
'సీఎం వ్యాఖ్యలతో రైతుల్లో భయాందోళన'
ల్యాండ్ పూలింగ్ కు ఒప్పుకోకుంటే భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయని పార్థసారథి అన్నారు.
హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి భూముల సేకరణ విషయంలో ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని టీడీపీ ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ఆరోపించారు. తమ పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. తమ జీవితాలు ఏమైపోవాలని నిలదీస్తున్నారని చెప్పారు. పచ్చటి పొలాలను ఎందుకు నాశనం చేయబోతున్నారని ప్రశ్నిస్తున్నారన్నారు.
ల్యాండ్ పూలింగ్ కు ఒప్పుకోకుంటే భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. రైతులకు న్యాయం జరగకపోతే వైఎస్సార్ సీపీ వారి తరపున పోరాటం చేస్తుందని హామీయిచ్చారు. తమ పార్టీ రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకంగా కాదని, రైతులకు అండగా నిలబడాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని పార్థసారథి స్పష్టం చేశారు.