విషాహారం తిని ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మండలపరిధిలోని దౌల్తాబాద్‌లో చోటుచేసుకుంది.
హత్నూర, న్యూస్‌లైన్:
విషాహారం తిని ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మండలపరిధిలోని దౌల్తాబాద్‌లో చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దౌల్తాబాద్‌కు చెందిన టేకు ఏసు, అతని భార్య వరలక్ష్మి ఇంట్లో ఉదయం 10 గంటల సమయంలో పప్పుచారును వండుకున్నారు. దీనిని పొరుగింటిలో ఉన్న కడమంచి మల్కయ్య, అతని భార్య లక్ష్మికి ఇచ్చారు. వీరితో పాటు మరో పొరుగింటిలో ఉన్న గణేష్ కుమార్తె సుజాత, మారెమ్మ కుమారుడు ప్రవీణ్‌లకూ ఇచ్చారు. వారు దీనిని తిన్న వెంటనే విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఇళ్లలోనే అచేతనంగా పడిపోయారు. దీంతో కొంతమందిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే వీరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో స్థానికులు 108 వాహనం సహాయంతో వారిని సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే వీరిలో వరలక్ష్మి, ఏసు, లక్ష్మిని హైదరాబాద్‌లోని గాంధీకి, చిన్నారులు ప్రవీణ్, సుజాతను నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో లక్ష్మి మృతి చెందింది. పప్పుచారులో బల్లి, ఏదైన విష పురుగులు పడి ఉండటంతో వారు అస్వస్థతకు గురైనట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.