చైతన్య సిరి..క్షీరపురి

Palakollu Constituency Political And Geographical Overview - Sakshi

సాక్షి, పాలకొల్లు : పాలకొల్లు నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. బ్రిటిష్‌ కాలంలోనే వ్యాపార కేంద్రంగా విరాజిల్లింది. కళలకు, కళాకారులకు పుట్టినిల్లుగా పేరొందింది. పారిశ్రామికంగానూ ప్రగతి సాధించింది. రైస్‌మిల్లులకు ప్రసిద్ధి. కొబ్బరి, నిమ్మ, తమలపాకు ఉత్పత్తులు నిత్యం ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి.
 
భౌగోళిక స్వరూపం
పాలకొల్లు నియోజకవర్గం 180చదరపుకిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. తూర్పున వశిష్టగోదావరి, పడమరన భీమవరం, ఉత్తరాన ఆచంట, దక్షిణాన నరసాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. పాలకొల్లు మున్సిపాలిటీలో 31వార్డులు, యలమంచిలి మండలంలో 32 గ్రామాలు, పాలకొల్లు మండలంలో 27 గ్రామాలు, పోడూరు మండలంలో 8 గ్రామాలు కలిపి 67 గ్రామాలతో నియోజకవర్గం విస్తరించింది. 

దిగ్గజ కళాకారుల జన్మస్థానం 
ఈ ప్రాంతం కళాకారులకు పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందింది. ఆ నాటి అత్యం సూర్యం, పినిశెట్టి శ్రీరామమూర్తి దగ్గర నుంచి పద్మశ్రీ అల్లు రామలింగయ్య, ప్రముఖ దర్శకులు  దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, రవిరాజా పినిశెట్టి, ఎస్‌ఎస్‌ రవిచంద్ర, బందెల భాస్కరరావుతోపాటు అనేక మందిని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన ఘనత పాలకొల్లుకు దక్కింది. సినీ రంగంలోని అన్ని విభాగాల్లోనూ పాలకొల్లు మార్కు ఉంటుంది. పంచారామాల్లో ఒకటైన క్షీరారామలింగేశ్వరస్వామి ఇక్కడ కొలువు కావడంతో  ఆ నటరాజస్వామి ఆశీస్సులతో ఇంతమంది కళాకారులు ఉద్భవించారని ప్రతీతి. 

చారిత్రక ప్రాముఖ్యం 
పాలకొల్లు పట్టణం 11 శతాబ్దంలో రెడ్డి రాజుల పాలనలో ఉండేది. ఈ సమయంలోనే క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానం, గాలిగోపురం నిర్మించినట్టు శిలాశాసనాలు చెబుతున్నాయి. పంచారామక్షేత్రాల్లో క్షీరారామం శిరోభాగంగా విరాజిల్లుతోంది.  అలాగే శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి దేవస్థానం, నరసాపురం రోడ్డులోని శ్రీ షిర్డి సాయి మందిరంతోపాటు,  వాయుత్రిలింగ క్షేత్రాలుగా శివదేవునిచిక్కాల, దిగమర్రులోని శివాలయాలు ప్రసిద్ధిచెందాయి. యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచింది. 

వ్యవసాయమే జీవనాధారం 
నియోజకవర్గం ఎక్కువగా గ్రామీణవాతావరణం. ప్రజల జీవనాధారం వ్యవసాయం. ముఖ్యంగా వరి, కొబ్బరి, నిమ్మ, తమలపాకు, అరటి పంటలు సాగవుతాయి.     15ఏళ్లుగా ఆక్వా సాగు విస్తరించింది. వరిచేలు చెరువులుగా మారాయి. ఈ ప్రాంతం నుంచి రోజూ వంద లారీల రొయ్యలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి.  

రాజకీయ నేపథ్యం
పాలకొల్లు నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటివరకు 12సార్లు ఎన్నికలు జరిగాయి.  2004వరకు కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల మధ్యే ప్రధాన పోరు జరిగింది.

  • 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మొదటి ఎమ్మెల్యేగా  కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు గెలుపొందారు.
  • 1955లో అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి, దాసరి పెరుమాళ్లు (ఎస్సీ రిజర్వుడు) కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచారు.
  • 1962లో అద్దేపల్లి సత్యనారాయణమూర్తి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు.
  • 1967లో పోలిశెట్టి శేషావతారం సీపీఎం అభ్యర్థిగా గెలిచారు. 1972లో  చేగొండి వెంకట హరరామజోగయ్య కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.
  • 1978లో  కాంగ్రెస్‌ అభ్యర్థి వర్థినీడి సత్యనారాయణమూర్తి ఎమ్మెల్యేగా గెలిచారు.
  • టీడీపీ ఆవిర్భావంతో  అల్లు వెంకట సత్యనారాయణ 1983,1985,1994,1999 లోనూ విజయం సాధించారు.
  • 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థి చేగొండి వెంకట హరరామజోగయ్య గెలిచారు.
  • 2004లో టీడీపీ అభ్యర్థి సీహెచ్‌ సత్యనారాయణ మూర్తి గెలిచారు.
  • 2009లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి బంగారు ఉషారాణి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు మెగాస్టార్‌ చిరంజీవిపై అనూహ్య విజయం సాధించి సంచలనం సృష్టించారు.  
  • 2014ఎన్నికల్లో  రామానాయుడు గెలిచారు.  

నియోజకవర్గంలో మండలాలు : పాలకొల్లు, యలమంచిలి, పోడూరు
జనాభా : 2,49,569
పురుషులు : 1,25,973
స్త్రీలు : 1,23,447
ఓటర్లు : 1,80,965
పురుషులు : 89,491
స్త్రీలు : 91,435
ఇతరులు : 39 

ముఖ్య సమస్యలివీ.. 

  • పాలకొల్లు పట్టణ  నడిబొడ్డున డంపింగ్‌యార్డుల వల్ల ఇబ్బందులు నెలకొన్నాయి. 
  • పట్టణంలో దమ్మయ్యపత్తి డ్రెయిన్‌ నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి  వైఎస్‌ రాజశేఖరరెడ్డి డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా సుమారు రూ.8కోట్ల నిధులు మంజూరు చేసినా ఇప్పటికీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయి.  
  • గ్రామాల్లో తాగునీటి సమస్య 
  • డ్రెయినేజీ సమస్యలు సతమతం చేస్తున్నాయి.   
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top