ఎందరో మహానుభావులు!

People Donating Food Items During Lockdown - Sakshi

ఆ దేశం ఈ దేశం అనే తేడా లేకుండా కరోనా వైరస్‌ కాటుకు అన్ని దేశాలు బలవుతున్నాయి. ఎక్కడ చూసిన ప్రజలు కరోనా మహమ్మారి పేరు వింటేనే భయపడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరోనా వైరరస్‌ ఒకరి నుంచి మరొకరికి నోటి తుంపర్ల ద్వారా వేగంగా విస్తరిస్తుండటంతో  ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించింది. లాక్‌డౌన్‌ కారణంగా అందరూ ఇంటికే పరిమితమయ్యి పనులన్ని ఆగిపోవడంతో చాలా మంది పేదవారు నిత్యవసరాల కోసం, ఆహారం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే చాలా మంది స్వచ్చందంగా వారికి అండగా నిలుస్తున్నారు. వారిలో కొంత మంది సాక్షికి వారు చేస్తున్న సేవ  కార్యక్రమాలను తెలియజేశారు. వాటిని ఒకసారి పరిశీలిద్దాం. 

హైదరాబాద్‌ మణికొండలోని నక్షత్ర గంగోత్రి అపార్ట్‌మెంట్స్‌, అలోక టౌన్‌షిప్‌ వారు వారికి దగ్గరలో ఉన్న రోజు వారి కూలీ కుటుంబాలకు 55 బ్యాగుల నిత్యవసర సరుకులను అందించి సాయంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో నక్షత్ర అపార్ట్‌మెంట్స్‌ ప్రెసిడెంట్‌ బాల్‌రెడ్డి, జనరల్‌ సెక్రటరీ దిలీప్‌, నరేంద్ర పాల్గొన్నారు. అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న స్థానికులు సహకారంతో పేదలకు సాయం అందించామని వారు తెలిపారు. 

కరోనావైరస్‌ నుంచి ప్రజలను కాపాడటానికి డాక్టర్లు, పోలీసుల వారు ప్రాణాలకు తెగించి తమ విధులను నిర్వహిస్తున్నారు. అయితే ఎండలో పనిచేస్తున్న పోలీసు వారికి నిమ్మరసం అందించి మానవత్వం చాటుకున్నారు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఖమ్మం వాసి వెంకటరామిరెడ్డి. 

కరోనా కాలంలో చిన్నదో పెద్దదో తోటి వారికి ఏదో ఒక సాయం చేస్తూ చాలా మంది వారి సహృదయాన్ని తెలియజేస్తున్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన ప్రతాప్‌రెడ్డి మూడు రోజుల నుంచి మినరల్‌ వాటర్‌, కూల్‌ వాటర్‌ పంపిణీ చేసి మంచి మనసు చాటుకుంటున్నారు. 

అదేవిధంగా హైదరాబాద్‌లో పలు చోట్ల అనేకమంది అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ దినసరి కూలీలకు, వలసకూలీలకు, పేదలకు, భిక్షాటన చేసుకునే వారికి అండగానిలుస్తున్నారు. బషీర్‌, ఉమేష్‌ తమ బృందానికి చెందిన కొంత మందితో కలిసి యల్‌బీ నగర్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా కూకట్‌పల్లిలో సాంబిరెడ్డి, భాస్కర్‌, నర్సింగ్‌రావు, ఝన్సీ బృందం వారికి తోచిన సాయం చేశారు. పేదలకు సాయం అందించారు.   

 కరోనా మహమ్మారి కారణంగా అనాధ శరణలయాలు, వృద్ధాశ్రమలు ఆహారం లేక విలవిలలాడుతున్నాయి. ఉప్పల్‌లోని అభిసాయి శత ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాధాశ్రమంలోని ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న గుప్తా కోట్ల వారికి సాయం అందించారు. తన స్నేహితుడు ప్రణీత్‌ మేరుగతో కలిసి హబ్సీగూడలో ఉంటున్న ప్రణీత్‌  120 కేజీల కూరగాయలను అనాధాశ్రమానికి అందించారు. 

లాక్‌డౌన్‌ కారణంగా కొంతమంది తమ ఊరికి దూరంగా వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా వారి సాయాన్ని అందిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పూణేలో చిక్కుకుపోయిన జుట్టు సింహాచలం ఆంధ్రప్రదేశ్‌ సీఎం రీలీఫ్‌ ఫండ్‌కు 20 వేల రూపాయలు విరాళంగా ఇచ్చి మానవత్వం చాటుకున్నారు. 

నెల్లూరు జిల్లా నందిగుంట మాజీ సర్పంచ్‌ శ్రీవాణి తన సొంత డబ్బులతో పేదలకు కూరగాయాలు, సోప్‌లు పంచిపెట్టారు. కరోనా సయంలో పేదలకు అండగానిలిచారు.

కృష్ణజిల్లాకు చెందిన అగ్రీ పైప్‌లైన్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారు లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి చేయూతనందించారు. నిత్యవసరవస్తువులు 500 కిట్లు నిరుపేదలకు, రోజువారి కూలీలకు, కార్మికులకు అందించారు. ఈ కార్యక్రమంలో అక్కినేని దామోదర్‌, కారుపర్తి సాయికుమార్‌, గుబ్బల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

ప్రగతినగర్‌కు చెందిన శ్రీనిలయం ఓనర్స్‌ అసోసియేషన్‌ వారు లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి 50 వేల రూపాయల విలువగల నిత్యవసర సరుకులను 300 మందికి పంపిణీ చేశారు.  లోకల్‌ వాచ్‌మ్యాన్‌లు, సెక్యూరిటికీ 25కేజీల బియ్యం బ్యాగ్లు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రగతినగర్‌ యస్‌ఐ, శ్రీనిలయం యాజమాన్యం పాల్గొన్నారు. 

ఇలా ఎవరికి తోచిన సాయం వారు చిన్నదో పెద్దదో చేస్తూ కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకుంటూ అండగా నిలుస్తున్నారు. ఇలాంటి వారు ఎందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. మీరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంటే మీరు సాక్షి.కామ్‌ ద్వారా ప్రపంచానికి తెలియజేయండి. మీరు వివరాలు పంపించాల్సిన  మెయిల్‌ఐడీ: webeditor@sakshi.com

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top