అత్యవసరమా.. అయితే రావొద్దు! | PHC Hospital Staff Neglects Their Duty On Sunday In Srikakulam | Sakshi
Sakshi News home page

అత్యవసరమా.. అయితే రావొద్దు!

Jul 22 2019 8:55 AM | Updated on Jul 22 2019 8:55 AM

PHC Hospital Staff Neglects Their Duty On Sunday In Srikakulam - Sakshi

రాజాం రూరల్‌ : బొద్దాంలో ఇలా సిబ్బంది వైద్యసేవలు

సాక్షి, శ్రీకాకుళం: పీహెచ్‌సీల్లో వైద్య సేవలు తీసికట్టుగా మారాయి. సిబ్బంది కొరతతోపాటు అరకొర మందులతో నెట్టుకొస్తున్నారు. ఆదివారం అత్యవసర కేసులు వస్తే చేతులెత్తేస్తున్నారు. ఇక్కడ వైద్యులు డుమ్మా కొట్టడం, లేదా ఉదయం వచ్చి వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. నిత్యం పాముకాటు, కుక్కకాటు, గర్భిణులు, ప్రమాద కేసులకు అత్యవసర సేవలందడం లేదు. కొన్నిచోట్ల ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాని ఉచిత సలహా ఇస్తున్నారు. ఈ సందర్భంగా రాజాం నియోజకవర్గంలోని పలు పీహెచ్‌సీల్లో, రాజాం సీహెచ్‌సీలో సాక్షి విజిట్‌ చేయగా, వెలుగు చూసిన అంశాలు ఇవి... 

రాజాం సీహెచ్‌సీలో..
 రాజాం పట్టణంతోపాటు రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి, జి.సిగడాం, పొందూరు, చీపురుపల్లి, తెర్లాం, బలిజిపేట తదితర మండలాలకు రాజాం సీహెచ్‌సీయే ప్రధాన కేంద్రం. ఇక్కడ ఆదివారం ఒకరిద్దరు డ్యూటీ డాక్టర్లు మాత్రమే ఉంటున్నారు. ఈ సమయాల్లో ప్రమాద బాధితులు, గర్భిణులు వంటి అత్యవసర కేసులు వస్తే, రాజాంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఆదివారం డ్యూటీ డాక్టర్‌ రవీంద్రబాబుతోపాటు మరో ఐదుగురు సిబ్బంది మాత్రమే కనిపించారు. వంగర మండలం నుంచి వచ్చిన కుక్కకాటు బాధితులకు సేవలందించారు. పలు ప్రాంతాల నుంచి 14 మంది మాత్రమే ఓపీ విభాగంలోనూ, అత్యసవర సేవలు నిమిత్తం వచ్చారు.

బొద్దాంలో..
రాజాం మండల పరిధి బొద్దాం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతీ ఆదివారం ఒకరు తమ వంతు డ్యూటీ వేసుకుని సేవలందిస్తున్నారు. ఆదివారం వైద్యులు ఉండటం లేదు. హెల్త్‌ సూపర్‌వైజర్లు ఎం సావిత్రి, డీవీ నిర్మలదేవి మాత్రమే ఉన్నారు. ఈ సమయంలో ఆస్పత్రికి పది మంది వరకూ వచ్చిన రోగులకు సాధారణ వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ఇక్కడకు వైద్యులు వస్తారని రోగులు వాపోతున్నారు. వీరు కాకుండా ఆదివారం మరో నలుగురు ఇక్కడ వైద్య సేవలు అందించేందుకు ఉన్నప్పటికీ అత్యవసర సేవలు ఇక్కడ లేకపోవడంతో రోగులు రాజాం వెళ్తున్నారు.

సంతకవిటి పీహెచ్‌సీలో..
సంతకవిటి పీహెచ్‌సీలో ఆదివారం వైద్యాధికారి గట్టి భార్గవి హాజరయ్యారు. ఒకరిద్దరు రోగులు మాత్రమే రాగా వీరికి వైద్యాధికారిని ఆరోగ్య తనిఖీలు చేసి మందులు అందించారు. అత్యవసర సేవలకు సంబంధించి మందులు అందుబాటులో లేవు. ప్రసూతి పరికరాలు, పలు రకాల వైద్య పరికరాలు ఇక్కడ లేవు. దీంతో అత్యవసర సమయంలో రోగులను రాజాం తరలిస్తున్నారు.

దారుణంగా వైద్య సేవలు..
ప్రస్తుతం వర్షాకాలం రావడంతో గ్రామాల్లో పలు రకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. వీటికి తోడు గర్భిణులు, ప్రమాద బాధితులు, అత్యవసరంగా వైద్యం అందాల్సిన వారు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 108 వాహన సేవలు గత ప్రభుత్వం కంటే అధికంగా అందుతున్నాయి. ఆశా కార్యకర్తల సేవలు విస్తృతం చేసి సకాలంలో రోగులను ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్య సేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి దారుణంగా ఉంది.

రేగిడిలో...
రేగిడి పీహెచ్‌సీలో అత్యవసర వైద్యసేవలకు మందులు అందుబాటులో లేవు. దీంతో ప్రమాద బాధితులు, గర్భిణులు, పాముకాటు బాధితులు ఇక్కడకు వస్తే రాజాం తరలిస్తున్నారు. ఆదివారం ఈ సేవలు మందగిస్తున్నాయి. వైద్యాధికారి స్వర్ణలత రోగులకు ఆరోగ్య పరీక్షలు అందించారు. ఓపీలో 12 మంది హాజరుకాగా, కొంతమందికి ఇక్కడ మందులు అందజేశారు. మిగిలినవారిని రాజాం తరలించారు.

వంగర పీహెచ్‌సీలో అంతే..
వంగర పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండగా ఒకరు దీర్ఘకాలిక సెలవుపై ఉండగా మరొకరిని నియమించలేదు. దీంతో సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. ఆదివారం సీహెచ్‌వో బీ భాస్కరరావు, ల్యాబ్‌టెక్నీషియన్‌ దమయంతి, హెల్త్‌అసిస్టెంట్‌ వెంకన్న విధుల్లో ఉన్నారు. పొగిరి పీహెచ్‌సీ వైద్యుడు ఆకిరి భార్గవ్‌ ఇక్కడకు ఇన్‌చార్జి వైద్యుడిగా ఉండటంతో రెండు చోట్ల విధులకు హాజరుకాలేని పరిస్థితి. హెచ్‌వీ, ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్టు, అటెండర్‌తోపాటు ఆరోగ్య సిబ్బంది ఆదివారం విధులకు హాజరు కాలేదు. రోగులకు హెల్త్‌ అసిస్టెంట్‌ వెంకన్న, సీహెచ్‌వో భాస్కరరావు వైద్యసేవలందించారు. సిబ్బంది కొరతతో సేవలు డీలాపడుతున్నాయి.

1
1/2

వంగర పీహెచ్‌సీలో ఇలా సిబ్బందితో...

2
2/2

సంతకవిటి పీహెచ్‌సీలో సేవలందిస్తున్న వైద్యాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement