గోదావరి పుష్కరాలకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో అధికారులు, ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
- నిరీక్షిస్తున్న కుటుంబసభ్యులు
- ఘాట్ల వద్ద చెల్లాచెదురైన భక్తులు
- కానరాని కంట్రోల్ రూమ్‌లు
సాక్షి , రాజమండ్రి/ పుష్కరఘాట్ : గోదావరి పుష్కరాలకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో అధికారులు, ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పుష్కర స్నానానికి లక్షలాది మంది వస్తారని తెలిసినా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం చెందింది. అన్ని ఘాట్ల వద్ద ఊహించని విధంగా భక్తుల తాకిడి పెరిగిపోవడంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన అనేక మంది తమ వారి ఆచూకీ కోల్పోయి విషాదంలో మునిగిపోయారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన 18 ఘాట్లలోనూ అదే దుస్థితి. చివరకు తమ బంధువుల జాడ తెలుసుకోవడం కోసం బాధితులు ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీసుల నుంచి సహకారం కరువైంది. కంట్రోల్ రూంకు వెళ్లి సమాచారం ఇవ్వాలని ప్రయత్నం చేసినా తగినన్ని ఘాట్ల వద్ద అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో తెలియక వందలాది మంది భక్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ముఖ్యంగా పుష్కర ఘాట్ వద్ద పరిస్థితి మరీ దారుణం. చిన్నపిల్లలతో వచ్చిన వారి పరిస్థితి మరీ ఘోరం. తప్పిపోయిన వారిని పసిగట్టి ఒకచోటకు చేర్చడంలో పోలీసు శాఖ పూర్తిగా విఫలమైంది. పూర్తిస్థాయిలో ఎక్కడా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయలేదు. గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రిలో 18 ఘాట్లను ఏర్పాటు చేయగా అన్ని చోట్లా ఇదే సమస్య. మంగళవారం ఉదయం పుష్కరాల ప్రారంభం నేపథ్యంలో ఉదయం 8 గంటల లోపు సుమారు వెయ్యి మంది తప్పిపోయారు. వారిని కుటుంబ సభ్యుల దగ్గరకు చేర్చేందుకు అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడంతో ఒకరి కోసం ఒకరు వెదుకులాట ప్రారంభించి అష్టకష్టాలు పడ్డారు. కొందరు తమ వారిని చేరుకోగా, మరి కొందరు ఎక్కడికి వెళ్లిపోయారో కూడా తెలియని పరిస్థితి.
పుష్కరఘాట్‌లో మూడేళ్ల బాలుడు ఒంటరిగా తిరుగుతుండడాన్ని ఓ భక్తుడు గమనించి చేరదీశాడు. అతడిని సెంట్రల్ కాల్ సెంటర్‌కు తీసుకువచ్చాడు. ఆ బాలుడు తన పేరు గౌతమ్ అని, తన తండ్రి పేరు ఈశ్వర్, తల్లి సుమతి అని చెప్పాడు. విషయాన్ని మైకులో అనౌన్స్ చేశారు. అయినా ఎవరూ స్పందించలేదు. దీంతో ఆ బాలుడి దుఃఖానికి అంతులేకుండా పోయింది. తన తల్లిదండ్రులు కనిపించక ఆ బాలుడు, బాలుడు ఏమయ్యాడో తెలియక తల్లిదండ్రులు నరకయాతన అనుభవించారు. పుష్కర సిబ్బంది మైకులో అనౌన్స్ చేసినా బాలుడి తల్లిదండ్రులకు విషయం చేరలేదు.