‘పేర్నాటి’ సేవలు అభినందనీయం

Pernati Trust Supply Goods For Titly Cyclone - Sakshi

తిత్లీ బాధితులకు రూ.70 లక్షల నిత్యావసర సరుకుల పంపిణీ

సరుకుల లారీలను జెండా ఊపి పంపిన మాజీ మంత్రి ఆనం, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి

నెల్లూరు(సెంట్రల్‌): పేర్నాటి చారిటబుల్‌ ట్రస్టు నిర్వాహకుడు పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని, వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. పేర్నాటి చారిటబుల్‌ ట్రస్టు శ్రీకాకుళం జిల్లాలోని తిత్లీ తుపాను బాధితుల కోసం  రూ.70లక్షల విలువైన నిత్యావసర సరుకులు, వంట సామగ్రిని వితరణగా అందజేశారు. ఇందుకు సంబంధించిన వాహనాలను మాగుంటలేఅవుట్‌లోని పేర్నాటి కార్యాలయంలో ఆనం రామనారాణరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామానారాయణరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు తుపాను బాధితుల కోసం శ్యాంప్రసాద్‌రెడ్డి తన ట్రస్ట్‌ ద్వారా పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులను అందజేయడం అభినందనీయమన్నారు. నీలువ నీడ లేని కుటుంబాలకు ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఆదరణ దొరికే పరిస్థితి లేదన్నారు. తన తండ్రి జ్ఞాపకార్థంగా పేదలు, అభాగ్యులు, నిరాశ్రయులైన వారికి తాను ఉన్నానంటూ పేర్నాటి ఆపన్న హస్తం అందిస్తుండడం ఎంతో సంతోషిందగ్గ విషయమన్నారు.

బాధితులకు చేయూతనందించాల్సిన టీడీపీ ప్రభుత్వం ప్రచార ఆర్బాటాలతో సరిపెడుతోందన్నారు.   ప్రభుత్వం చేయాల్సిన సహాయ కార్యక్రమాలను సైతం ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ చేస్తుందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి తన చారిటబుల్‌ ట్రస్టు ద్వారా ఇటీవల కేరళ వరద బాధితులకు పెద్ద ఎత్తున సాయం అందించారని గుర్తు చేశారు. పేర్నాటి ట్రస్టు ద్వారా గూడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో  వైద్యసేవలతో పాటు పేదలకు చేయూతనందిస్తుండడం అభినందించదగ్గ విషయమన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.కోటి విరాళాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. బాధితులను ఆదుకోవడంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎల్లప్పుడూ మందుంటాయన్నారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు తిత్లీ తుపాను బాధితులకు సాయం చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కిలి, పలాసా  ప్రాంతాల్లో ఎక్కువగా నష్టం వాటిల్లిందని, ఆయా ప్రాంతాల్లో సరుకులు పంపిణీ చేస్తామన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో త్వరలో నెల్లూరులో వృద్ధుల ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ పోలుబోయిన రూప్‌కుమార్, హరిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top