ప్రమాదంలో ‘ఓటు’ | People Worried About Voter Ids Missing in Chittoor | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో ‘ఓటు’

Dec 18 2018 11:42 AM | Updated on Dec 18 2018 11:42 AM

People Worried About Voter Ids Missing in Chittoor - Sakshi

‘అందరికీ ఓటు హక్కు’ నినాదం జిల్లాలో అపహాస్యం పాలవుతోంది. ఏకపక్ష పోలింగ్‌ బూత్‌లపై విచారణ నామమాత్రంగా జరుగుతోంది. విచారణకు వెళ్లిన అధికారులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు. దీంతో అంతా బాగుందని రాసుకుంటున్నారు. ఆ పోలింగ్‌ బూత్‌లలో మరోసారి ఏకపక్ష తీర్పు వచ్చే అవకాశమేర్పడింది. పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గం. అక్కడే కొన్ని బూత్‌లలో ఎస్సీలు ఓటేసే పరిస్థితి లేదు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ కమ్మగుట్టపల్లి, బందార్లపల్లి, పేట ఆగ్రహారం గ్రామాల్లోని ఎస్సీల ఓట్లు టీడీపీ నాయకులే వేస్తున్నారు.

చిత్తూరు, సాక్షి: జిల్లాలో ఓటుహక్కు ప్రమాదంలో పడింది. ఏకపక్ష పోలింగ్‌ బూత్‌లపై విచారణ లేకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. కొంతమంది అధికారులు కలెక్టర్‌కు మొరపెట్టుకుంటుండగా.. మరికొందరు ఎందుకొచ్చింది గొడవని ‘అంతా బాగుందని’ రిపోర్టు ఇస్తున్నారు. గత ఎన్నికల్లో 90 శాతం కంటే ఎక్కువ ఓటింగ్‌ నమోదయ్యి.. ఒక్క పార్టీకే ఓట్లన్నీ గంపగుత్తగా పడిన పోలింగ్‌ బూత్‌లపై తాజాగా విచారణ జరుగుతోంది. అక్కడ అన్ని పార్టీల ఓటర్లు ఉన్నారా?.. లేక రిగ్గింగ్‌ జరుగుతోందా? తెలుసుకోడానికి ఎలక్షన్‌ కమిషన్‌ విచారణ చేపట్టింది. విషయ సేకరణ కోసం అలాంటి గ్రామాలకు వెళ్లిన అధికారులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ బూత్‌ ఏజెంట్ల సంతకాలను కూడా తెలుగుదేశం నాయకులే పెట్టి అధికారులను పంపించి వేస్తున్నారు.

అక్కడ ఎస్సీలను ఓట్లు వేయనీయరు..
పూతలపట్టు పేరుకే ఎస్సీ నియోజకవర్గం. అక్కడ ఎస్సీలు స్వేచ్ఛగా ఓటు వేసే పరిస్థితి కూడా లేదు. కమ్మగుట్టపల్లి పోలింగ్‌బూత్‌ నెం 79, బందార్లపల్లి పోలింగ్‌ బూత్‌లు 89,90, పేట ఆగ్రహారం పోలింగ్‌ బూత్‌ నెం. 86లలో ఎస్సీల ఓట్లను టీడీపీ నాయకులు రిగ్గింగ్‌ చేస్తున్నారు. ఓటు వేయడానికి వెళ్లిన వారిపై తెలుగుదేశంనాయకులు దాడులకు తెగబడ్డారని ఎస్సీలు వాపోతున్నారు. గత మూడు విడతలుగా ఓటేయలేదని చెబుతున్నారు. కనీసం 2500 ఓట్లు రిగ్గింగ్‌ చేస్తున్నారని స్థానికులు తెలిపారు. ఈ పోలింగ్‌ బూతుల్లో విచారణ కోసం వెళ్లిన అధికారులు టీడీపీ నాయకుల బెదిరింపులకు తలొగ్గి.. ఎలాంటి అవకతవకలు జరగలేదని నివేదికలో పొందుపరిచారని తెలిసింది. దీనిపై జిల్లా యం త్రాంగం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఎస్సీలు ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలని రాజకీయ వి«శ్లేషకులు డిమాండ్‌ చేస్తున్నారు.

కంగుందిలో మరీ ఘోరం..
కుప్పం మండలం కొత్త ఇండ్లు, చందం,కంగుంది, గుడ్డునాయనపల్లి, అడవిబుదుగూరు తదితర గ్రామాల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి లేదు. ఎన్నికల రోజు పోలింగ్‌ అంతా  ముగిసిన తరువాత.. ఎవరెవరు ఓటేయలేదో వారి ఓట్లన్నీ.. టీడీపీ నాయకులు రిగ్గింగ్‌ చేస్తుంటారు. అక్కడ చనిపోయిన వారి ఓట్లు ఇంకా ఉన్నాయని తెలిసినా అధికారులు తొలగించే సాహసం చేయడం లేదు. కంగుందిలో ఎస్సీలు ఇప్పటికీ ఓటు వినియోగించుకునే స్థితిలో లేరు.

మేం చెప్పినట్లు వినాల్సిందే..
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం తంగేళ్లపాళ్యం, కొణతలేరు, కన్నలి గ్రామాల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటేయలేని పరిస్థితి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అక్కడ టీడీపీ నాయకులదే హవా. ఇద్దరు పెద్ద నాయకులు ఓటర్లను భయపెడుతున్నారు. కచ్చితంగా టీడీపీకి ఓటేయాల్సిందేనని ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. గత ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. టీడీపీ నాయకుల బెదిరింపులకు తట్టుకోలేని బసవన్నగుంట, కత్తివారి కండ్రిగ గ్రామస్తులు దగ్గరలోని బసవన్నగుంటలో పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తంగేళ్లపాళ్యం, కొణతనేరి, కన్నలి గ్రామాల్లో స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కలెక్టర్‌ను కోరుతున్నారు.

వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల సంతకాల ఫోర్జరీ..
ఏకపక్ష ఓటింగ్‌పై విచారణకు వచ్చిన అధికారులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు. అధికారులు వైఎస్సార్‌సీపీ నాయకులను కలవకుండా చూసుకుంటున్నారు. తెలుగుదేశం నాయకులే వైఎస్సార్‌సీపీ బూత్‌ ఏజెంట్ల సంతకాలు పెట్టి అధికారులను పంపిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement