breaking news
Chegondi Venkata Harirama Jogaiah
-
జనసేన.. పొత్తులపై గప్‌చుప్
సాక్షి, అమరావతి : పొత్తులతో సహా అనేక అంశాల్లో జనసేన పార్టీ నేతలెవరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశంలేకుండా ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ వారి నోళ్లకు తాళం వేశారు. ‘పొత్తుల గురించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారం ఆధారంగా మాట్లాడకండి. ఈ విషయంలో మేలుచేసే నిర్ణయం నేనే స్వయంగా తీసుకుంటా. మనతో సయోధ్యగా ఉన్న రాజకీయ పక్షాల్లోని చిన్నాచితక నాయకులు మనపై ఏమైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలు ఆ నాయకుని వ్యక్తిగతమైన విమర్శలుగా భావించండి. వాటిని ఆయా పార్టీలకు ఆపాదించొద్దు’.. అంటూ పవన్ తమ పార్టీ నేతలకు స్పష్టమైన సూచన చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ మీడియా విభాగం సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ దృష్టికి తీసుకొచ్చాకే ఎవరిపైన అయినా ఆ విమర్శలు చేయండి.. జనసేన పార్టీ భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని శక్తులు నిరంతరం పనిచేస్తున్నాయని, వాటిని అర్థంచేసుకుని పార్టీ నాయకులు, శ్రేణులు ముందుకు నడవాలని పవన్ సూచించారు. జనసేనకు సానుకూలంగా ఉండే పార్టీలు, రాజకీయ నాయకులకు మన పార్టీపట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బ తీసే కల్పిత సమాచారాన్ని మన శ్రేణులకు చేర్చే కుట్రలకు పాల్పడుతున్నట్లు పార్టీ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని ఆ ప్రకటనలో తెలిపారు. అందువల్ల పార్టీలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ, తీవ్రమైన ప్రతి విమర్శలు, తీవ్రమైన ఆర్థిక నేరాల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకురావాలని.. పార్టీ సూచనలు, సలహా మేరకే నేతలెవరైనా మాట్లాడాలంటూ ఆదేశించారు. పార్టీ నేతలు మాట్లాడే ప్రతి మాట పార్టీపై ప్రభావం చూపుతుందని, కనుక నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థాయి, తీవ్రత హద్దులు దాటని విధంగా మన మాటలు ఉండాలని.. ఒక వ్యక్తి గురించి మాట్లాడే సమయంలో అకారణంగా వారి కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించవద్దని సూచించారు. ‘సరైన ధ్రువపత్రాలు లేకుండా ఎవరిపైనా ఆర్థిక నేరారోపణలు చెయ్యొద్దని.. నేతలకు స్పష్టమైన సూచన చేశారు. ఇక టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే.. పవన్‌కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్న పార్టీ నేతల కోరిక ఎప్పటికీ నెరవేరే అవకాశం ఉండదంటూ మాజీ మంత్రి హరిరామజోగయ్య వంటి వారు ఇటీవల పలు సందర్భాల్లో మాట్లాడుతున్న నేపథ్యంలోనే పవన్ ఈ ప్రకటన జారీచేసి ఉండొచ్చని జనసేనలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. -
చైతన్య సిరి..క్షీరపురి
సాక్షి, పాలకొల్లు : పాలకొల్లు నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. బ్రిటిష్ కాలంలోనే వ్యాపార కేంద్రంగా విరాజిల్లింది. కళలకు, కళాకారులకు పుట్టినిల్లుగా పేరొందింది. పారిశ్రామికంగానూ ప్రగతి సాధించింది. రైస్‌మిల్లులకు ప్రసిద్ధి. కొబ్బరి, నిమ్మ, తమలపాకు ఉత్పత్తులు నిత్యం ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. భౌగోళిక స్వరూపం పాలకొల్లు నియోజకవర్గం 180చదరపుకిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. తూర్పున వశిష్టగోదావరి, పడమరన భీమవరం, ఉత్తరాన ఆచంట, దక్షిణాన నరసాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. పాలకొల్లు మున్సిపాలిటీలో 31వార్డులు, యలమంచిలి మండలంలో 32 గ్రామాలు, పాలకొల్లు మండలంలో 27 గ్రామాలు, పోడూరు మండలంలో 8 గ్రామాలు కలిపి 67 గ్రామాలతో నియోజకవర్గం విస్తరించింది. దిగ్గజ కళాకారుల జన్మస్థానం ఈ ప్రాంతం కళాకారులకు పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందింది. ఆ నాటి అత్యం సూర్యం, పినిశెట్టి శ్రీరామమూర్తి దగ్గర నుంచి పద్మశ్రీ అల్లు రామలింగయ్య, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, రేలంగి నరసింహారావు, రవిరాజా పినిశెట్టి, ఎస్ఎస్ రవిచంద్ర, బందెల భాస్కరరావుతోపాటు అనేక మందిని తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన ఘనత పాలకొల్లుకు దక్కింది. సినీ రంగంలోని అన్ని విభాగాల్లోనూ పాలకొల్లు మార్కు ఉంటుంది. పంచారామాల్లో ఒకటైన క్షీరారామలింగేశ్వరస్వామి ఇక్కడ కొలువు కావడంతో ఆ నటరాజస్వామి ఆశీస్సులతో ఇంతమంది కళాకారులు ఉద్భవించారని ప్రతీతి. చారిత్రక ప్రాముఖ్యం పాలకొల్లు పట్టణం 11 శతాబ్దంలో రెడ్డి రాజుల పాలనలో ఉండేది. ఈ సమయంలోనే క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానం, గాలిగోపురం నిర్మించినట్టు శిలాశాసనాలు చెబుతున్నాయి. పంచారామక్షేత్రాల్లో క్షీరారామం శిరోభాగంగా విరాజిల్లుతోంది. అలాగే శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి దేవస్థానం, నరసాపురం రోడ్డులోని శ్రీ షిర్డి సాయి మందిరంతోపాటు, వాయుత్రిలింగ క్షేత్రాలుగా శివదేవునిచిక్కాల, దిగమర్రులోని శివాలయాలు ప్రసిద్ధిచెందాయి. యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచింది. వ్యవసాయమే జీవనాధారం నియోజకవర్గం ఎక్కువగా గ్రామీణవాతావరణం. ప్రజల జీవనాధారం వ్యవసాయం. ముఖ్యంగా వరి, కొబ్బరి, నిమ్మ, తమలపాకు, అరటి పంటలు సాగవుతాయి. 15ఏళ్లుగా ఆక్వా సాగు విస్తరించింది. వరిచేలు చెరువులుగా మారాయి. ఈ ప్రాంతం నుంచి రోజూ వంద లారీల రొయ్యలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. రాజకీయ నేపథ్యం పాలకొల్లు నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటివరకు 12సార్లు ఎన్నికలు జరిగాయి. 2004వరకు కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల మధ్యే ప్రధాన పోరు జరిగింది. 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మొదటి ఎమ్మెల్యేగా కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి భూపతిరాజు లక్ష్మీ నరసింహరాజు గెలుపొందారు. 1955లో అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి, దాసరి పెరుమాళ్లు (ఎస్సీ రిజర్వుడు) కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచారు. 1962లో అద్దేపల్లి సత్యనారాయణమూర్తి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. 1967లో పోలిశెట్టి శేషావతారం సీపీఎం అభ్యర్థిగా గెలిచారు. 1972లో చేగొండి వెంకట హరరామజోగయ్య కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 1978లో కాంగ్రెస్ అభ్యర్థి వర్థినీడి సత్యనారాయణమూర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ఆవిర్భావంతో అల్లు వెంకట సత్యనారాయణ 1983,1985,1994,1999 లోనూ విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థి చేగొండి వెంకట హరరామజోగయ్య గెలిచారు. 2004లో టీడీపీ అభ్యర్థి సీహెచ్ సత్యనారాయణ మూర్తి గెలిచారు. 2009లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి బంగారు ఉషారాణి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు మెగాస్టార్ చిరంజీవిపై అనూహ్య విజయం సాధించి సంచలనం సృష్టించారు. 2014ఎన్నికల్లో రామానాయుడు గెలిచారు. నియోజకవర్గంలో మండలాలు : పాలకొల్లు, యలమంచిలి, పోడూరు జనాభా : 2,49,569 పురుషులు : 1,25,973 స్త్రీలు : 1,23,447 ఓటర్లు : 1,80,965 పురుషులు : 89,491 స్త్రీలు : 91,435 ఇతరులు : 39 ముఖ్య సమస్యలివీ.. పాలకొల్లు పట్టణ నడిబొడ్డున డంపింగ్‌యార్డుల వల్ల ఇబ్బందులు నెలకొన్నాయి. పట్టణంలో దమ్మయ్యపత్తి డ్రెయిన్ నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా సుమారు రూ.8కోట్ల నిధులు మంజూరు చేసినా ఇప్పటికీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయి. గ్రామాల్లో తాగునీటి సమస్య డ్రెయినేజీ సమస్యలు సతమతం చేస్తున్నాయి. -
రాజకీయ వలసలపై జోగయ్య విశ్లేషణ
పాలకొల్లు టౌన్: నైతిక విలువలను, రాజ్యాంగ సూత్రాలను పక్కనపెట్టి.. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించడం లాంటి జిమ్మిక్కుల వల్ల తెలుగుదేశం పార్టీ బలపడుతుందనేది వట్టి భ్రమ మాత్రమేనని మాజీ ఎంపీ చేగొండి వెంకట హరిరామజోగయ్య పేర్కొన్నారు. ‘ఆంధ్రాలోనూ రాజకీయ వలసలపై విశ్లేషణ’ పేరిట మంగళవారం ఆయనొక ప్రకటన చేశారు. వలసల మంత్రం తెలంగాణలో మంచి ఫలితాలనిచ్చిన మాట నిజమేనన్నారు. తెలంగాణలో మాదిరి ఇక్కడ చంద్రబాబు ఆ విధానాలను అనుసరించలేక బోల్తాపడుతున్న మాట వాస్తవమన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లు పెంచడం లాంటి కొద్దిపాటి సౌకర్యాలతో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారని అభిప్రాయపడ్డారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య, విద్యారంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పేద, మధ్యతరగతి వారిని ఆకట్టుకోగలిగారన్నారు. చంద్రబాబు ఈ రెండేళ్లలో అటువంటి మెగా సంక్షేమ కార్యక్రమాల్లో ఒక్కటీ అమలు చేసింది లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అవినీతి ఊబిలో కూరుకుపోయారని విమర్శిస్తున్న చంద్రబాబు.. రాష్ట్రంలో అభివృద్ధి ముసుగులోను, పట్టిసీమ, రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్న విధానం, పెండింగ్ నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసే ముసుగులో అంచనాలను కొన్ని రెట్లు పెంచి కోట్లాది రూపాయలు అర్జిస్తున్నారనే అపవాదులను ఎలా ఎదుర్కొంటారో చంద్రబాబే చెప్పాలన్నారు.