ప్రకృతి సమతుల్యత లేకే విపత్తులు

Opportunities await architects: Venkaiah Naidu - Sakshi

కేరళ, చెన్నై, విశాఖ ఉపద్రవాలు అందుకే..

ప్రకృతి, సంస్కృతుల పరిరక్షణతోనే భవిష్యత్తు

స్మార్ట్‌ ఇండియాలో యువ ఆర్కిటెక్టులకు కీలక బాధ్యత

మోదీ, చంద్రబాబులు విజన్‌ ఉన్న నేతలు

విజయవాడ స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ మూడో స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

సాక్షి, అమరావతి : ప్రకృతి, సంస్కృతులను పరిరక్షించుకోవడం ద్వారానే మంచి భవిష్యత్తు ఉంటుందని, సమతుల్యత దెబ్బతింటున్నందునే అనేక ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. పర్యావరణ హితంగా భవనాల రూపకల్పన బాధ్యత యువ ఆర్కిటెక్ట్‌లపై ఉందని, స్మార్ట్‌ ఇండియాలో కీలకపాత్ర పోషించాలని సూచించారు. విజయవాడ స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (ఎస్‌పీఏవీ) 3వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడంవల్ల ఇటీవల కేరళ, అంతకు ముందు చెన్నై, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఏర్పడిన విపత్తులను ఉదాహరించారు.

యువ ఆర్కిటెక్టులకు రానున్న కాలంలో అనేక అవకాశాలున్నాయన్నారు. నేటి భవనాల నిర్మాణాల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టడంలేదని, భవన ప్లాను రూపకల్పన సమయంలోనే వీటన్నిటినీ తప్పనిసరిచేయాలని ఆయన సూచించారు. పచ్చదనం, పరిశుభ్రత కలిగిన నగర నిర్మాణాలను చేపట్టాల్సిన, అందుకు అనుగుణమైన ప్రణాళికలు రూపొందించాల్సిన బాధ్యత యువ ఆర్కిటెక్టులపై ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో యువ ఆర్కిటెక్టులపై మరింత బాధ్యత పెరుగుతుందన్నారు.

ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో విజన్‌ ఉన్న నేతలని కొనియాడారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అభివృద్ధితో దేశం ముందుకు వెళ్తోందని, ఈ తరుణంలో యువతకు రానున్న కాలంలో అనేక అవకాశాలు అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఐఐటీ, ఎయిమ్స్, ఎన్‌ఐటీ వంటి అనేక ఉన్నత విద్యా సంస్థలు నెలకొంటున్నాయని, ఎస్‌పీఏవీకి అత్యద్భుతమైన భవనం సమకూరడం ఎంతో ఆనందదాయకమన్నారు.   గవర్నర్‌ నరసింహన్‌ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో.. వేదాల కాలం నుంచే భవన నిర్మాణాలపై అనేక అంశాలు పొందుపరిచి ఉన్నాయని వివరించారు.

నేటి భవనాలలో అనేక లోపాలుంటున్నాయని, రానున్న కాలంలో అన్ని మౌలిక వసతులతో పర్యావరణానికి హాని కలగని రీతిలో భవనాలుండేలా ఆర్కిటెక్టు విద్యార్థులు ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు,  కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎస్‌పీఏవీ చైర్మన్‌ బృందా సోమయా, డైరక్టర్‌ మీనాక్షి జైన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో బంగారు పతకాలు సాధించిన 10 మందికి ఉత్తమ పరిశోధనలు చేసిన 12 మందికి అవార్డులు అందించారు. 2017, 2018లలో విద్యాభ్యాసం పూర్తిచేసిన 280 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. అంతకుముందు.. విజయవాడలో స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ సంస్థ నూతన భవనాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు ప్రారంభించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top