దొంగల పార్టీకి అవకాశమిచ్చారు | People Chance to Thieves Party, says Dharmana Prasada Rao | Sakshi
Sakshi News home page

దొంగల పార్టీకి అవకాశమిచ్చారు

Jul 8 2014 12:06 PM | Updated on Sep 2 2017 10:00 AM

దొంగల పార్టీకి అవకాశమిచ్చారు

దొంగల పార్టీకి అవకాశమిచ్చారు

రాష్ట్ర ప్రజలు మరోసారి మోసపోయి దొంగల పార్టీకి అవకాశమిచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.

నరసన్నపేట: రాష్ట్ర ప్రజలు మరోసారి మోసపోయి దొంగల పార్టీకి అవకాశమిచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో ఓటమికి గురైనప్పటికీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను సమష్టిగా పోషిస్తే భవిష్యత్‌లో అధికారం వైఎస్సార్ సీపీదేనని చెప్పారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సోమవారం జరిగిన పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ జన్మదినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాలించే దొంగలతో పాటు ఈనాడు రామోజీరావు కూడా దొంగల పార్టీలో సూత్రధారేనని చెప్పారు. ఆ మీడియాకు నచ్చనివారు వ్యతిరేకిస్తే వెన్నుపోటు, నచ్చినవారు వ్యతిరేకిస్తే తిరుగబాటు అనేది ఈనాడు నీతి సూత్రమని ఎద్దేవా చేశారు.

చంద్రబాబును అధికారంలోకి తేవడానికే.. ఆయన వస్తే రుణాలు మాఫీ అయిపోతాయంటూ తమ పత్రికలో రాసి ప్రజలను మోసగించారని ధ్వజమెత్తారు. ఇప్పుడు మాత్రం ప్రజలు త్యాగాలకు సిద్ధం కావాలంటూ బాబు అబద్ధాలకు ప్రజల్ని బలిచేసే మరో మోసానికి ఎల్లో మీడియా పాల్పడుతోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఇంకా నెల రోజులు కాకుండానే కప్పదాట్లు వేస్తున్న ప్రభుత్వ తీరును కొద్ది రోజులు వేచి చూద్దామని, ఆ తరువాత నిలదీద్దామని చెప్పారు.

గ్రామాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు పర్యటించినప్పుడు ఎన్నికల హామీలపై నిలదీయాలని సూచించారు. ఇటీవలి శాసనసభ సమావేశాల్లో బాధ్యతగల ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరించిన తీరుతో పార్టీ నాయకుల్లో, ప్రజల్లో రాష్ట్రానికి దిక్సూచి ఆయనేనని, సమర్థమైన పాలన అందించేందుకు సరైన నాయకుడు రాష్ట్రానికి దొరికాడని ప్రజల్లో విశ్వాసం ఏర్పడిందని ధర్మాన చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వి.కళావతి, కె.జోగులు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement