సొంత ఇలాకాలో ఆ ఫలితాలేంటి బాబూ..? | Tirupati: Govt Jr colleges record dismal pass percentage | Sakshi
Sakshi News home page

సొంత ఇలాకాలో ఆ ఫలితాలేంటి బాబూ..?

May 3 2026 5:21 AM | Updated on May 3 2026 5:21 AM

Tirupati: Govt Jr colleges record dismal pass percentage

చిత్తూరు డీఈవో కార్యాలయం

చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో దారుణ విద్యా ఫలితాలు

పది, ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్ర సగటుకంటే వెనుకబడిన పరిస్థితి

కార్పొరేట్‌ వైపు మొగ్గు.. సర్కారు స్కూళ్లపై నిర్లక్ష్యం ఫలితం

టీచర్ల కొరత, మౌలిక సదుపాయాల లోపం ప్రభావం

మాటల్లో ప్రగతి.. ఫలితాల్లో కనిపించని వైనం  

పేద విద్యార్థుల భవిష్యత్‌తో బాబు ప్రభుత్వం చెలగాటం

చిత్తూరు కలెక్టరేట్‌: రాష్ట్ర వ్యాప్తంగా విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని, విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని ప్రచారం చేసుకుంటూ గొప్పలుపోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన సొంత జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు పది, ఇంటర్‌ ఫలితాలు షాకిచ్చాయి. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం కుప్పం చిత్తూరు జిల్లా పరిధిలో ఉండగా.. ఆయన పుట్టి పెరిగిన చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి జిల్లాలో ఉంది. ఇప్పుడు ఈ రెండు జిల్లాలు పది, ఇంటర్‌ ఫలితాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.  రాష్ట్ర సగటుతో పోల్చితే ఈ రెండు జిల్లాల్లో ఫలితాలు అట్టడుగు స్థాయిలో నిలవడం దీనికి కారణం.  చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ విద్యాసంస్థలను గాలికి వదిలేయడం వల్ల పేద విద్యార్థులు బలి అవుతున్నారనే విమర్శలు క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి.  

వంద రోజుల డ్రామా...ఫలితం జీరో! 
విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేశ్‌ 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక అంటూ హడావిడి చేశారు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల కొరతను తీర్చకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా కేవలం గాలిలో మేడలు కట్టిన ఫలితం. పది, ఇంటర్‌ ఫలితాల్లో కనబడిందని విద్యావేత్తలు మండిపడుతున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించామని, అధికారులతో సమీక్షలు చేశామని చెప్పిన మాటలన్నీ నీటి మూటలే అని ఫలితాలు నిరూపించాయి.  టీచర్లపై రాజకీయ ఒత్తిళ్లు, విద్యా వ్యతిరేక విధానాల వల్ల క్షేత్రస్థాయిలో బోధన కుంటుపడుతోంది. 

ప్రపంచ స్థాయి రాజధాని, హైటెక్‌ విద్య అంటూ ప్రగల్భాలు పలికే సీఎంకు తన సొంత జిల్లాల విద్యార్థుల భవిష్యత్‌ పట్టడం లేదని విద్యావేత్తలు మండిపడుతున్నారు. విద్యావ్యవస్థ కుప్పకూలడం వెనుక అధికారుల పర్యవేక్షణ లోపం కంటే, ప్రభుత్వ విధానపరమైన వైఫల్యమే స్పష్టంగా కనిపిస్తోందని, ఇది భవిష్యత్‌ తరాలను దెబ్బతీసే అంశమని విమర్శలు వినిపిస్తున్నారు. ఫలితాలు విడుదలైన ప్రతిసారి ఫలితాలు తగ్గాయని పేర్కొనడమే తప్ప.. ఆ పతనానికి బాధ్యులెవరన్న ప్రశ్నను పాలకులు విస్మరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అట్టడుగు ఫలితాల తీరిది
10వ తరగతి 
 చిత్తూరు జిల్లా ఫలితాల్లో గత ఏడాదిలో సాధించిన 24వ స్థానమే మళ్లీ దక్కింది. కేవలం 76.69 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో అట్టడుగున 24 వ స్థానంలో నిలిచింది. 4,872 మంది ఫెయిల్‌ అయ్యారు. 
తిరుపతి జిల్లా ఫలితాల్లో గత ఏడాది 19 వ స్థానంలో ఉండగా, ఈసారి ఏకంగా 20వ స్థానానికి దిగజారింది. 4,257 మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు.

ఇంటర్మిడియట్‌ 
 చిత్తూరు జిల్లా ఇంటర్మిడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 22వ స్థానంలో నిలబడగా,  సెకండ్‌ ఇయర్‌లో 24వ స్థానంలో ఉంది.  రెండు సంవత్సరాలు కలిపి 7,247 మంది ఫెయిల్‌ అయ్యారు.  
 తిరుపతి జిల్లా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 8, సెకండ్‌ ఇయర్‌లో 11 వ స్థానంలో నిలిచింది.  రెండు సంవత్సరాలు కలిపి 11,813 మంది ఫెయిల్‌ అయ్యారు.  
కుప్పం నియోజకవర్గంలోని చాలా కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం 25 శాతం నుంచి 40 శాతంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement