలుగు చక్రాల వాహనాలు కలిగిన యజమానుల నుంచి ఏడాదికి కొంత మొత్తాన్ని పన్ను రూపంలో వసూలు చేసే ప్రయత్నం లో భాగంగా ప్రభుత్వం సర్పంచ్‌ల అభిప్రాయాలను తీసుకోనున్నట్లు సమాచారం. ప్రజలకు తెలియకుండా భారం మోపేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement