
బాబు గారడీ
సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఓట్లేసి గెలిపిస్తే రైతులు తీసుకున్న రూ.80 వేల కోట్ల రుణాలను సీఎంగా తొలి సంతకంతోనే మాఫీ చేస్తానని చంద్రబాబు పదేపదే చెప్పారు.
- ప్రచారానికే పథకాలు పరిమితం
- అమలుకు ఆమడదూరం
- రుణమాఫీ, పింఛన్ల మంజూరు ఎన్నడో !
- పేదల గూడుకు మంగళం
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనం
సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల్లో తనకు ఓట్లేసి గెలిపిస్తే రైతులు తీసుకున్న రూ.80 వేల కోట్ల రుణాలను సీఎంగా తొలి సంతకంతోనే మాఫీ చేస్తానని చంద్రబాబు పదేపదే చెప్పారు. బ్యాంకులకు ఎవరూ రుణా లు చెల్లించవద్దంటూ రెచ్చగొట్టారు. డ్వాక్రా రుణాలను సైతం మాఫీ చేస్తామని హామీలు గుప్పించారు. ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులకు ఆశలు కల్పించారు. ఇదంతా నిజమని నమ్మిన ఓటర్లు టీడీపీకి ఓట్లేసి చంద్రబాబును సీఎం చేశారు.
అధికారం చేపట్టిన వెంటనే ఆయన తన విశ్వరూపం చూపడం ప్రారంభించారు. ఎన్నికల హామీలన్నీ తుంగలో తొక్కి ప్రధానంగా అన్నదాతలను వంచించారు.ప్రస్తుతం జిల్లాలో రైతు లు పంట రుణాల రూపంలో రూ.1,944 కోట్లు, బంగారు రుణాల రూపంలో రూ. 2,597 బకాయి ఉన్నారు. ఈ రుణాలన్నింటిని మాఫీ చేస్తానన్న బాబు ఇచ్చిన మాట తప్పి ఒ క్కో కుటుంబానికి రూ.1.5 లక్ష మా త్రమే రుణం మాఫీ చేస్తామని ప్రకటిం చారు.
మాఫీ ఎప్పుడో అని స్పష్టమైన ప్రకటన చేయకుండా అన్నదాతల జీవి తాలతో ఆటలాడుకుంటున్నారు. కనీ సం రీషెడ్యూల్ అయినా చేస్తారనుకుం టే అందుకు రిజర్వ్ బ్యాంకు ససేమిరా అంటోంది. దీంతో రైతులు ఖరీఫ్‌లో రుణం పొందే పరిస్థితి లేకుండా పోయింది. తద్వారా పంటల బీమా సౌకర్యాన్ని సైతం కోల్పోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మాత్రం రుణమాఫీ అమలు చేశామంటూ సంబరాలు చేసుకుంటోంది.
మహిళలకూ తప్పని వంచన
రైతులను వంచించిన చంద్రబాబు మహిళలనూ వదిలిపెట్టలేదు. జిల్లాలోని 44 వేల డ్వాకా గ్రూపులకు సంబంధించిన రూ.400 కోట్ల రుణాలను మాఫీ చేస్తానని ఇచ్చిన హామీని గాలికి వదిలేశారు. ఒక్కో గ్రూప్‌కు కేవలం రూ.లక్ష మాత్రమే మాఫీ అని చెప్పి, అది ఎప్పటి నుంచే స్పష్టం చేయలేదు. ఇక వృద్ధులు, వికలాంగులు, వితంతవులు, చేనేత కార్మికుల పింఛన్లను పెంచుతానని ఇచ్చిన హామీని ఏ మేరకు నిలబెట్టుకుంటారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అధికారంలోకి వస్తే పక్కా గృహాలు నిర్మిస్తామని అప్పట్లో ప్రగల్భాలు పలికిన బాబు సీఎం అయ్యాక ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు.
కొత్త ఇళ్ల సంగతి పక్కన పెడితే నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేసే పరిస్థితులు కరువయ్యాయి. ఇలా ఇచ్చిన హామీలన్నింటిని గాలికొదిలేసిన చంద్రబాబు అన్న క్యాంటీన్లు, 24 గంటల విద్యుత్, వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. వీటిని ఆయన బాకా పత్రికలు పతాకశీర్షికలతో ప్రచురిస్తుండడంపై జనం మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.