ఆగని కన్నీళ్లు...అంతులేని ఆవేదన | Sakshi
Sakshi News home page

ఆగని కన్నీళ్లు

Published Fri, Aug 24 2018 1:34 PM

parents Sad Situation in Chirravuru Students Death Guntur - Sakshi

కళ్లముందు కదలాడుతున్న తమ బిడ్డల జ్ఞాపకాలు చెదిరిపోతాయేమోనని ఆ తల్లి దండ్రులు రెప్పలైనా వాల్చడంలేదు.. తెరలు తెరలుగా ఉబికివస్తున్న కన్నీటిని పంటిబిగువున బంధించి బిడ్డలు చెప్పిన ఊసులను, వారి అల్లరిని పదేపదే గుర్తుచేసుకుంటున్నారు. కృష్ణమ్మకు కానుకేస్తానంటూ చిల్లర డబ్బులు తీసుకెళ్లి ఆ తల్లి గర్భంలోనే కడతేరారా అయ్యా అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. పరామర్శకు వచ్చిన తమ బిడ్డల స్నేహితులను చూసి ‘మాపై పిల్లలు అలిగారమ్మా.. అందుకే తిరిగిరాని లోకాలకు వెళ్లారు’ అంటూ పొగిలిపొగిలి ఏడ్చారు. ఇసుకాసురులు నదీగర్భంలో పాతాళానికి  తవ్విన గోతులు తమ బిడ్డలను మింగేశాయన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక.. కడుపుకోతతో ఎలాబతకాలో అర్థంకాక శూన్యంలోకిబేలగా చూస్తున్నారు.

తాడేపల్లి రూరల్‌: నలుగురు విద్యార్థుల మరణంతో చిర్రావూరు గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. బిడ్డల్ని పొగొట్టుకున్న తల్లిదండ్రులు గర్భశోకంతో తల్లడిల్లిపోతున్నారు. కృష్ణా తీరంలో టీడీపీ నేతల అక్రమ ఇసుక తవ్వకాలు ఆ కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. తల్లిదండ్రుల దుఃఖాన్ని అదుపు చేయడం ఎవరి వల్లా కావడం లేదు. కొడుకుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కుమిలిపోతున్నారు. ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లిపోతున్నారు. గురువారం గుండిమెడ ఇసుక రీచ్‌లో గుంతలో పడి మృతిచెందిన వారిని పరామర్శించేందుకు బంధువులతో పాటు, వడ్లపూడి నాగార్జున హైస్కూల్‌ విద్యార్థులు, చిర్రావూరు జెడ్పీ హైస్కూలు విద్యార్థులు చిర్రావూరు గ్రామానికి చేరుకున్నారు. తొలుత నీలం క్రాంతికుమార్, శశివర్ధన్‌ తల్లిదండ్రుల్ని పరామర్శించారు. కొడుకులు ఉన్న ఫొటోను పట్టుకుని చూపిస్తూ కన్నీరుమున్నీరుగా తండ్రి విలపించాడు. ఆకుకూరలు అమ్ముతూ తన కొడుకులను విద్యావంతుల్ని చేయాలనుకున్నానంటూ బావురుమన్నాడు. నాన్నా, అమ్మా ఒక్కరోజైనా మాతోపాటు ఇంటివద్ద ఉండమని బ్రతిమలాడేవారని...అలా లేకుండా ఉన్నందుకు మా మీద కోపగించుకొని శాశ్వతంగా దూరమయ్యారు అంటూ చిన్న కొడుకు అమ్మాయి వేషధారణతో ఉన్న ఫొటో చూపించి దుఃఖించాడు. పిల్లలు సైతం ఆ తల్లితండ్రుల్ని చూసి కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. తల్లి శేషకుమారి దుఃఖించి స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను బంధువులు ఆసుపత్రికి తరలించారు.

అమ్మా.. అన్నయ్య ఫ్రెండ్స్‌ వచ్చారు
విద్యార్థులు తర్వాత మలమంటి దినేష్‌ ఇంటికి వెళ్లారు. అతడి తమ్ముడు సాయి అమ్మా అన్నయ్య ఫ్రెండ్స్‌ వచ్చారు... అన్నయ్య ఎక్కడకెళ్లాడు అని అడగడంతో ఆ తల్లి దుఃఖాన్ని కట్టడిచేయడం ఎవరివల్లా కాలేదు. తన కొడుకు ప్రోగ్రెస్‌ రిపోర్ట్, వేసిన పెయింటింగ్‌ చూపించి భోరున విలపించింది. తాను కౌలురైతైనప్పటికీ, ఆస్తిపాస్తులు లేకపోయినా తన కొడుకును ఉన్నత చదువులు చదివించాలని  ప్రైవేటు స్కూల్‌లో చదివిస్తున్నానంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

ఒక్కగానొక్కకొడుకు మరణంతో శోకం
విద్యార్థులు అక్కడ నుంచి తాటికోరు సాం బయ్య, లక్ష్మికి ఇంటికి వెళ్లారు. ఒక్కగానొక్క కొడుకు శివ మరణంతో వారు తల్లడిల్లిపోతున్నారు. కృష్ణా నదికి వెళ్తానమ్మా అని అడిగేముందు ఆకలవుతుందంటూ చెప్పడంతో టిఫిన్‌ తీసుకొచ్చానని, టిఫిన్‌ తినకుండానే కృష్ణమ్మను చూసేందుకు పరుగులు తీసాడని  సాంబయ్య విలపించాడు. కొడుకు తిరిగి మరలా వచ్చి అమ్మా కృష్ణమ్మకు దణ్ణం పెట్టుకోవాలి, కానుక వేయాలి అంటూ వెనక్కు వచ్చి డబ్బులు తీసుకువెళ్లాడని, తీరా ఆ కృష్ణమ్మ ఒడిలోనే శాశ్వతంగా నిద్రపోయాడని విద్యార్థులు, టీచర్ల ముందు తల్లి వాపోయింది. విద్యార్థులు మృతి చెందారన్న సం ఘటన తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తల్లితండ్రులను పరామర్శించేందుకు చిర్రావూరు తరలిరావడం విశేషం.

బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
తాడేపల్లి రూరల్‌: నలుగురు విద్యార్థుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం గురువారం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కొక్క విద్యార్థి కుటుంబానికి రూ.2లక్షలు ఇస్తున్నట్లు జిల్లాకు చెందిన మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు తెలియచేశారు. బాధితులను పరామర్శించేందుకు చిర్రావూరు వచ్చిన మంత్రులు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్‌ ఒక్కొక్క కుటుంబానికీ లక్ష రూపాయలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక్కొక్కరికీ రూ.25 వేలు, గంజి చిరంజీవి నలుగురు కుటుంబాలకు రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement