కనిపించని అంగన్‌వాడీ కేంద్రం!

People Complaint For Anganwadi Centres - Sakshi

మూడు కేంద్రాలు ఉన్నాయన్న ఎంపీడీఓ

వెతికి చూపించాలని పోలీసులకుతారకరామానగర్‌ వాసుల ఫిర్యాదు

అంగన్‌వాడీ కేంద్రం కోసంఏళ్లకాలంగా ప్రదక్షిణ

ఇబ్బందులు పడుతున్న    చిన్నారులు, గర్భిణులు

అడిగితే అక్రమ కేసులు పెట్టారు

మాకు అంగ న్‌ వాడీ సెంటరు లేదని గత జన్మభూమి గ్రామసభలో సమస్యను నివేదించాం. దీంతో మాపై అధికారులు అక్రమ కేసులు పెట్టారు. ఎంపీడీఓ నియంతలా వ్యవహరిస్తున్నారు. ‘మీ ప్రాంతంలో మూడు అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి.. వెళ్లి వెతుక్కోండి’ అంటూ దూషణలకు దిగారు. ఐసీడీఎస్‌ అధికారులు మా తారకరామానగర్‌ వైపు రావడమే లేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టి పోరాటానికి పూనుకున్నాం. – సత్యశ్రీ, వార్డు సభ్యురాలు, తారకరామానగర్‌

రేణిగుంట: మండలంలోని కరకంబాడి పంచాయతీ తారకరామానగర్‌ 20 వేల జనాభాతో చిన్నపాటి పట్టణాన్ని తలపించేలా ఉంటుంది.. సుమారు ఐదు వేల ఇళ్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడంతా రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కూలీలే అధికం. అయితే, కాలనీ ఏర్పడి 15 ఏళ్లు గడుస్తున్నా ఒక్క అంగన్‌వాడీ కేంద్రం కూడా ఇక్కడ లేకపోవడంతో నిరుపేద కుటుంబాల్లోని చిన్నపిల్లల సంరక్షణ ఇబ్బందికరంగా పరిణమించింది. స్థానికులు ఎన్నోసార్లు ఐసీడీఎస్, ఇతర అధికారులకు తమ గోడు నివేదించినా ఫలితం శూన్యం. విసిగి వేసారిన స్థానికులు పోరుబాట పట్టారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని వెతికిపెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.

వాస్తవానికి తారకరామానగర్‌లో వందల సంఖ్యలో చిన్నారులు ఉన్నారు. పదుల సంఖ్యలో బాలింతలు, గర్భిణులు ఉన్నారు. వీరికి ప్రభుత్వ పౌష్టికాహారం అందడం లేదు. స్థానికులు పలు పర్యాయాలు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇక్కడ అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించే వారే లేరు. పేరుకు ఇద్దరు సూపర్‌వైజర్లు ఉన్నా వారిలో ఒకరు అంగన్‌వాడీ కార్యకర్తగా కొనసాగుతూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరొకరు చంద్రగిరి ప్రాజెక్టు కార్యాలయానికే పరిమితమయ్యారు. ఫలితంగా అంగన్‌వాడీ కేంద్రం విషయమై జన్మభూమి గ్రామసభల్లో స్థానికులు నిలదీసినా వారి గోడు వినేవారు కరువయ్యారు. మరోవైపు, ‘మీకు మూడు అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి.. అవి ఎక్కడున్నాయో వెళ్లి వెతుక్కోండి’ అని ఎంపీడీఓ సుధాకర్‌రావు సెలవివ్వడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. దీంతో స్థానికులు అంగన్‌వాడీ కేంద్రాలను వెతికిపెట్టాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం గమనార్హం!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top