‘మహాత్ముని సాక్షిగా ఆగస్టు 15 నుంచి ప్లాస్టిక్‌ను నిషేదిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో నగర పాలక సంస్థ ముందుకెళుతోంది.
సాక్షి ప్రతినిధి, కడప: ‘మహాత్ముని సాక్షిగా ఆగస్టు 15 నుంచి ప్లాస్టిక్‌ను నిషేదిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో నగర పాలక సంస్థ ముందుకెళుతోంది. ప్లాస్టిక్ వస్తువుల క్రయ విక్రయాలను కార్పొరేషన్ పరిధిలో నిషేదం విధించారు. ఆలస్యంగానైనా శుభపరిణామంగా నగరవాసులు భావిస్తున్నారు. పలు దుకాణాలలో ప్లాస్టిక్ వస్తువులను వాడటం లేదు. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కార్పొరేషన్ యంత్రాంగంలో కొంతమంది అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాపారుల నుంచి ఒప్పందం కోసం ఆరాటపడుతున్నట్లు సమాచారం. నగరపాలక సంస్థ ప్లాస్టిక్‌పై నిషేదం విధించడంతో అదే వ్యాపారం చేస్తున్న వారిలో అలజడి అధికమైంది. జిల్లా కేంద్రమైన కడపలో ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసులు విక్రయించే దుకాణాలు వందకు పైగా ఉన్నాయి. బీకేఎం స్ట్రీట్‌లోనే సుమారు 50కి పైగా హోల్‌సేల్, రిటైల్ దుకాణాలు ఉన్నాయి. గతంలో నిషేదం విధించినా పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ వ్యాపారం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం కార్పొరేషన్ అధికారులు గట్టి చర్యలు తీసుకుంటుండటంతో వ్యాపారుల్లో తీవ్ర అలజడి వ్యక్తమవుతోంది.
ఇందుకు కారణం సుమారు రూ.2.5 కోట్ల స్టాకు వ్యాపారుల వద్ద ఉండటమేనని తెలుస్తోంది. దీంతో కార్పొరేషన్‌లో కీలకంగా ఉన్న ఓ అధికారిని వ్యాపారులు సంప్రదించినట్లు సమాచారం. సమయం ఇవ్వండి.. ఉన్న స్టాకును విక్రయించుకుంటాం.. తర్వాత విక్రయాలు చేపట్టమని మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఇందుకు రూ.10లక్షలు నజరానాగా ఇచ్చేందుకు వ్యాపారులు ముందుకువచ్చినట్లు సమాచారం. అయితే రూ.2.5 కోట్ల స్టాకులో 10శాతం ఇవ్వగల్గితే తాను మేనేజ్ చేయగల్గుతానని ఆ అధికారి వివరించినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా బీకేం స్ట్రీట్‌లో పెద్దగా తనిఖీలు చేపట్టలేదని సమాచారం. వాస్తవానికి ప్లాస్టిక్ విక్రయాలు అక్కడే కీలకం. ఇప్పటి వరకూ బీకేఎం స్ట్రీట్‌లో కార్పొరేషన్ అధికారులు దాడులు చేసి రూ.3250 మాత్రమే అపరాధం రాబట్టగల్గిగారు. యంత్రాంగం పనితీరు ఈ వ్యవహారానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇదే విషయమై నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వినోద్‌కుమార్‌ను సంప్రదిస్తే రెండురోజులు మాత్రమే బీకెఎం స్ట్రీట్‌లో దాడులు చేసినట్లు వివరించారు. గురు, శుక్రవారాలలో తనిఖీలు చేపట్టలేదని పేర్కొన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు.