ప్రజా ప్రతినిధులకు చుక్కెదురు

Pasupu Kumkuma Program  Bitter Experience TDP Women Leaders Anantapur - Sakshi

యల్లనూరు : పసుపు కుంకుమ చెక్కుల పంపిణీలో శింగనమల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణికి చేదు అనుభవం ఎదురైంది. సీనియారిటీ ఉన్నా తమకెందుకు చెక్కులు ఇవ్వడం లేదంటూ మహిళలు చుట్టుముట్టారు. అంతే కాదు తాగునీరు తదితర సమస్యలపైనా నిలదీశారు. యల్లనూరు మండలం నీర్జాంపల్లి, వాసాపురం, యల్లనూరు గ్రామాల్లో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు, డ్వాక్రా మహిళలకు పసుపుకుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విప్, ఎమ్మెల్సీ హాజరయ్యారు.

నీర్జాంపల్లిలో వెంకటేశ్వర డ్వాక్రా సభ్యులు సీనియారిటీ కలిగిన తమ సంఘానికి పసుపు కుంకుమ డబ్బు ఎందుకు మంజూరు కాలేదో చెప్పాలని పట్టుబట్టారు. అదే గ్రామానికి చెందిన రాముడు అనే వ్యక్తి తన కూతురుకు పెళ్లయ్యి ఆరు నెలలు దాటినా ‘పెళ్లి కానుక’ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, తక్షణమే పరిష్కరించాలని పలువురు మహిళలు నిలదీశారు. సమస్యలపై ప్రజలు ప్రశ్నల వర్షంతో విప్, ఎమ్మెల్సీకి ముచ్చెమటలు పట్టించారు.

చెరువులు నింపకపోవడం వల్లే నీటి ఎద్దడి
పుట్లూరు: పుట్లూరు మండలం కోమటికుంటలో పసుపు కుంకుమ కార్యక్రమానికి వస్తున్న విప్‌ యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణిల కాన్వాయ్‌ను చెరువు కట్టపైనే గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని చెబితే ఏనాడైనా పట్టించుకున్నారా అంటూ మండిపడ్డారు. తమ కష్టాలను స్వయంగా చూడాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీంతో వారు గ్రామస్తులతో కలిసి గ్రామంలో పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. అనంతరం ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలోనూ ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. చెరువులను నీటితో ఎందుకు నింపలేదని ప్రశ్నించారు. ‘ఎమ్మెల్యే డౌన్‌ డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు. దీంతో తాడిపత్రి రూరల్‌ సీఐ నారాయణరెడ్డి, ఎస్‌ఐ వంశీకృష్ణ, స్పెషల్‌ పార్టీ పోలీసులతో కలిసి నిరసనకారులను సభా ప్రాంగణం నుంచి దూరంగా పంపించేశారు.

సమస్యలపై ప్రశ్నించినందుకు దాడియత్నం 
కళ్యాణదుర్గం: సమస్యలపై ప్రశ్నించేందుకు వచ్చిన వారిపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించిన సంఘటన కొత్తూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో పసుపు– కుంకుమ కార్యక్రమం కింద మహిళలకు చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి హాజరయ్యారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు ఎర్రిస్వామి, లక్ష్మన్న తదితరులు సభ వద్దకు వెళ్లి గ్రామంలోని అంగన్‌వాడీ భవనం దుస్థితిపై ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. అంతలోగా టీడీపీ కార్యకర్తలు సారాయి గోవిందప్ప, ఊరబావి నరసింహులు, ఐదుకల్లు పాతలింగతో పాటు మరికొందరు గుంపుగా వచ్చి అడ్డుకున్నారు. వాగ్వాదం చేస్తూ తోపులాటకు దిగారు. చివరకు దాడికి యత్నించారు. ఈ ఘర్షణను చిత్రీకరిస్తున్న ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌ను లాక్కుని దృశ్యాలను తొలగించారు. ఘర్షణ జరుగుతుండటంతో ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది నాయకులు అక్కడి నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు.   

చిత్రం.. ‘వంద’ గోవింద 

రొళ్ల: ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను రెట్టింపు చేసినందున లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటాన్ని తీసుకెళ్లాలని తెలుగుదేశం నాయకులు హుకుం జారీ చేశారు. ఫొటోగ్రాఫర్ల ముసుగులో టీడీపీ నాయకులు కొత్త దందాకు తెరలేపారు. రొళ్ల మండలం హొట్టేబెట్ట, రొళ్ల, హులికుంట పంచాయతీ కేంద్రాల్లో శనివారం పింఛన్ల పంపిణీ చేపట్టారు. చంద్రబాబు ఫొటో కోసం పింఛన్‌ దారుల నుంచి పొటోగ్రాఫర్లు రూ.100 చొప్పున వసూలు చేశారు. ఫొటో తీసుకుంటేనే పింఛన్‌ ఇస్తామని.. లేకుంటే లేదని ఖరాకండిగా చెప్పారు. చేసేదిలేక పింఛన్‌దారులు వంద సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇలా రొళ్ల మండలంలో 4,636 మంది పింఛన్‌దారుల నుంచి రూ.4,63,600 వసూలు చేయడానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తరహాలో చంద్రబాబు ఫొటో పేరిట వంద రూపాయలు బాదుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top